వారం రోజులైనా ఖాతాలలో జమ కాని వైనం
9,967 మంది రైతులకు రూ.141 కోట్ల బాకీ
రైస్‌మిల్లుకు.. ట్రక్ షీట్లో అప్‌లోడ్‌కు ఆలస్యం
కరీంనగర్ జిల్లాలో 38 శాతం రైతులకు చెల్లింపు
ప్రజాపక్షం/ కరీంనగర్ సిటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు వారం పది రోజులు దాటితే గానీ అందుకు సంబంధించిన డబ్బుల చెల్లింపులు జరగడంలేదు. ధాన్యం విక్రయించిన రైతులకు 72 గంటల్లో (మూడు రోజుల్లో) డబ్బు చెల్లిస్తామని పాలకులు ప్రకటించినా ఎక్కడా అమలు జరుతున్న దాఖలాలు కనిపించడంలేదు. డబ్బులు ఎప్పుడొస్తాయోనని ఎదురుచూడక తప్పని దుస్థితి రైతులకు ఎదురవుతోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో ధాన్యం అమ్ముకున్న రైతులకు డబ్బుల చెల్లింపులో వారం రోజుల పాటు జాప్యం జరగడం, రూ.141 కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉండడమే ఇందుకు నిదర్శనం. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూనే కేంద్రంతో కొట్లాడి చి‘వరి’కి మేమే కొంటామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఇప్పటి వరకు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోక& కేంద్రాల నుంచి ధాన్యం రాశులు కదలక.. తరుగు పేరుతో రైస్‌మిల్లర్ల ఒత్తిడితో జరుగుతున్న దోపిడీ.. కమ్ముకున్న మేఘాలతో రైతులు నానా అవస్థలు పడుతుండగా అమ్ముకున్న ధాన్యానికి సైతం వారం రోజులు దాటినా డబ్బుల చెల్లింపులు జరగకపోవడం ధాన్యం సేకరణ పట్ల ప్రభుత్వ చిత్తశుద్దిని స్పష్టం చేస్తోంది. ఫలితంగా ఆలస్యంగానైనా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న సంతోషం కూడా రైతులకు లేకుండా పోయింది. జిల్లాలో యాసంగిలో సాగైన వరిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 346 కొనుగోలు కేంద్రాలలో ఇప్పటివరకు 327 కేంద్రాలు ప్రారంభించారు. అందులో ఇప్పటివరకు కేవలం 92166 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయగా అందులో 89717 మెట్రిక్ టన్నులను రైస్ మిల్లులకు తరలించినట్లు, రైతులకు రూ.141 కోట్ల చెల్లింపులు పెండింగ్‌లోనే ఉన్నాయని రికార్డులు తెలియజేస్తున్నాయి. మరోవైపు రైతులు విక్రయించిన ధాన్యం వివరాలను నమోదు చేసే ట్రక్ షీట్లు పంపడంలో ఆలస్యం, కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో లారీలు, వాహనాలు రోజుల తరబడి నిలిచిపోవడం కూడా కోనుగోళ్లలో జాప్యానికి కారణమవుతున్నాయి.
ధాన్యం పైసలేవీ?
జిల్లాలో ఇప్పటివరకు 12,894 మంది రైతులు 92,166 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించగా దాని విలువ రూ.180 కోట్లు ఉంటుంది. అయితే ఇప్పటివరకు పౌరసరఫరాల సంస్థకు వచ్చిన వివరాల ప్రకారం 7,632 మంది రైతులు 52,923 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మగా రూ.103.73 కోట్లు చెల్లించాల్సిందిగా అన్లైన్లో తాజాగా అప్లోడ్ చేశారు. అందులో 2927 మంది రైతులకు సంబంధించిన 20,356 మెట్రిక్ టన్నులకు గాను కేవలం 38 శాతమే రైతులకు రూ.39 కోట్ల విలువైన డబ్బులు మాత్రమే చెల్లించారు. మిగిలిన 9967 మంది రైతులకు ఇంకా రూ.141 కోట్లను ఎప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారోనని, ఎప్పుడు తమ ఖాతాలో జమ అవుతాయోనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తూకంలోనూ మోసం
క్వింటాల్ బస్తా తూకంలో 6 నుంచి 10 కిలోల మేరకు తేమ శాతం, నాణ్యత పేరుతో తరుగు వేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారన్న ఆరోపణలున్నాయి. రైతులు 100 క్వింటాళ్లు అమ్మితే రూ.20 వేల వరకు నష్టపోతున్నారని రైతులు వాపోతున్నారు. సన్నరకాల ధాన్యం అయితేనే తీసుకుంటామని ఆ ధాన్యాన్ని ముందుగా పంపాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై మిల్లర్లు ఒత్తిడి చేస్తున్నారు. దొడ్డు రకాల ధాన్యాన్ని తూకం వేసి పంపిస్తే దాన్ని దింపుకోకుండా ఆలస్యం చేస్తున్నారు. రైతుల వద్దనుంచి ఎక్కువ తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం తీసుకుంటామని రైస్ మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. మరో వైపు పొలాస రీసెర్చి కేంద్రంలో తీసుకున్న 24423 కొత్త రకం ధాన్యాన్ని కూడా మిల్లర్లు తీసుకోవడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు మద్దతు ధర భిస్తుందని, సంతోషపడుతున్న సమయంలో అకాల వర్షాలతో ధాన్యం తడిస్తే మళ్లీ తేమ శాతం పడిపోయే అవకాశం లేకపోలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం డబ్బు చెల్లింపులో జాప్యం!
RELATED ARTICLES