HomeNewsBreaking Newsకారకులు ఎవరు?

కారకులు ఎవరు?

ఇటుక బట్టీలతో పెరుగుతున్న కాలుష్యం
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో అక్రమంగా నిర్వహణ
పదుల సంఖ్యలో వెలిసిన వైనం
ప్రజాపక్షం / వేములపల్లి ఇటుక బట్టీల వల్ల నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. ఇంటి నిర్మాణాలు, ఇతర పనుల కోసం ఇటుకల అవసరం పెరగడంతో వీటికి డిమాండ్‌ భారీగా పెరిగింది. దీంతో నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న వేములపల్లిలో ఇటుక బట్టీల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతున్నది. ఇటుక బట్టీల వ్యాపారం కాసు లు కురిపిస్తుండటంతో వ్యాపారులు మరింత వక్ర మార్గాలను ఎంచుకుని మరిన్ని సంఖ్యలో బట్టీలు పెట్టేందుకు ధైర్యం చేస్తున్నారు. అధికారుల పరోక్ష సహకారం ఉండడం వల్లనే ఇటుక బట్టీల మాఫీయా పెట్రేగిపోతున్నదని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేములపల్లి మండలంలోని ప్రధాన రహదారి వెంట వెలిసిన ఇటుకబట్టీల నుండి వెదజల్లే కాలుష్య వ్యర్ధాల వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. సూర్యాపేట, మిర్యాలగూడకు తక్కువ దూరంలో ఉన్న ప్రధాన రహదారి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మండలంలోని రావువారిగూడెం నుండి పచ్చారిగడ్డ వరకు సుమారు 4 కిలో మీటర్ల దూరంలో దాదాపు 15 ఇటుక బట్టీలు ఉన్నాయంటే ఇక్కడ ఎంత పెద్దఎత్తున ఇటు బట్టీల వ్యాపారం కొనసాగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఇటుక బట్టీల నుంచే దుమ్ము, దూళి, పొగ రహదారిపై వెళ్తున్న బాటసారుల కళ్లల్లో పడి కంటిచూపు దెబ్బ తినడమే కాకుండా పలుమార్లు రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇదిలావుంటే బట్టీల నుంచి వెలువడే ప్రమాదకర వాయువులు వాతావరణాన్ని కాలుష్య కొరలలోకి నెడుతున్నాయి. మండలంలో ప్రజల నివాసానికి దగ్గరగా ఉన్న ఇటుక బట్టీలను దూర ప్రాంతాలకు తరలించాలని అనేక సార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకునే నాధుడేలేడని, ఫలితంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఖజానాకు గండి
ఇటుక బట్టీల మాఫీయాకు కొందరు అధికారుల అండదండగా ఉంటూ ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన పన్నులు, రుసుములను మళ్లించి జేబులు నింపుకుంటున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇటుక బట్టీలు పెట్టేందుకు ముందస్తుగా పరిశ్రమల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఇటుక తయారీకి మట్టి వినియోగం, బట్టీల నిర్వహణ కోసం రెవిన్యూ, భూగర్భ గనుల శాఖ అనుమతులు పొందాలి. వ్యవసాయేతర భూములకు నాలా కనెక్షన్‌ తీసుకోవాలి. కార్మిక శాఖ ద్వారా బట్టీలో పని చేస్తున్న కార్మికుల కోసం ప్రత్యేక అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ ఈ నిబందనలన్నింటినీ తుంగలో తొక్కి కొందరు అధికారుల అండతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే బట్టీలను నిర్వహిస్తున్నారు. అధికారులంతా వీటిపై కన్నెత్తి చూడకపోవడం, వక్రమార్గంలో వచ్చే లంచాలకు ఆశపడి అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా మండలంలో అడ్డగోలుగా వెలసిన ఇటుక బట్టీలపై తగిన చర్యలు తీసుకోవాలనికోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments