HomeNewsBreaking Newsఉమ్మడి డ్రెస్‌ కోడ్‌ పెట్టండి

ఉమ్మడి డ్రెస్‌ కోడ్‌ పెట్టండి

సమానత్వం, జాతీయ సమగ్రతకు ఇది అవసరం
విద్యార్థుల హృదయాల్లో లౌకిక భావాలు నాటేందుకు
జ్యుడీషియల్‌ కమిషన్‌ను నియమించేలా ఆదేశించండి
సుప్రీంకోర్టులో తాజా వ్యాజ్యం వినతి
న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్‌ వివాదం దావానలంలా మారి ఇతర రాష్ట్రాలకు పాకింది. అంతటితో ఆగకుండా అంతర్జాతీయస్థాయిలో కూడా భారత్‌ అంతర్గత సమస్యపై జోక్యం, వ్యాఖ్యలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో శనివారంనాడు తాజాగా మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్‌) దాఖలైంది. దేశంలోని రిజిష్టర్డ్‌ విద్యాసంస్థలన్నింటిలోనూ సమానత్వం, జాతీయ సమగ్రత సాధనకు వీలు గా మతాలు, కులాలకు అతీతంగా ఉమ్మడి డ్రెస్‌ కోడ్‌ విధించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. సీనియర్‌ న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ, అశ్వనీ దూబేల ద్వారా నిఖిల్‌ ఉపాధ్యాయ అనే వ్యక్తి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చే శారు. దీంతోపాటు దేశంలోని సామాజిక సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన పరస్పర గౌర వం, ఐక్యత, జాతీయ సమగ్రతలను పెంపొందించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని, విద్యార్థుల హృదయాల్లో జాతీయ సమగ్రతా భావనలను పెంపొందింపజేసేందుకు వీలుగా ప్రభుత్వానిన సన్నద్ధం చేయాలని, అందుకోసం ఒక జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటుకు లేదా ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కూడా ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం కోరింది. దేశంలోని విద్యార్థులు, ప్రజల హృదయాల్లో సామాజిక, ఆర్థిక సమన్యాయం,సామ్యవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం,సౌభ్రాతృత్వ భావాలను పెంపొందింపజేసేందుకు కేంద్రం చర్యలు తీసుకునేవిధంగా మార్గదర్శకాలు జారీ చేయాలని కూడా ఆ వ్యాజ్యం కోరింది. కర్ణాటక హైకోర్టు సింగిల్‌ జడ్జి కృష్ణ దీక్షిత్‌ హిజాబ్‌ కేసును ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనానికి అప్పగించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఈనెల 10వ తేదీన ధర్మాసనం తాత్కాలిక ఆదేశాలు జారీ చేస్తూ, పూర్తి నిర్ణయం వెలువడే వరకూ విద్యాసంస్థలో మతపరమైన వేషధారణ ఉండకూడదని, వెంటనే విద్యాసంస్థలను తెరవాలని ఆదేశించింది. మరోవైపు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత, పరిస్థితులను బట్టి తగిన సమయంలో ఈ కేసులో జోక్యం చేసుకుంటామని భరోసా ఇచ్చింది. తక్షణం యుద్ధ ప్రాతిపదికపై అన్ని ఇతర కేసులను పక్కకు నెట్టి హైకోర్టులో ఉన్న కేసును సుప్రీంకోర్టుకు బదిలీచేసి విచారణ చేయడం సాధ్యం కాదంటూ తక్షణ జోక్యానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దేశంలోని ప్రాథమిక హక్కులను కాపాడతామని, సరైన సమయంలో ఈ కేసులో జోక్యం చేసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ వి రమణ స్పష్టం చేశారు. అయితే కర్ణాటక హైకోర్టులో ఈ కేసుసు విచారణను త్రిసభ్య ధర్మాసనం ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.
దేశంలో సామాజిక సమానత్వం సాధించేందుకు, విద్యార్థుల మధ్య సోదరభావం పాదుగొల్పేందుకు, గౌరవంగా మెలగుతూ, దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడేవిధంగా ఉన్న భావాలు విద్యార్థులలో పెంపొందింపజేయాల్సిన అవసరం ఉందని అందుకోసం భారత లా కమిసన్‌ ఒక సమగ్ర నివేదిక రూపొందించవలసి ఉంటుందని, కనుక రాజ్యాంగ సంరక్షకురాలుగా, ప్రాథమిక హక్కులను కాపాడే వ్యవస్థగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్‌ నిఖిల్‌ ఉపాధ్యాయ తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి నివేదిక మూడు నెలల వ్యవధిలోనే రూపొందించి సిద్ధం చేయాలని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు.కేంద్ర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ విధమైన ఆదేశాలు జారీ చేయడంతోపాటు లా కమిషన్‌ను కూడా తమ వ్యాజ్యంలో ఒక భాగస్వామిగా చేర్చాలని కోరింది.దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో కామన్‌ డ్రెస్‌ కోడ్‌ అమలు చేయాల్సిన అవసరం ఉందని, సామాజిక న్యాయాన్ని సాధించాల్సిన ఆవశ్యకత ఉందని, విద్యార్థుల మధ్య ముఖ్యంగా సోదరభావాన్ని, స్నేహ భావాన్ని పెంపొందింపజేయాల్సిన అవసరం ఉందని వ్యాజ్యంలో పిటిషనర్‌ కోరారు. మత హక్కులను విద్యాసంస్థల్లోకి అనుమతిస్తే, రేపు నాగ సాధువుల పిల్లలు విద్యాసంస్థల్లో చేరితే దుస్తులు లేకుండా తరగతులకు హాజరవుతామని, అది తమ సంప్రదాయమని వాదిస్తారని కూడా పిటిషనర్‌ హెచ్చరించారు. పలు దేశాల్లో కూడా ఇదేవిధంగా కామన్‌ డ్రెస్‌ కోడ్‌ అమలులో ఉండని పిటిషనర్‌ పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌,సింగపూర్‌, చైనా దేశాలలో ఇదేవిధంగా ఉమ్మడి డ్రెస్‌ కోడ్‌ అమలులో ఉందన్నారు. 2018లో స్కూళ్ళు కాలేజీల్లో ఇతర దేశాల్లో 2,50,000 గన్స్‌ను విద్యార్థులు వెంట తెచ్చారని ఒక నివేదిక ఉందని, అదే కామన్‌ డ్రెస్‌ కోడ్‌ ఉంటే ఈ పరిస్థితి ఉండదని, దీనిని నియంత్రించవచ్చునని పేర్కొనారు. 2021 డిసెంబరులో కర్ణాటక ఉడిపి జిల్లాలోని పీయు కాలేజీలో హిజాబ్‌ వివాదం మొదలైంది. ఆరుగురు విద్యార్థినిలు హిజాబ్‌ ధరించి వచ్చారు. హిజాబ్‌ లేకుండా తరగతులకు రావాలని ప్రిన్సిపల్‌ ఆదేశించారు. అక్కడితో వివాదం మొదలై ఆందోళనలకు దారితీసింది. విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
క్లాస్‌రూములో నమాజ్‌పై కొత్త వివాదం
ఒకవైపు దేశంలో హిజాబ్‌పై వివాదం కొనసాగుతుండగా, మరోవైపు తరగతి గదిలో నమాజు చేయడంపై సరికొత్త వివాదం చెలరేగింది. కొంతమంది విద్యార్థులు తరగతి గదిలో నమాజ్‌ చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన రెండు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కొత్త వివాదానికి తెరలేపాయి. కర్ణాటకలోని దక్షిణ కన్నడజిల్లా, బాగల్‌కోట్‌ జిల్లాలలో శుక్రవారం స్కూలు తరగతి గదిలో కొందరు విద్యార్థులు నమాజు చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోల్లో దర్శనం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 4వ తేదీ శుక్రవారంనాడు ఈ నమాజు దృశ్యాలను వీడియోలో బంధించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియోలను పెద్ద ఎత్తున షేరింగ్‌ అవుతూ ఉండటంతో వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని విమర్శకులు ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియోలపై ఫిర్యాదులు అందడంతో కర్ణాటక విద్యాశాఖాధికారులు శుక్రవారంనాడు ఆ స్కూలును సందర్శించి విషయంపై ఆరా తీశారు. ఈ ఘటపై తక్షణం నివేదిక ఇవ్వాలని, విద్యాశాఖాధికారి సి.లోకేశ్‌ను నిలిపివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా బాగల్‌కోట్‌కు సంబంధించిన వీడియోలో ఆరుగురు విద్యార్థులు తరగతి గదిలో నమాజ్‌ చేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ విధమైన పద్ధతులను విద్యార్థుల తల్లితండ్రులు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. జనవరి 24నకొంతమంది విద్యార్థులు కోలార్‌ పట్టణంలోని ముల్బాగల్‌ ప్రభుత్వ పాఠశాలలో నమాజ్‌ చేశారు. దీనిపై తల్లితండ్రులు నిరసన వ్యక్తం చేస్తూ, స్కూలు వద్ద ధర్నా చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.
కాగా హిజాబ్‌ వివాదం వెనుక కాంగ్రెస్‌ కుట్ర దాగి ఉందని కర్ణాటక మంత్రి వి.సునీల్‌ కుమార్‌ ఆరోపించారు.

హిజాబ్‌పై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు సహించం
న్యూఢిల్లీ ః భారత్‌లో హిజాబ్‌ వస్త్రధారణ వివాదంపై కొన్ని దేశాలు జోక్యం చేసుకుని వ్యాఖ్యలు చేయడంతో భారత్‌ శనివారంనాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా చేసే వ్యాఖ్యలను సహించబోమని భారత విదేశాంగమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. హిజాబ్‌ వస్త్రధారణ, డ్రెస్‌ కోడ్‌ అంశాలు భారత్‌ అంతర్గత అంశాలని, వాటిపై వ్యాఖ్యలు, విమర్శలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహ్వానించేది లేదని విదేశీ వ్యవహారాలశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి చెపాపరు. భారత్‌ గురించి బాగా తెలిసిన వారికి భారత్‌కుసంబంధించిన వాస్తవాలు ఏమిటో తెలుసునన్నారు. భారత రాజ్యాంగ వ్యవస్థ యంత్రాంగం, ప్రజాస్వామిక విలువల పరిధిలో రాజకీయ వ్యవస్థ దేశంలోని సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, చర్చించి పరిష్కరించుకోగలదని ఆయన స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా ఉద్దేశపూర్వకంగా చేసే వ్యాఖ్యలను అనుమతించబోమన్నారు. అమెరికాలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛా సంస్థ (ఐఆర్‌ఎఫ్‌) కు చెందిన రషీద్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ, హిజాబ్‌పై నిషేధం మత స్వేచ్ఛను ఉల్లంఘించినట్లేనని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ గడచిన బుధవారంనాడు ఇస్లామాబాద్‌లో భారత దౌత్యవేత్తను పిలిపించి హిజాబ్‌ వివాదంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ముస్లిం విద్యార్థినులపట్ల భారత్‌లో వివక్ష పాటిస్తున్నారని విమర్శించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments