ఐక్యరాజ్యసమితి : ఐక్యరాజ్యసమితిలో భారత్ రెండోసారి కూడా ఉక్రేన్ సమస్యపై జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. 48 గంటల వ్యవధి తరువాత ఆదివారం మధ్యాహ్నం రెండోసారి జరిగిన భద్రతా మండలి సమావేశంలో కూడా భారత్ ఉక్రేన్ సమస్యపై ఓటింగ్‌లో పాల్గొనలేదు. గడచిన 40 ఏళ్ళలో ఎన్నడూ లేనిరీతిలో 193 దేశాలతో కూడిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సంప్రదాయపబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ ద్వారా ఆమోదం పొందవలసి ఉంది. చాలా అరుదైన పద్ధతిలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని సమావేశపరచడానికి అనుమతి కోసం భద్రతామండలిలో ఆదివారంనాడు ఈ ఓటింగ్ జరిగింది. భారత్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓటు వేయకుండా తీర్మానానికి దూరంగా ఉండగా, రష్యా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఆల్బేనియా, బ్రెజిల్, ఫ్రాన్స్,గబాన్, ఘన, ఐర్లాండ్, కెన్యా,మెక్సికో,నార్వే, బ్రిటన్,అమెరికా దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. రష్యా ఇంతకుముందు శుక్రవారంనాడు వీటో అధికారాన్ని ఉపయోగించినందువల్ల ఈసారి భద్రతా మండలి సమావేశంలో వీటో పవర్‌కు అవకాశం లేనందువల్ల రష్యా తీర్మానానికి ఉక్రేన్‌పై వ్యతిరేకంగా ఓటు వేసింది. భద్రతామండలిలో రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా ఐదు శాశ్వతసభ్య దేశాలకు వీటో చేసే అధికారం ఉంది. ఇంతకుముందు శుక్రవారంనాడు జరిగిన భద్రతామండలి సమావేశంలో కూడా భారతదేశం ఉక్రేన్ సమస్యపై రష్యాకు వ్యతిరేకంగా ప్రతిపపాదించిన తీర్మానంపై కూడా ఎవరికీ అనుకూలంగా ఓటు వేయకుండా దూరంగా ఉండిపోయి తటస్థ వైఖరి అనుసరించింది. శుక్రవారంనాడు భారత్ ఏ విధానాన్ని అయితే ఉద్ఘాటించి చెప్పిందో అదే విధానాన్ని ఆదివారంనాటి సమావేశంలో కూడా భారత్ గట్టిగా నొక్కి చెప్పింది. చర్చలు తప్ప మరో ప్రత్నామ్యాయం ఈ సమస్యకు పరిష్కారం కాదని భారత్ స్పష్టం చేసింది. దౌత్యమార్గంలో రెండు దేశాలు ప్రత్యక్షంగా ఎదురూ బదురూ కూర్చుని ఉక్రేన్ సంక్షోభ పరిష్కారంపై మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టీకరించింది.ఈ విషయంపై సమితిలో భారత దౌత్యవేత్త టిఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ, ఉక్రేన్ పరిస్థితి ఈ విధంగా దిగజారడం అత్యంత బాధాకరమని అన్నారు. వెంటనే హింసను అరికట్టాలన్నారు.
ఫ్రాన్స్ రాయబారి నికొలస్ డీ రివైరే ఆదివారంనాటి సమావేశంలో మాట్లాడుతూ, ఈ శత్రుత్వాన్ని ఇప్పటితో కట్టిపెట్టాలని, యుద్ధం విరమించాలని ఫ్రాన్స్, మెకికో దేశాలు రెండూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాయని చెప్పారు. ఉక్రేన్‌పై యుద్ధంవల్ల మానవ వ్యవస్థకు ఏర్పడిన నష్టంపై సమావేశం చర్చించిందన్నారు. ఉక్రేన్ పౌరులకు రక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని సమావేశం పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. జనావాసాలకు, మానవ వ్యవస్థ మనుగడకు వారి రక్షణకు ఉక్రేన్‌లో ఆటంకం లేకుండా ఉండాలంటే తక్షణం యుద్ధాన్ని విరమించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ సమావేశంలో అమెరికా ఉక్రేన్ యుద్ధాన్ని ఏ మాత్రం సమర్థించడానికి వీలులేనిదిగా పేర్కొంది. అబద్ధాలతో రష్యా చరిత్రను తిరగరాయాలని ప్రయత్నం చేస్తోందని ఆరోపణలుకు దిగింది. ప్రపంచం వీడియోల ద్వారా అన్ని దృశ్యాలను చూస్తోంది, ఎంత మానవ విధ్వంసం జరుగుతోందో ప్రపంచం గమనిస్తోంది అని అమెరికా దౌత్యవేత్త లిండా థామస్ అన్నారు. ఆల్బేనియా దౌత్యవేత్త ఫెరిత్ హోక్స్‌హా మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ చర్యను తీవ్రంగా ఖండించాలన్నారు. అంతర్జాతీయ చట్టాలను రష్యా ఉల్లంఘించిందన్నారు. ఉక్రేన్ రాయబారి సెర్గీ కైస్లుస్థై్య సమావేశంలో మాట్లాడుతూ, రష్యా దురాక్రమణకు పట్టుపట్టిందని, అయినాగానీ తాము దీటుగా ఎదుర్కొంటున్నామని అన్నారు. ఇదిలాఉండగా, 193 దేశాలు సభ్యులుగా ఉన్న అరుదైన జనరల్ అసెంబ్లీ సమావేశంతోపాటు, 15 దేశాలు సభ్యులుగా ఉన్న అత్యంత శక్తిమంతమైన భద్రతా మండలి సమావేశం కూడా సోమవారంనాడు జరిగింది. కాల్పుల విరమణ తక్షణం జరగాలని ప్రపంచదేశాలు ఈ సమావేశాలలో ఉద్ఘాటించాయి. లక్షలాదిమంది ఉక్రేన్ ప్రజలు యుద్ధంలో చిక్కుకుని తీవ్ర ఇక్కట్లకు గురి వుతున్నారని, ఇప్పటికే సుమారు ఐదు లక్షలమంది ప్రజలు పొరుగున ఉన్న దేశాలకు ప్రాణభీతితో వలస వెళ్ళారని దేశాలు ఆందోళన చెందాయి. చాలా సంవత్సరాల తరువాత భద్రతామండలి ఇలా అత్యవసర సమావేశం నిర్వహించడం ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఉపద్రవాలు సంభవించినప్పుడు మాత్రమే ఇలా అత్యవసర సమావేశాలు జరుగుతాయి. భధ్రతా మండలి ఏర్పడిన తరువాత ఇలాంటి జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఇప్పటివరకూ 11 మాత్రమే జరిగాయి. సభ్యులు ప్రతిఒక్కరూ యుద్ధ పరిస్థితిపై మాట్లాడారు. అలా మాట్లాడేందుకు వారికి పూర్తి అవకాశం ఇచ్చారు. ఉక్రేన్‌కు రోజు రోజుకూ అవసరాలు పెరుగుతున్నాయని, అందువల్ల సహాయం ఇవ్వాలని, వారికి ఆ మేరకు భరోసా ఇవ్వాలని ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ అన్నారు. శుక్రవారంనాడు మొదట జరిగిన భద్రతామండలి సమావేశంలో రష్యాకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని తన వీటో పవర్ ద్వారా రష్యా తిరస్కరించింది. దీంతో ఈ తీర్మానం ఆమోదం పొందకుండా పక్కకు వెళ్ళిపోయింది. రష్యా తక్షణం యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతూ 11 తేడాతో తీర్మాసంపై ఓటు చేశారు. ఈ ఓటింగ్‌లో భారత్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్‌స దేశాలు పాల్గొనకుండా తటస్థ వైఖరి అవలంబించాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం భద్రతామండ, జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అయితే దీని పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
భద్రతామండలిలో… ఓటింగ్‌కు భారత్ దూరం
RELATED ARTICLES