‘మన ఊరు-మన బడి’ కింద మౌలిక సదుపాయాలు
వరంగల్ జిల్లాలో ఎంపికైన 223 పాఠశాలలు
మారుతున్న గవర్నమెంట్ స్కూళ్ల రూపురేఖలు
ప్రజాపక్షం/వరంగల్ బ్యూరో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు సౌకర్యాల సొబగులతో రూపురేఖలు మారనున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతి సౌకర్యాలను కల్పించి కార్పొరేట్ స్థాయి విద్యనందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి దాతలు అనేక మంది ముందుకు వస్తున్నారని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగుపడుతుందని విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మండలాన్ని యూనిట్‌గా తీసుకుని గ్రామం, పాఠశాలను ఎంపిక చేసి సంబంధిత పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఆధారంగా జిల్లాలో మూడోవంతు పాఠశాలను మొదటి విడతలో ఎంపిక చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎంపిక చేసిన పాఠశాలలో నిరంతరం నీరు, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుత్ సరఫరా, ప్రహారీగోడలు, వంట గది, అదనపు తరగతి గదులు, మరమ్మతులు, డిజిటలైజేషన్ తదితర సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. పనుల నిర్వహణకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కమిటీలు ఏర్పాటు చేసి నిధుల సేకరణ, నిర్వహణ కోసం ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి రూ.7800 కోట్లు వ్య యం చేయనున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో మొత్తం 645 పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 452, ప్రాథమికోన్నత పాఠశాలలు 68, ఉన్నత పాఠశాలలు 125 కాగా ‘మన ఊరు -మన బడి’లో 223 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఎంపికైన పాఠశాలల్లో 123 ప్రాథమిక, 20 ప్రాథమికోన్నత, 80 ఉన్నత పాఠశాలలుండగా 32,057 మంది విద్యార్థులు ఈ సదుపాయాల నుంచి ప్రయోజనం పొందనున్నారు.
తరగతి గదులు, పాఠశాలలకు దాతల పేర్లు
ఈ పథకంలో ప్రభుత్వం మంజూరు చేసే నిధులు కాకుండా దాతల సాయం తీసుకోనున్నారు. ఒక తరగతి గది నిర్మాణానికి రూ.10 లక్షలు విరాళమిస్తే ఆగదికి ఆదాత పెరు పెట్టాలని, రూ.25 లక్షలు ఇస్తే ఆబ్లాక్కు దాత పేరు పెట్టాలని, కోటి రూపాయాలు ఇస్తే మొత్తం పాఠశాలకే ఆదాత పేరు పెట్టాలని ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. నాబార్డు, ఉపాధి హామీ పథకం, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల ద్వారా పాఠశాలల రూపురేఖలే మారనున్నాయి. విద్యార్థులు, సిబ్బందికి పూర్తిస్థాయిలో ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డుల ఏర్పాటు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌హాళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అన్ని పాఠశాలల్లో విద్యుద్దీకరణతో పాటు ఒక విధమైన పేయింటింగ్ వేయించేలా చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశారు.
పనుల వేగవంతానికి అధికారుల భాగస్వామ్యం
వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి
ఎంపిక చేసిన పాఠశాలల మరమ్మతు పనులు వేగవంతంగా జరిగేందుకు ప్రతి మండలంలో ఇంజనీరింగ్ అధికారులను భాగస్వామ్యులను చేస్తున్నామని వరంగల్ జిల్లా కలెక్టర్ బి.గోపి చెప్పారు. మరుగుదొడ్లు, ప్రహారిగోడ, కిచెన్‌షెడ్ పనులన్నీ ఈజిఎస్ ద్వారా, అర్బన్ ఏరియాలో పాఠశాల విద్యాశాఖ ద్వారా పనులు పూర్తి చేస్తామన్నారు. జడ్పి చైర్మన్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు.
సర్కారు బడులకు సౌకర్యాల సొబగులు
RELATED ARTICLES