ఇక తూర్పు ఉక్రేన్పైనే రష్యా గురి
ప్రత్యర్థి పోరాట సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించాం
రక్షణమంత్రిత్వశాఖ వెల్లడి
మాస్కో : ఉక్రేన్పై మొదటి దశ సైనికచర్య పూర్తి అయిందని రష్యా రక్షణమంత్రిత్వశాఖ శనివా రం ప్రకటించింది. ఇక తూర్పు ఉక్రేన్ను విముక్తి చేయడమే రష్యా లక్ష్యమని తెలియజేసింది. డాన్బాన్ను విముక్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. యుద్ధం ప్రారంభించడం వెనుకగల ప్రాథమిక,మౌలిక లక్ష్యం పూర్తయిందని పేర్కొంది. ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రేన్పై సైనిక చర్య ప్రారంభించడానికి గల కారణాల్లో ఒకటైన మౌలిక లక్ష్యం నెరవేరిందని జనరల్ స్టాఫ్ ప్రధానాధిపతి సెర్గీ రడ్స్కోయీ చెప్పారు. ఉక్రేన్ సైన్యం పోరాట సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీశామని, వారి ప్రతిఘటనాశక్తిని తగ్గించగలిగామని ఆయన పేర్కొన్నారు. ఇక మీదట తూర్పు ఉక్రేన్ను విముక్తి చేయడంపైనే తాము పూర్తిగా దృష్టి సారిస్తామని చెప్పారు. తమ వ్యూహాన్ని ఆవైపుగా మళ్ళిస్తామన్నారు. గడచిన నెలరోజుల యుద్ధంలో ఉక్రేన్ పోరాట సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా ప్రధాన లక్ష్యం సాధించేందుకు వీలుగా తాము ఇక దృష్టి కేంద్రీకరించడం సాధ్యపడుతుందని సెర్గీ రడ్స్కోయీ చెప్పారు. ఆగ్నేయ ఉక్రేన్ ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న డాన్బాస్ రష్యా అనుకూలవాదుల గుప్పెట్లో ఉంది. ఇప్పటికే లూహాన్స్లోని 93 శాతం డాన్బాస్ ప్రాంతం రష్యా అనుకూలవాదుల చేతుల్లో ఉందని తెలిపింది. నాలుగింట మూడు వంతుల తమ అనుకూల వాదుల చేతుల్లోనే ఉందని తెలిపింది. రష్యాను నిస్సైనికీకరణచేయడం, నాజీవాదం తలెత్తకుండా చేయడం, రష్యన్ భాష మాట్లాడే లక్షలాదిమందిని ఊచకోత కోసే నయా నాజీవాద ప్రభుత్వం పీచమణచడమే తమ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని సాధిస్తామని యుద్ధం ప్రారంభం కావడానికి ముందే రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రేన్ అధ్యక్షుడు జెలన్స్కీ రష్యా వాదనలను కొట్టిపారేశారు. రష్యాను గట్టిగా ప్రతిఘటిస్తున్నామని, చర్చలు తప్పనిసరి అని, వెంటనే జరగాలని రష్యా గుర్తించాలన్నారు.
యుద్ధం.. తొలిదశ పూర్తి
RELATED ARTICLES