HomeNewsBreaking Newsభానుడి భగభగలు

భానుడి భగభగలు

వారం రోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
కర్ఫ్యూను తలపిస్తున్న ప్రధాన రోడ్లు
ప్రజాపక్షం/వరంగల్‌ బ్యూరో
రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎండలు మండుతున్నా యి. మార్చి నెలలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాత్రి పూట చల్లటి గాలులు వీస్తున్నప్పటికీ తెల్లారిందంటే చాలు ఎండలు మండుతున్న పరిస్థితి ఏర్పడింది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు ప్రజలను ఉక్కిరిబిక్కరి చేస్తున్నాయి. మార్చి ఆరంభం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన ఉష్ణోగ్రతలు గత వారం రోజులుగా 38 నుంచి 40 డిగ్రీలు నమోదవుతున్నది. సంక్రాంతి నుంచి వణికించిన చలి శివరాత్రితో మాయమవుతుండగా, ఆపై మెల్లమెల్లగా ఆరంభమైన ఎండలు మార్చి నెలాఖరులో ఒక్కసారిగా దంచి కొడుతున్నాయి. ఏప్రిల్‌ మాసం వచ్చిందా…? అన్నట్టు భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే వడ గాలులు ఆరంభమవుతున్నాయి. మధ్యాహ్నం అయిందంటే చాలు వేడి మరింత పెరిగిపోతోంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల నుంచే భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లాలంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు నిలకడగా 39 లేదా 40 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగడంతో రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరేస్థాయికి చేరుకుంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న మహబూబాబాద్‌ జిల్లా భూగర్భంలో ఉక్కు, బొగ్గు, డోలమైట్‌ గనులు అపారంగా ఉండడంతో భానుడి భగభగలకు ఆ ప్రాంతంలో భూమి మండిపోతోంది. ఫలితంగా మహబూబాబాద్‌ జిల్లాలో ఏప్రిల్‌ ఆరంభానికి ముందు నుంచే వేడి తీవ్రత పెరిగిపోతోంది. జిల్లాలోని గూడూరు నుంచి సరిహద్దు బయ్యారం వరకు ఉన్న గుట్టల భూభాగంలో అపార ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఇల్లందు నుంచి బయ్యారం వరకు సింగరేణి బొగ్గు నిల్వలు ఉండడంతో వేడి తీవ్రత మరింత పెరుగుతూ వస్తోంది. మరోవైపు భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ప్రాంతంలో మరింత వేడి రగులుతున్నది. వరంగల్‌, హన్మకొండ జిల్లా కేంద్రాలలోనూ ప్రజలు పగటివేళ బయటికి రావాలంటే జంకుతున్నారు. ఇతర జిల్లాలో కూడా మండల కేంద్రాల్లో కర్ఫ్యూను తలపించేలా రోడ్లు వెలవెలబోతున్నాయి. ఉత్తర ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి వడగాలులు వీస్తుండడంతోనే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటుండడంతో ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్‌, మేలో ఎలా తట్టుకుంటామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వాతావరణంలో మార్పులే కారణం
రాత్రి చలి, పగలు వేడి వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు పిల్లల్ని, పెద్దల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లా కేంద్రాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చి వెళ్లేవారు హఠాత్తుగా మండిపోతున్న సూర్యుడి థాటికి తట్టుకోలేక ముసుగులు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎండలను గుర్తించిన శీతలపానియాల వ్యాపారులు జిల్లా కేంద్రాలలో ప్రధాన రహదారులకు ఇరుపక్కల దుకాణాలను తెరుచుకున్నారు. అడుగడుగునా కొబ్బరిబొండాలు, నిమ్మరసం సోడాల బండ్లు, చెరుకురసం దుకాణాలు దర్శనమిస్తున్నాయి. ఇదే అదునుగా సొమ్ము చేసుకుండూ.. జ్యూస్‌ దుకాణాదారులు ఇష్టారీతిన రేట్లను పెంచి నాణ్యత తగ్గించి ఐస్‌ నీళ్లను అందిస్తున్నారు.
వాటర్‌ ప్లాంట్లకు పెరుగుతున్న డిమాండ్‌
మినరల్‌ వాటర్‌ ప్లాంట్లకు డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. బడ్డీ కొట్లలో ప్లాస్టిక్‌ బాటిళ్లలో తాగు నీటిని కుల్లాగా విక్రయించే వారు సైతం ఇప్పటికే లీటర్‌ బాటిల్‌ ధర రూ.5 తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఇంకా ఏ స్థాయిలో ఉంటుందోనని పలువురు ముందే ఎసిలు, వాటర్‌ కూలర్‌లను శుభ్రపరిచి వేసవిని తట్టుకోవడానికి సంసిద్ధులవుతున్నారు. ఈ సారి ఎండల ధాటిని ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments