హైదరాబాద్‌లో యథేచ్ఛగా ఇతర జిల్లాల ఆటోరిక్షాలు
ఉపాధికి గండి.. కానరాని స్పెషల్ డ్రైవ్స్
సర్కార్ సాయానికి ఎదురుచూపులు
ప్రజాపక్షం / హైదరాబాద్ జిల్లా ప్రతినిధి అత్యంత క్లిష్ట పరిస్తితుల్లో ప్రభుత్వ ఆపన్న హస్తం అందక హైదరాబాద్ మహానగరంలో ఆటో డ్రైవర్లు ఆకలిమంటలతో అలమటిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పాలకుల ఉదాసీనత, నామమాత్రపు స్పెషల్ డ్రైవ్స్, రవాణ, పోలీస్ శాఖ అధికారుల అలసత్వం తోడై వెరసి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ల బతుకులు దినదిన గండంగా మారుతున్నాయి. జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. రాత్రి పగలూ తేడా లేకుండా ఆటోరిక్షాలు నడుపుతున్నా ఆ కష్టం ఒక్క పూటైనా తిండి గడిచేలా లేదు. భాగ్యనగరంలో పొట్ట గడవడానికి చేసిన అప్పులు యమపాశాలు అవుతున్నాయి.కొన్నేళ్ల క్రితం పక్క రాష్ట్రం, ఇతర జిల్లాల నుంచి పొట్ట చేతబట్టుకుని ఆటో డ్రైవర్లు హైదరాబాద్ చేరుకున్నారు. వ్యక్తిగత, బ్యాంక్ లోన్లు, ఆటోఫైనాన్స్‌తో ఆటోలు కొనుక్కుని బతుకుబండిని లాగిస్తున్నారు. అయితే భాగ్యనగరం తమను కంటికి రెప్పలా చూసుకుంటుంది అని కలలు కన్నారు. ఇక హైదరాబాద్ మా స్థిరనివాసం, జీవితం, సుదీర్ఘ జీవన ప్రస్థానం అని ఆకాంక్షించారు. అయితే విధి కరోనా రూపంలో ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటం ఆడింది. ఆటోరిక్షా డ్రైవర్ల కలలు కల్లలయ్యాయి. పరిస్థితులు తారుమారై మళ్లీ ఇంటి బాట పరిస్థితి దాపురించి కంటతడిపెడుతున్నారు. కరోనా విజృంభించిన కాలంలో రెండున్నర సంవత్సరాలు అష్టకష్టాలు పడ్డారు. తినడానికి తిండి దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తినీతినకా డబ్బులు దాచుకుని వారు కొనుగోలు చేసిన ఆటోలను కారు చౌక బేరం పెట్టి ఇళ్ల కిరాయిలు, కరెంట్ బిల్లులు కట్టారు.పిల్లల చదువులకు ఫీజులు కట్టారు. పుస్తెలు తాకట్టు పెట్టారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం పాలకులు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నీటిమీది రాతలను తలపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకులు అవలంభిస్తున్న సవతితల్లి ప్రేమ అస్తవ్యస్త విధానాలు వారి ఉపాధికి గండికొట్టాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఏళ్లు గడుస్తున్నా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎక్కడనే వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని వాపోతున్నారు. అందరినీ ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఆటోరిక్షాడ్రైవర్లను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10,000 ఆర్థిక సహాయం అందిస్తున్న మాదిరిగానే తెలంగాణలో కూడా ఆపన్నహస్తం అందించాలనిఅభ్యర్థిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 1,50,000 ఆటోలు పర్మిట్లు కలిగిఉన్నవి తిరుగుతున్నాయి. పక్క రాష్ట్రం ఇతర జిల్లాల నుంచి వచ్చి తిరుగుతున్నఆటోలు అనధికారికంగా 1,00,000 వరకు నడుస్తున్నాయి. ఈ ఆటోలు మోటారు వాహనాల నిబంధనలను బేఖాతరు చేస్తూ తిరుగుతున్న ఫలితంగా సిటీలో పర్మిట్లు కలిగిఉన్న ఆటోరిక్షా డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. అయితే ఇన్నాళ్లు తిరుగుతున్న నగర పర్మిట్ ఆటోరిక్షాల కాలం చెల్లడంతో పాత ఆటోలు తీసేసి కొత్త ఆటోలు కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో పర్మిట్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వం నిబంధనలు అనుకూలించడం లేదు. పాత ఆటోలను ఆర్టీవో అధికారిక డీలర్లు ధర నిర్ణయించి స్క్రాప్ క్లియరెన్స్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త ఆటో కొనాలంటే ప్రస్తుత ధర దాదాపు రూ.2,40,000 ఉండగా సిటీ పర్మిట్ కు రూ.1,30,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే కొత్త ఆటో కొనుగోలుకు రూ. 3,70,000 అవుతుంది. కానీ ఇతర జిల్లాలలో కేవలం రూ. 2,40,000 కు కొత్త ఆటో వస్తుంది. అందువల్ల హైదరాబాద్ ఆటో డ్రైవర్లు ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకులను (మార్వాడీలు) ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ తతంగం అంతా ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకులు చూసుకుని వారి వడ్డీ కలుపుకుని కొత్త ఆటోలు ఫైనాన్స్ కింద అందజేస్తున్నారు.దీంతో కొత్త ఆటోల కొనుగోలు తలనొప్పిగా మారింది. ఇది వరంగా చేసుకుని ఇతర జిల్లాల రిజిస్ట్రీ ఆటోలు హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చి తిప్పుతున్నారు. వారు తక్కువ ఛార్జీలతో నగరంలో తిప్పుతున్నారు. దీనివల్ల సిటీలో పర్మిట్ ఆటో డ్రైవర్ల ఆదాయ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆర్థికంగా వెళ్లని పరిస్థితి మొదలైంది. దీంతో సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్, రంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, ఖమ్మం, భువనగిరి, జనగాం నల్లగొండ రిజిస్ట్రేషన్ ఆటోల డ్రైవర్లు హైదరాబాద్ నగరంలో నడుపుతున్నారు. అయితే కొద్ది రోజులు రవాణ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చర్యలు తీసుకున్నారు. అయితే కాలక్రమేణా వారిపై రాజకీయఒత్తిళ్లు పెరిగి సైలెంట్ అయ్యారు. కారణంగా పక్క జిల్లాల ఆటోల తాకిడి హైదరాబాద్ నగరంలో పెరిగిపోయింది. వారు కొంతమంది రవాణ, పోలీస్ శాఖ అధికారులతో బేరసారాలు కుదుర్చుకుని యథేఛ్చగా రాజధాని నగరంలో తిప్పుతున్నారు. స్పెషల్ డ్రైవ్ కాస్తా తూతూ మంత్రంగా మారిందన్న ఆరోపణలు చోటుచేసుకున్నాయి. వీటికి తోడు యాప్ ఆధారిత ఊబర్, ఓలా, రాపిడో ఆటో, బైక్ సర్వీసెస్ సంస్థలే కాకుండా సెవెన్ సీటర్ ఆటోలు నగర ఆటో డ్రైవర్ల దినసరి ఆదాయానికి గండి కొట్టాయి. నగరంలో కిరాయికి ఆటోలు ఇచ్చే యజమానుల వద్ద నుంచి ఒక రోజుకు రూ. 400 నుంచి 500 వరకు కిరాయి చెల్లించి హైదరాబాద్ నగరంలో నడుపుకుంటారు సమీప జిల్లాల నుంచి వచ్చిన ఆటో డ్రైవర్లు. వారానికి ఒకసారి కూడా కిరాయి చెల్లింపు వెసులుబాటు ఉంటుంది. దేవరకొండ, మాల్, సంస్థాన్ నారాయణ్‌పూర్, మిర్యాలగూడ, హాలియా ప్రాంతాల నుంచి వచ్చిన ఆటో డ్రైవర్లు ఆటోలను రోజువారీ, వారం వారీ, నెలవారీగా కిరాయికి తీసుకుని హైదరాబాద్ సిటీలో నడుపుతున్నారు. వ్యాపారం బాగా ఉండటంతో కొందరు యజమానులు రంగప్రవేశం చేశారు. ఒక్కొక్కరు 400 నుంచి 500 ఆటోలు అద్దె వ్యాపారం చేసేవారు హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. వారానికి ఒకటి రెండు రోజులు వారి స్వస్థలాలకు వెళ్లి వ్యవసాయ పనులు చూసుకుంటుంటారు. సింగరేణి కాలనీ, హయత్‌నగర్ బంజార కాలనీ, ఎల్.బి. నగర్ గుంటి జంగయ్య కాలనీ, హస్తినాపురం, నాగోల్ సాయినగర్, జైపురి కాలనీ, ఎన్టీఆర్ నగర్, చంపాపేట్, గోల్నాక, బోడుప్పల్ , జగద్గిరిగుట్ట, అడ్డగుట్ట, అమీర్‌పేట్ , నగర శివారు ప్రాంతాలల్లో అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ఆటోల్లో చేరవేసి తీసుకువచ్చేలా పేరెంట్స్ తో మాట్లాడుకుని కొంత ఆదాయం గడించేవారు. అలా ఏడాది పేరున 11 నెలలకుగాను (విద్యాసంస్థలకు ఒక మాసం సెలవు పీరియడ్ మినహాయించి) నెలకు రూ.8,000 చొప్పున రూ.90,000 సంపాదించుకునేవారు. కరోనా కాలంలో ఆటో డ్రైవర్లకు విద్యార్థుల పేరెంట్స్ నుంచి బకాయిలు పేరుకుపోయి తీవ్రంగా నష్టపోయారు. వారు తిరిగి హైదరాబాద్ నగరానికి వచ్చి ఆటోలు నడపడానికి విముఖత వ్యక్తం చేసే పరిస్థితి దాపురించింది. కరోనా కాలంలో ఆటో డ్రైవర్లు తీసుకున్న అప్పులు గుదిబండలుగా మారి ఈఎంఐ లు కట్టని పరిస్థితుల్లో ఫైనాన్స్ నిర్వాహకులు ఆటోలను తీసుకెళ్లారని, కొంతమంది ఆటోలను అమ్ముకుని దినసరి అడ్డమీది కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా పనులకు వెళ్లారని నాగోల్ ఏరియా ఆటో యజమాని మహేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భవించాక కేసీఆర్ ప్రభుత్వం ఆటోల రోడ్డు ట్యాక్స్ మాత్రమే రద్దు చేసిందన్నారు. రద్దు మూలంగా 3 నెలలకు రూ.115 చొప్పున చెల్లించాల్సిన టాక్స్ మాఫీ అయ్యింది. అంతేకాకుండా మైనార్టీ కార్పోరేషన్ ద్వారా దాదాపు 5,000 మందికి ఆటోలు అందజేశారన్నారు. ఆటో స్టాండ్ వద్ద డైలీ ఫైనాన్స్ ఇచ్చేవారు రూ.10,000 మొత్తానికి రూ.8,500 అందజేసి రోజుకు రూ.100 చొప్పున 100 రోజుల కాలానికి కట్టించుకుంటారని ఆ ఫైనాన్స్ కూడా కట్టలేక ఆటో డ్రైవర్లు అష్టకష్టాలు పడ్డారని మహేష్ తెలిపారు. అప్పుల బతుకులను గడుపుతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోకపోవడం ఎంతో బాధాకరమన్నారు. కరోనా పీరియెడ్‌లో కుటుంబం గడవక అప్పు చేశానని, పిల్లల చదువులకు ఫీజులు, కుటుంబ పోషణకు లక్ష రూపాయల వరకు అప్పు తీసుకున్నానని, తన ఇంటి యజమాని కరోనా కష్టకాలంలో ఇంటి రెంట్ ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా ముక్కుపిండి వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.తనకు ఎకరా పొలం మాత్రమే ఉన్నదని, సాగు కోసం కూడా అప్పు చేయక తప్పలేదని ఎల్‌బి. నగర్ ఏరియా ఆటో డ్రైవర్ రమావత్ జగన్ చెప్పారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ లో తాను ఆటో నడుపుతున్నా పొట్టకు బట్టకు గడవని పరిస్థితి ఉన్నదన్నారు. కేసీఆర్ సర్కార్ ఆదుకుంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు.
హైదరాబాద్ నగరంలో పర్మిట్లు ఇవ్వాలి : బి. వెంకటేష్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, తెలంగాణ స్టేట్ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్
ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో కొత్తగా పర్మిట్లు ఇవ్వాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో (2012 సంవత్సరం) హైదరాబాద్ సిటీలో 20,000 పర్మిట్స్ ఇచ్చింది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.120, 110 కు చేరాయి. ఆటో డ్రైవర్ల జీవన పరిస్థితి దారుణంగా మారింది. పక్క రాష్ట్రం, ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆటోలు, క్యాబ్‌లు నడపటం వల్ల నగరంలోని డ్రైవర్ల బతుకులు దయనీయంగా మారాయి. నగరంలో ఆటో మీటర్ కనీస ఛార్జీలను రూ.40 కి పెంచాలి. ప్రతి కిలోమీటర్ కు రూ. 25 చొప్పున ఛార్జీ విధించాలేలా రవాణ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయాలి. స్సెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తూ ఇతర జిల్లాల ఆటోలు హైదరాబాద్‌లో తిరగకుండా తక్షణమే గట్టి నియంత్రణ చర్యలు తీసుకోవాలి. ఇటీవల హైదరాబాద్ జేటీసీ పాండురంగ నాయక్‌ను కలిసి వినతి పత్రం అందజేశాం. త్వరగా సమస్యలు పరిష్కరించి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి.