ప్రజాపక్షం / దామరచర్ల తన తండ్రి ఇచ్చిన కూల్‌డ్రింగ్ బాటిల్‌ను ఆనందంగా తీసుకుని సేవించారు. అందులో ఉన్నది విషం అని గ్రహించని చిన్నారులు ప్రాణాలొదిలారు.. కూల్‌డ్రింక్‌లో విషం కలిపిన తండ్రి ఆపై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నునావత్ తండాలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గేర్ కిషన్ నాయక్ (33) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి హర్షవర్ధన్ (8), అఖిల్ (6) కుమారులు, భార్య నాజి ఉన్నారు. కాగా, ఆర్థిక ఇబ్బందులతో కిషన్ మానసికంగా కృంగిపోయాడు. చేసిన అప్పులు తీర్చలేక తనకు తానే కుమిలిపోయాడు. తాను చనిపోయిన తరువాత పిల్లల భవిష్యత్తు ఏంటని ఆలోచన పడి గురువారం సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో వ్యవసాయ పొలం వద్దకు కుమారులను తీసుకెళ్లి కల్లు తాపించి సంతోష పెట్టాడు. ఆ తరువాత తనవెంట తెచ్చుకున్న విషాన్ని కూల్‌డ్రింక్ బాటిల్‌లో కలిపి చిన్నారులకు తాగించాడు. విషం తాగిన చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, తాను కూడా చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమివ్వగా ఇన్‌చార్ ఎస్‌ఐ వీర శేఖర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కిషన్ నాయక్ కుటుంబాన్ని డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ , మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, ఎన్‌బిఆర్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ , గ్రామ సర్పంచ్ పరామర్శించి, ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు.
ఇద్దరు పిల్లలు సహా తండ్రి ఆత్మహత్య
RELATED ARTICLES