14 మంది కొత్త వారికి చోటు
బుగ్గనకు ఆర్థికం.. వనితకు హోం..
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరింది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చదువుతూ ఉండగా.. ఆ ప్రకారం వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్, వేణుగోపాల్‌కృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, గుమ్మనూరు జయరామ్, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉషశ్రీచరణ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్, రాజన్న దొర, ఆర్‌కె రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడుదల రజని మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా అనుభవం, సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని సిఎం వైఎస్ జగన్.. పాత, కొత్త కలయికతో కొత్త మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలకు, మహిళలకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. పాత మంత్రివర్గంలోని 11 మందిని మళ్లీ మంత్రివర్గంలో తీసుకుంటుండగా, కొత్తగా 14 మందికి స్థానం కల్పించారు.
కొత్త మంత్రుల విధేయత
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం పలువురు మంత్రులు సిఎం జగన్ వద్ద తమ విధేయతను చాటుకున్నారు. కొందరు సిఎం, గవర్నర్ బిశ్వభూషణ్‌కు నమస్కరించి వెళ్లిపోగా.. మరికొందరు మాత్రం జగన్ కాళ్లు మొక్కారు. ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి నారాయణస్వామి సిఎం జగన్ కాళ్లు తాకి నమస్కరించగా.. మరో మంత్రి ఉష శ్రీచరణ్ ఆయన కాళ్లకు మొక్కారు. మరో ఇద్దరు మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, జోగి రమేశ్ ఇంకాస్త విధేయతతో మోకాళ్లపై పడి మరీ నమస్కరించారు. మంత్రి రోజా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సిఎం వద్దకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించిన అనంతరం ఆయన చేతిని ముద్దాడి తమ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
బుగ్గనకు ఆర్థికం.. వనితకు హోం..
కొత్త కేబినెట్‌లోని మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. గత కేబినెట్ తరహాలోనే అయిదుగురికి ఉప ముఖ్యమంత్రుల పదవులను కట్టబెట్టింది. రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషా, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి ఉపముఖ్యమంత్రులుగా ఎంపికయ్యారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఈసారీ ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్ చేపట్టిన శాఖలలో మార్పులు చేసి విద్యా శాఖను బొత్సకు.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను సురేశ్‌కు కేటాయించారు. మొదటి నుంచీ రాష్ట్ర హోం శాఖను నగరి ఎమ్మెల్యే రోజాకు కేటాయిస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే అనూహ్యంగా హోంశాఖను తానేటి వనితకు కేటాయించారు. గతంలో మేకతోటి సుచరిత హోంశాఖ మంత్రిగా ఉన్నారు. రోజాకు రాష్ట్ర పర్యాటక, యువజన, క్రీడల శాఖను కేటాయించారు. ఆళ్లనానికి గతంలో వైద్యారోగ్యశాఖ కేటాయించగా.. ఇప్పుడు ఆ శాఖను విడదల రజనీకి కేటాయించారు. పౌరసరఫరాల బాధ్యతను గతంలో కొడాలి నాని చూడగా.. ఈసారి కారుమూరి నాగేశ్వరరావుకు కేటాయించారు. వ్యవసాయశాఖ బాధ్యతలను కురసాల కన్నబాబు నుంచి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి అప్పగించారు.
కొనసాగుతోన్న బుజ్జగింపుల పర్వం..
మంత్రి పదవులు ఆశించి రాకపోయేసరికి మూతి ముడుచుకున్న ఎమ్మెల్యేలను బజ్జగించే పనిలో పార్టీ నేతలు పడ్డారు. మంత్రి పదవి రాకపోవడంతో సామినేని అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి విధేయంగా ఉన్నా మంత్రి పదవి రాకపోవడంతో సామినేని ఆవేదనతో ఉన్న సామినేనికి ఎంపి మోపిదేవి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మరోవైపు మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పలుమార్లు కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో బాలినేనితో స్వయంగా మాట్లాడాలని సిఎం నిర్ణయించి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. జగన్ ఆలోచన ప్రకారమే మంత్రి పదవులు కేటాయించారని సిఎంతో భేటీ అనంతరం బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రి పదవి కోసం తానెప్పుడూ పాకులాడలేదని చెప్పారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా: సుచరిత
కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకోని నేపథ్యంలో ఎపి హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. వైసిపికి కాకుండా ఎమ్మెల్యే పదవికి తన తల్లి రాజీనామా చేస్తున్నట్లు ఆమె కుమార్తె రిషిత ఆదివారం రాత్రి ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సుచరిత ప్రకటించారు.
ఎపిలో కొత్త మంత్రివర్గం
RELATED ARTICLES