తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయండి
రాష్ట్ర మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్
మీడియా సమావేశంలో వెల్లడించిన మంత్రి నిరంజన్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ “మీ రాష్ట్రం గురించి మీరే కొనుగోలు చేయండి… నూకలను తెలంగాణ ప్రజలకు అలవాటు చేయండి” అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దుర్మార్గంగా మాట్లాడారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు సేకరణలో కేంద్ర ప్రభుత్వం పాత పద్ధతినే, పాత పాటనే పాడిందని ఆరోపించారు. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతులను ఆదుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేయాలనే విషయమై సిఎం కెసిఆర్
తగిన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు, టిఆర్ఎస్ లోక్‌సభపక్ష నేత నామ నాగేశ్వర్ రావు నేతృత్వంలోని ఎంపిల బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌తో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు అంశంపై వారు చర్చించి, లేఖను కూడా అందజేశారు. అనంతరం ఢిల్లీ తెలంగాణ భవన్లో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ రాష్ట్రంలో ప్రస్తుతం నూకలు వస్తాయని, కేంద్రం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రిని కోరితే ‘మీ’ ప్రజలకు నూకలు అలవాటు చేయండి’ అంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యనించడం అన్యాయమని అన్నారు . వ్యవసాయానికి సరఫరా చేసే నీరు, కరెంటులో, పంట పెట్టుబడిలో, రైతు కష్టంలో కేంద్ర ప్రభుత్వ సహకారం లేదని, అన్నీ తాము చేసుకుని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయమంటే కేంద్రం 190 తిప్పలు పెడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వ్యవసాయ ఆత్మ, మనసు లేదని, వ్యవసాయంపైన గౌరవం, నమ్మకం కూడా లేదన్నారు. ధాన్యం కొనుగోలు అంశాలను కేంద్ర మంత్రి తేలిగ్గా తీసుకుని, హేళనగా దురహాంకారంగా మాట్లాడారని ఆరోపించారు. కేంద్రం వ్యవసాయ ఆత్మలేని ప్రభుత్వమని, వ్యాపారాత్మక ప్రభుత్వమని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి అందమైన ఫోటోలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. రైస్‌తో రాష్ట్రానికి సంబంధం లేదని, కొనుగోలు బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని, ధాన్యం సేకరణ కేంద్రం పరిధిలోని అంశమని రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నదని వివరించారు. తెలంగాణ రైతాంగాన్ని పియూష్ అవమానించారన్నారు.మార్కెట్లో అమ్ముడుపోయే ఉత్పత్తులనే కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి సమాధానమివ్వడం విడ్డూరమని, రైతాంగ జీవితాలతో బిజెపి నేతలు ఆడుకుంటున్నారన్నారు. ప్రస్తుత ప్రధాని మోడీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు ఫెడరలిజం, రాష్ట్రాల హక్కులు, కేంద్రం వివక్షత చూపుతోందని తదితర అంశాలపైన నాటి మన్మోహన్ సింగ్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారని, ఇప్పుడు అధికారంలోనికి రాగానే మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం, ఇప్పుడు కనీసం పండించిన పంటను కూడా కొనగోలు చేసే దిక్కు లేదని, ఇదొక దిక్కుమాలిన ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించే రోజులు వస్తాయని హెచ్చరించారు. సిఎంకు వివరించి, క్యాబినెట్, పార్టీ నేతలతో చర్చించి సిఎం తదుపరి కార్యచరణ తీసుకుంటారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, కేంద్ర మంత్రి స్పందన తదితర అంశాలను సిఎం కెసిఆర్‌కు వివరిస్తామని, ఆయన కేంద్ర మంత్రివర్గం, టిఆర్ఎస్ నేతలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసకుంటారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం నిత్యం రైతుల పక్షాన నిలబడుతుందని, రాష్ట్ర ప్రభుత్వ పరిధి మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మీ ధాన్యం మీరే కొనుక్కోండి
RELATED ARTICLES