ఆందోళన చేయాలంటే అధికారం ఉండాలా..?
ప్రజాపక్షం/ ఖమ్మం : ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పలు మార్గాలను అవలంబిస్తుంటాయి. విజ్ఞాపనలతో మొదలై ప్రత్యక్ష ఆందోళనల వరకు అనేక మార్గాలను అవలంబించడం ఆనవాయితీగా వస్తుంది. గత కొంత కాలంగా అధికారంలో ఉన్న పార్టీలు సైతం వివిధ సందర్భాలలో ఆందోళనలను నిర్వహిస్తున్నారు. నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ పోలీసులు విపక్షాల ఆందోళన పట్ల ఒక రీతి, అధికార పార్టీ ఆందోళన పట్ల మరో రీతిని అవలంబించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిరసనలు, దీక్షలు, ప్రదర్శనలు వీటి కోసం అనుమతి తీసుకున్నా కానీ పోలీస్ యం త్రాంగం అడ్డుకుంటుంది. ఎటువంటి అనుమతులు లేకపోయినా ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికార పార్టీలకు మాత్రం పోలీస్ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోకుండా యథాశక్తి సహకరిస్తుంది. విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తుందని ముఖ్యంగా విభజ న హామీల్లో భాగంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారం, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వ విద్యాలయాన్ని స్థాపించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 6న సిపిఐ నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. పోలీస్ అనుమతి లేనందున గతంలో ఇచ్చిన పిలుపును సైతం ఉపసంహరించుకుని అన్ని అనుమతులతో ఆరవ తేదీన దీక్షను తలపెట్టింది. ఈ దీక్షకు హాజరవుతున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. పోలీస్ ఉన్నతాధికారులు హైదరాబాద్లోని ఇందిరా పార్కులో దీక్షకు అనుమతించినా స్థానిక పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావడం లేదు. రాజకీయ పార్టీలు ప్రజా సమస్యల పరిష్కారానికే ఆందోళనలు నిర్వహిస్తాయి. ఆందోళనల ద్వారా సమస్యను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవచ్చునన్న ఆలోచనే ఆందోళనలు చేపట్టడానికి కారణం. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రాస్తారోకోలు, దీక్షలు, రహదారుల దిగ్బంధనం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. దీనికి పోలీసులు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా దగ్గరుండి మరీ కార్యక్రమం సాఫీగా జరిగేలా చూస్తున్నారు. బిజెపి కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు సాగిస్తుంది. బిజెపి పట్ల కూడా కొంత సానుకూలత ప్రదర్శించడం లేదంటే బిజెపి నాయకులు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున వ్యక్తిగత విమర్శలు చేయడం జరుగుతుంది. గత పాలకులు వామపక్షాల నిరసన పట్ల కొంత సానుకూలత ప్రదర్శించే వారు. వామపక్షాలు ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకుని పని చేస్తాయని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడం బాధ్యతగా భావించేవారు. కానీ ఇప్పుడు పోలీసుల తీరు మారింది. అసలు మొత్తం పోలీస్ వ్యవస్థే అధికారానికి గులాం చేస్తున్నది. ఏ పోలీస్ అధికారి అయినా పోస్టింగ్ పొందాలంటే కచ్చితంగా స్థానిక శాసన సభ్యుని అనుమతి పొందాల్సి వస్తుంది. శాసన సభ్యుని అనుమతితో పోస్టింగ్ పొందిన అధికారి ఎలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలిసిందే. పోలీస్ యంత్రాంగం అందరి పట్ల ఒకే రీతి ప్రదర్శించాలి కానీ ఆందోళనలు చేసేందుకు సైతం అధికారం ఉండాలన్న భావనతో వ్యవహరించడం సరికాదు. ఇప్పటికైనా ప్రజా సమస్యల పరిష్కారానికి అనుమతితో జరుగుతున్న ఆందోళనల పట్ల ప్రస్తుత వైఖరిని మార్చుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
ఖాకీ వివక్ష..!
RELATED ARTICLES