నేడు సిఎంకు లేఖ అందజేయనున్నట్లు వెల్లడి
కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో కర్నాటక మంత్రిపై ఆరోపణలు
బెంగళూరు: కాంట్రాక్టర్ సంతోష్ కె. పాటిల్ ఆత్మహత్యకు కారకుడయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప శుక్రవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్‌కి అందచేయనున్నట్టు ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, హిందూ వాహిని జాతీయ కార్యదర్శి సంతోష్ ఇటీవల ఈశ్వరప్పపై ఆరోపణలు సంధించాడు. గ్రామీణ ప్రాం తాల్లో రోడ్ల నిర్మాణ ప్రాజెక్టు కాంట్రాక్టు మొత్తంలో 40 శాతం ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్ చేస్తున్నట్టు సం తోష్ ఆరోపించాడు. అంత భారీ మొత్తం ఇవ్వలేనని తెగేసి చెప్పడంతో, ఈశ్వరప్ప తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని విమర్శించాడు. 2019 నుంచి తనకు రావాల్సిన బిల్లులను కూడా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అతను ఈ ఆరోపణలు సంధించిన కొన్ని వారాల్లోనే సంతోష్ ఒక హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. అతను చివరిగా పంపిన మెసేజ్‌లో ఈశ్వరప్ప తనను హత్య చేయిస్తారన్న అనుమానం వ్యక్తం చేయడంతో, సహజంగానే మంత్రిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈశ్వరప్ప వేధింపులే సంతోష్ మృతికి కారణమంటూ అతని బంధులు ఆందోళనలకు దిగారు. బిజెపి కార్యకర్తగా పార్టీకి ఎంతో సేవచేస్తున్న సంతోష్‌ను ఈ విధంగా బలన్మరణానికి గురిచేయడం దారుణమని అంటున్నారు. అవినీతిలేని పాలన అందిస్తామని అధికారంలోకి రాకముందు బిజెపి చేసిన హామీని ఆ పార్టీ కార్యకర్తగా అతను విశ్వసించాడు. గత ప్రభుత్వాన్ని ‘10 శాతం సర్కారు’ అంటూ ఎద్దేవా చేసిన బిజెపి అదే పంథాను అనుసరించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. మంత్రి ఏకంగా 40 శాతం మొత్తాన్ని డిమాండ్ చేయడంతో దిక్కుతోచని పరిస్థితికి చేరుకున్నాడు. దీనికితోడు సుమారు మూడేళ్ల నుంచి రాష్ట్రం బిల్లులను చెల్లించకపోవడంతో ఆర్థికంగా కూడా నష్టపోయాడు. అదే సమయంలో మంత్రి ఈశ్వరప్ప నుంచి బెదిరింపులు కూడా ఎదురైనట్టు సంతోష్ బంధువుల ఆరోపణ. ఏదిఏమైనా, సంతోష్ ఆత్మహత్య చేసుకోవడం వాస్తవం. తన చివరి మెసేజ్‌లో మంత్రి ఈశ్వరప్ప పేరు ప్రస్తావించడం నిజం. ఈ కారణంగానే కర్నాటకలోని బిజెపి సర్కారుకు సొంత పార్టీ నుంచే వ్యతిరేక పెల్లుబుకుతోంది. ఈశ్వరప్ప రాజీనామాకు డిపాండ్ పెరుగుతున్నది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనితో ఈశ్వరప్ప రాజీనామా నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదని అంటున్నారు. బహుశా బిజెపి అధిష్టానం ఆయనను ఆదేశించి ఉండవచ్చన్న వాదన కూడా వినిపిస్తున్నది. మంత్రి ఈశ్వరప్ప రాజీనామాను కోరాల్సిన అవసరం లేదని వాదిస్తూ వచ్చిన కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతున్నది. ఈశ్వరప్ప రాజీనామాను ఆమోదిస్తే, ఆయన తప్పు చేసినట్టు పరోక్షంగా అంగీకరించడమే అవుతుంది. ఒకవేళ ఆమోదించకపోతే, విపక్షాల నుంచేగాక, సొంత పార్టీ నుంచే విమర్శలు తప్పదు. ఈ పరిస్థితుల్లో ఈశ్వరమ్మ రాజీనామా ఆమోదానికే ఆయన మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఈశ్వరప్ప రాజీనామా!
RELATED ARTICLES