సిజెఐ ఎన్వి రమణ
అమరావతి (ఎపి) : బలహీనులు స్వేచ్ఛగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. విజయవాడ సిద్ధార్థ న్యాయ కళాశాలలో ఆదివారం ఆయన శ్రీలావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ‘భారత న్యాయ వ్యవస్థ సవాళ్ళు’ అనే అంశంపై ఆయన ఉపన్యసించారు. ఈ రోజు బలహీనులు కోర్టులకు వచ్చే అవకాశాలులేవని, అందుకు అనుగుణంగా పరిస్థితుల్లో మార్పు రావాలన్నారు. న్యాయ వ్యవస్థపై ఉన్న విశ్వసనీయతమే ఈ దేశానికి పెద్ద బలమని అన్నారు. మాతృభాషలోనే న్యాయ వ్యవస్థ కార్యకలాపాలు కొనసాగాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటిస్తూ, న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలను కూడా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చాలా చోట్ల కనీస అవసరాలు కూడా లేవన్నారు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమిస్తారనే ఒక భావన కేవలం ప్రచారంలో ఉన్న ఒట్టి కల్పిత కథే అని జస్టిస్ రమణ చెప్పారు. న్యాయమూర్తుల ఎంపిక, నియామకం వెనుక పెద్ద ప్రక్రియ ఉంటుందని, ఎంతోమంది అందులో భాగస్వాములుగా ఉంటారని ఆయన అన్నారుసుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు, సర్వీసు నిబంధనల సవరణ బిల్లు సందర్భంగా ఇటీవల పార్లమెంటులో జరిగి చర్చ సందర్భంగా, ‘న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించడాన్ని ప్రపంచంలో తాను ఎక్కడా వినలేదు’ అని కేరళ ఎంపి జాన్ బ్రిట్టాస్ చెప్పడాన్ని జస్టిస్ ఎన్ వి రమణ తన ప్రసంగంలో ఉటంకిస్తూ, ఈ నియామకపు ప్రక్రియలో ఎంతోమంది బాధ్యులుగా ఉంటారని చెప్పారు. కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ, రాష్ట్రాల ప్రభుత్వాలు, గవర్నర్, హైకోర్టు కొలీజియం, ఇంటిలిజెన్స్ బ్యూరో ఆ తరువాత చివరాఖరుగా అత్యున్నతస్థాయీ అధికారవర్గం సరైన అభ్యర్థిని పరిశీలిస్తుందని వివరించారు. అన్నీ బాగా తెలిసినవారుకూడా ఇలాంటి ప్రచార కథల భావాల్లో కొట్టుకుపోవడం చాలా విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కల్పిత కథలు అందరికీ కాదని, కేవలం కొంతమందికే చెల్లుతాయన్నారు. మరింతమంది న్యాయమూర్తులను నియమించడంలో కేంద్ర చొరవచూపించడంపట్ల ఆయన హర్షం ప్రకటించారు. ఈ విషయంలో హైకోర్టులు చేసిన కొన్ని సిఫార్సులను కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ సుప్రీంకోర్టుకు ఇంకా పంపించవలసి ఉందని చెప్పారు. మాలిక్ మజ్హర్ కేసులో విధించిన కాలపరిమితిని కేంద్రం కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందని తాము భావిస్తామన్నారు. ఇటీవలికాలంలో న్యాయాధికారులపై భౌతిక దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముద్రణ, సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని, కక్షిదారులకు వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడు ఇలాంటి దాడులు జరుగుతున్నట్లు కనిపిస్తోందన్నారు. ఈ వ్యవస్థను, ప్రభుత్వ ప్రాసిక్యూటర్లను దీని నుండి విముక్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ న్యాయవాదుల వ్యవస్థకు సంపూర్ణమైన స్వాతంత్య్రం ఉండాలన్నారు. వారు కేవలం న్యాయాస్థానాలకు మాత్రమే జవాబుదారీగా ఉండేలా చూడాలని అన్నారు.
న్యాయ వ్యవస్థను పటిష్ట పర్చాలి
RELATED ARTICLES