HomeNewsBreaking Newsభయపెడుతున్న ‘వైరల్‌ ఫీవర్‌'

భయపెడుతున్న ‘వైరల్‌ ఫీవర్‌’

రాష్ట్రంలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు!
వైద్య శాఖ సర్వేలో వెల్లడి
మళ్లీ ఆంక్షలు, పరిమితులు
జలుబు, దగ్గు ఉంటే ఇంటికే
“వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌”బాట పడుతున్న సంస్థలు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ కరోనా మూడవ దశ కలవరపెడుతోంది.కరోనా వైరస్‌ లక్షణాలు రాష్ట్ర వ్యాపితంగా అత్యంత వేగంగా విస్తరిస్తోంది.“జ్వరం,దగ్గు,జలుబు,ఒళ్లు నొప్పులు” వంటి లక్షణాలు లేని వారు కనిపించని పట్టణాలు, గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. మూడవదశలోని ఒమిక్రాన్‌తో పెద్దగా ప్రమాదం లేదని వైద్యశాఖ చెబుతున్నప్పటికీ కరోనా లక్షణాలు మాత్రం ప్రజలను తీవ్ర భయందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర వ్యాపితంగా 20 లక్షల మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ సర్వేలో వెల్లడైనట్టు సమాచారం. ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు చేసిన ‘ఫీవర్‌ సర్వే’లో 20 లక్షల మందికిపైగా కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని, ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 12 నుంచి 15 లక్షల మందికి పైగా కరోనా లక్షణాలను గుర్తించడం అధికార యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సర్వే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్టు సమాచారం. మూడవ దశలోని ఒమిక్రాన్‌ వైరస్‌తో ప్రమాదం లేదని ప్రాణంతకం కాదని చెబుతున్నప్పటికీ, ఆ వైరస్‌ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఏ పట్టణంలో చూసినా కరోనా లక్షణాలు ఉన్న వారు కనిపిస్తున్నారు. అయితే జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు ఉన్నంత మాత్రానా కరోనా వైరస్‌ ఉన్నట్టు నిర్ధారించలేమని అధికారులు చెబుతున్నారు. మరో వైపు కరోనా లక్షణాలు లేకపోయినా పలువురిలో కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయినా కేసులు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వైరల్‌ ఫీవర్‌లు రాష్ట్ర వ్యాపితంగా కనిపిస్తున్నాయని, తద్వారా కరోనా వైరస్‌తో సంబంధం లేకుండా “కరోనా చికిత్స”ను తీసుకోవాలని మరి కొందరు చెబుతున్నారు. గత కొంత కాలంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నపాటి క్లినిక్‌లు, ఆర్‌ఎంఒ వైద్యుల వద్ద చిక్సిత తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏకంగా మెడికల్‌ షాపులకు వెళ్లి “జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పుల”లకు మందులు తీసుకుంటున్నారు. ఆయా షాపు నిర్వాహకులు కూడా కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకునే మందులను ఇస్తున్నట్టు పలువురు బాధితులు చెబుతున్నారు.
జలుబు, దగ్గు ఉంటే ఇంటికే
కరోనా నిర్ధారణ పరీక్షలతో సంబంధం లేకుండానే అనేక ప్రైవేటు సంస్థలు పలు ఆంక్షలను విధిస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు కంపెనీలు, ఇతర సంస్థలలో జలుబు, దగ్గు ఉంటే చాలు కరోనా వైరస్‌గా భావించి ఆ సిబ్బందిని ఇంటికి పంపిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా అవసరం లేకుండా జలుబు, దగ్గు తగ్గిన తర్వాతనే తిరిగి విధులలో చేరాలని ఆయా యాజమాన్యాలు సూచిస్తున్నాయి. పనిచేసే ప్రదేశాల్లో ఒక్కరికి కరోనా పాజిటివ్‌ అని తేలితే మిగతా వారికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేపిస్తున్నారు. అయితే ఇందులో కొందరికి కరోనా లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌ అని తేలడం పలువురిని మరింత భయందోళనకు గురిచేస్తోంది.
మళ్లీ మొదలైన ఆంక్షలు..పరిమితులు
కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుండడంతో మళ్లీ “కరోనా ఆంక్షలు” మొదలయ్యాయి. గడిచిన కొద్ది రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. జైళ్లలో కూడా ఖైదీల ములాఖత్‌లపైన ఆంక్షలు విధించారు. ఈ నెల 21 నుంచి జైళ్లలో ములాఖత్‌లను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే పాస్‌పోర్ట్‌ సేవలలో కూడా పరిమితులు పెట్టారు. ప్రస్తుతం ఉన్న స్లాట్‌లలో కేవలం 50 శాతం మాత్రమే బుక్‌ చేసుకుంటామని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌ పోర్టు వెల్లడించింది. ఇప్పటికే పలు ప్రైవేటు సంస్థలు,మీడియా సంస్థలు మళ్లీ “వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌” విధానాన్ని అమలు చేస్తున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments