అడ్డూఅదుపు లేకుండా పెంచుతున్న సర్కార్
సామాన్యుల నడ్డివిరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
పెంచిన ధరలు తగ్గించకుంటే పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తాం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ అడ్డుఅదుపు లేకుండా రికార్డు స్థాయిలో విద్యుత్, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతూ సామాన్యుల నడ్డివిరుస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ధరల పెరుగుదలను నియంత్రించడంలో పాలకులు ఫుర్తిగా విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు నెట్టబడిందని, తరచు ధరల పెరుగుదలతో ప్రజలకు మూడు పూటల భోజనం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్, విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ హిమాయత్ నగర్ వై జంక్షన్‌లో గురువారం సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. “నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించలేని ప్రభుత్వాలు తీరు సిగ్గు సిగ్గు” అని ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిపిఐ నాయకులు, కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రదర్శకులను ఉద్దేశించి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయకుండా ధరలు పెంచి పేద ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే విద్యుత్‌ను వినియోగించుకునేందుకు ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గృహ వినియోగదారుల విద్యుత్ చార్జీల పెంపును వెంటనే ఉపసంవరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదల సామాన్య ప్రజల బడ్జెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని, దీని కారణంగా నిత్యావసరాలు, ఇతర వస్తువులు ఖరీదైనవిగా మారాయని, ప్రజల ఆదాయంలో ఏమాత్రం పెరుగుదలలేదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో సామాన్య ప్రజలపై మోడీ ప్రభుత్వం క్రూరమైన కొరడా ఝులిపించిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలపై నిర్లక్ష్యధోరణి వీడి పెంచిన గ్యాస్, విద్యుత్, పెట్రోల్, డిజిల్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించి దోపిడికి ముగింపు పలకాలని, లేనట్లయితే భవిష్యత్‌లో పోరాటాలు తీవ్రతరం చేస్తామని చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.
ధరల పెంపుతో ప్రజలకు ద్రోహం చేస్తున్న కేంద్రం : సయ్యద్ అజీజ్ పాషా
కేంద్ర ప్రభుత్వం విపరీతంగా ధరలను పెంచుతూ ప్రజలకు ద్రోహం చేస్తోందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా విమర్శించారు. ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఉద్యమాలు మరింత బలోపేతం చేయాలన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్ మాట్లాడుతూ పెరుగుతున్న ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండడంతో పాటు ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. దొంగలు ప్రజలను దోచుకోవడాన్ని చూశామని, కానీ కాపలాదారుడుగా చెప్పుకునే వ్యక్తి మొత్తం దేశాన్ని దోచుకోవడం ఇదే మొదటిసారి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాల కార్మిక, కర్షక, ప్రజా వ్యతరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీలలో జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని బోస్ విజ్ఞప్తి చేశారు.
సంక్షేమాన్ని పక్కనపెట్టి ధరలు పెంచుతున్న ప్రభుత్వం : ఈ.టి.నరసింహ
పేద, మధ్యతరగతి వర్గాలకు సంక్షేమ పథకాల అమలును నిలిపేసిన ప్రభుత్వం, మరో వైపు ప్రజలపై ధరల భారం మోపుతుందని సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటి. నరసింహ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేయడంలేదన్నారు. విద్యుత్, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ మోడీ, కెసిఆర్ ప్రభుత్వాలు తమ ఖజానాలను నింపుకోవడానికి సామాన్యుల జేబులు ఖాళీ చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ధరలను తగ్గించేవరకు ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఈ.టి.నరసింహ హెచ్చరించారు. ఈ నిరసన ప్రదర్శనలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పి.ప్రేమ్‌పావని, ఎస్.ఛాయాదేవి, ఆర్.శంకర్‌నాయక్, ఎం.నరసింహ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.ఎ.మన్నన్, టి.రాకేష్ సింగ్, ఎఐఎస్‌ఎఫ్ జాతీయ నాయకులు బి.స్టాలిన్, సిపిఐ జిల్లా నాయకులు శక్రి భాయి, అమీనా, ఆరుట్ల రాజ్ కుమార్, సలీం ఖాన్, మహమూద్, బొడ్డుపల్లి కిషన్, జ్యోతి శ్రీమాన్, జేరుపోతుల కుమార్, కంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రికార్డు స్థాయిలో ధరలు
RELATED ARTICLES