ఏం సాయం చేశారని తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతారు?
అమిత్ షాపై ప్రశ్నల వర్షం కురిపించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్ : విభజన హామీలను అమలు చేయాల్సిన పదవిలో ఉండి ఎనిమిదేళ్లు పట్టించుకోని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందనడం విడ్డూరంగా ఉన్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. ఎనిమిదేళ్లుగా వారు చేయాల్సిన పనులు చేయలేదని, కొత్తగా అధికారంలోనికి వచ్చి చేసేదేమిటని నిలదీశారు. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. సామరస్యానికి ప్రతీకైన తెలంగాణలో బిజెపి నేతలు మత విద్వేషాలు రగిలించే విధంగా ప్రసంగించడాన్ని తీవ్రంగా ఖండించారు. విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య పాత్ర పోషించిందని విమర్శించారు.
ఖమ్మంలో ప్రాంతాన్ని ఎపిలో కలిపి తెలంగాణకు నష్టం కలిగించిన కేంద్రం…
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను, భద్రాచలంలో ఐదు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసి తెలంగాణకు
తీవ్ర నష్టాన్ని మిగిల్చిందనిచాడవెంకట్ రెడ్డి దుయ్యబట్టారు. నేషనల్ హైవేల ద్వారా రోడ్లను విస్తరిస్తున్నామని చెబుతున్న అమిత్ షా, దానికి చేసిన ఖర్చులను టోల్ గేట్ల ద్వారా ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని, అందులో వారి ఘనత ఏముందని ప్రశ్నించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న అమరవీరులకు నివాళులర్పిస్తామని అంటున్న అమిత్ షా అదే బిజెపి ప్రభుత్వంలో తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల పెండింగ్ పెన్షన్ దరఖాస్తులు మర్చిపోయారా? అని చాడ వెంకట్ రెడ్డి నిలదీశారు. బిజెపి ఆరాటం తెలంగాణలో అధికారం రావడం తప్ప, తెలంగాణలో అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదనే విషయం అమిత్ షా ప్రసంగంలో స్పష్టమైందన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కేంద్రం చేతిలో ఉన్నప్పటికీ ఎందుకు తిరిగి ప్రారంభించడం లేదన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు దక్కని జాతీయ హోదా…
సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ ఇవ్వని విషయాన్ని చాడ వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం, కార్పొరేషన్ సంస్థల ఆస్తుల పంపకం నేటికీ జరగలేదన్నారు. విద్యుత్ లెక్కలు పరిష్కారం కాలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల తగువులుంటే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేసి, కేంద్రం తన పరిధిలోకి తీసుకున్నదని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య అఘాతాలు పెంచడంలో నరేంద్ర మోడీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బిజెపికి లేదన్నారు. తెలంగాణ ప్రజలకు బిజెపి చేసిన సాయం ఏమిటని ఆయన బిజెపిని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేకపోతే తెలంగాణలో బిజెపికి పుట్టగతులు ఉండవని చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు.
విభజన హామీలు ఏమయ్యాయి?
RELATED ARTICLES