HomeNewsBreaking Newsఉగాది తర్వాత ఉగ్ర పోరు

ఉగాది తర్వాత ఉగ్ర పోరు

ధాన్యం కొనుగోలుపై ఉధృత ఆందోళనలు
ఏప్రిల్‌ 1 వరకు స్థానిక సంస్థల తీర్మానాలు
తెలంగాణ ప్రజలకు కేంద్ర మంత్రి పీయూష్‌ క్షమాపణ చెప్పాల్సిందే
మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల, పువ్వాడ, వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌ ధాన్యం కొనుగోలు చేయకపోతే ఉగాది పండగ తర్వాత ‘ఉగ్ర తెలంగాణ’ చూస్తారని, ఆందోళన లు ఉధృతం చేస్తామని రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది తర్వాత ఉధృతమైన ఆందోళనలు చేపడుతామని, ఇందుకు రైతు లు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా వ్యాఖ్యనించిన కేంద్ర మం త్రి పీయూష్‌ గోయల్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజ లు ప్రతీకారం తీసుకుంటారన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 1వ తేదీలోపు గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్రంలోని స్థానిక సంస్థలన్నీ తీర్మానాలు చేసి ప్రధానమంత్రికి పంపిస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ అంటూ కేంద్రం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కాలానుగుణ మార్పులకనుగుణంగా కేంద్రం మార్గాలు వెతకాలని, మెదడుకు తాళం వేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆలోచన కూడా చేయని వారు కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు నడిపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్‌ ప్రొడక్షన్‌ను 2025 నాటికి 20 శాతం పెంచుతామని చెప్పి, ఇప్పటి వరకు 5 శాతం దాటలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయాలని చేపట్టే ఉద్యమం దక్షిణాది రాష్ట్రాలకు పాకుతుందని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే కిషన్‌ రెడ్డి ఏం చేస్తున్నారని, ఆయనకు రైతుల కష్టాలు పట్టవా, తాము ఇన్నిసార్లు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిస్తే కిషన్‌రెడ్డి వచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరి… ‘యజమాని ఒక బానిసతో మాట్లానిట్టు’గా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కెసిఆర్‌ ఉన్నంత వరకు రైతులు భయపడొద్దని, ప్రభుత్వం, టిఆర్‌ఎస్‌ పూర్తి అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ కేంద్ర పౌరసరఫరాల శాఖ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొనలేదనడం అబద్ధమని, తమ అధికారులు పాల్గొన్నారని వివరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం రాష్ట్రం మెడమీద కత్తి పెట్టి బలవంతంగా సంతకాలు పెట్టించుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవహేళన చేస్తోందన్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే నూక ఎవరో, పొట్టు ఎవరు అనేది తెలుస్తుందని హెచ్చరించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముందు ఆయన ప్రతినిధ్యం వహించే సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు నూకలు తినిపించిన తర్వాత ఇతరులకు చెప్పాలని, కాదంటే కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ వ్యాఖ్యలను ఖండించి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలని, ఆ తర్వాత సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో అడుగు పెట్టాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి మాట్లాడిన తీరు చూసిన తర్వాత కేంద్రంలో కొత్తగా ప్రజల ఆహారపు అలవాట్లను మార్చే శాఖను పెట్టారా అనే అనుమానం కలిగిందని ఎద్దేవా చేశారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఒంట్లో నెత్తురుంటే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పూర్తిగా సహకరిస్తుందని, ముందుగా ధాన్యం కొనుగోలు ఆర్డర్‌ చేస్తే వెంటనే ప్రొక్యూర్‌మెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. యాసంగిలో వరి వేస్తే కేంద్రంతో కొనిపిస్తానని బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రశాంత్‌ రెడ్డి గుర్తు చేశారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments