గోల్కొండ కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
అంబేద్కర్ విజ్ఞానకేంద్రంగా ప్రగతిభవన్‌ను మార్చేస్తాం
నిరుద్యోగ నిరసన దీక్షలో రేవంత్‌రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇందుకు అవసరమైతే సోనియాగాంధీ కాళ్ళు పట్టుకుంటానని టిపిసిసి అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. గోల్కోండ కోటపైన కాంగ్రెస్ జెండాను ఎగుర వేస్తామని, ప్రగతిభవన్‌ను అంబెడ్కర్ విజ్ఞాన కేం ద్రంగా మారుస్తూ మొదటి సంతకం పెడతామని ప్రకటించారు. యువజన కాంగ్రెస్ చేపట్టిన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆదివారం జరిగిన ‘నిరుద్యోగ నిరసన దీక్ష’ కు రేవంత్ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా దీక్ష చేపట్టిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డికి
నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్‌లో కొట్లాడిన పోటీ చేసే అవకాశం(టికెట్లు) వస్తాయని టిపిసిసి అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. తాను యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండి ఉంటే సిఎం కెసిఆర్‌కు గుణపం గుచ్చువాడినన్నారు. సిఎం కెసిఆర్‌కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికల యుద్ధానికి రావాలని, తాము పోటీకి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. రాష్ట్రంలో వచ్చే 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చేందుకు యువజన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 12 నెలల పాటు రాత్రి,పగలు తేడా లేకుండా కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. కెసిఆర్‌కు చేతకాకనే ప్రశాంత్ కిశోర్‌ను తెచ్చుకున్నారన్నారు. మంత్రిహరీష్ రావుకు ఆ పార్టీకి ఉద్యోగాలు వచ్చాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదన్నారు. యువకుల జీవితాలతో కెసిఆర్ చెలగాటం అడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఇప్పటికీ తీసేయలేదన్నారు. మధ్యలో వచ్చిన టిఆర్‌ఎస్ తెలంగాణకు తామే ఓనర్లమని చెప్పుకుటున్నారన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి,టిఆర్‌ఎస్ మాత్రమే ఉన్నాయనేలా ఆ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. కెసిఆర్ అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో బిజెపి జాతీయ, రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు కెసిఆర్‌ను జైలుకు పంపింపినా, పంపకపోయినా తాను మాత్రం కెసిఆర్‌ను జైల్‌కు పంపించి తీరుతానని తెలిపారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూరాష్ట్రంలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రశ్నించే యూత్ కాంగ్రెస్‌ను ప్రభుత్వం అణిచివేయాలని చూస్తోందని ఆరోపించారు. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు , మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు నిరుద్యోగ నిరసన దీక్షలో హాజరయ్యారు.
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఉద్యోగాలు భర్తీ
RELATED ARTICLES