HomeNewsBreaking Newsకాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి

కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి

మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు
26 మంది నక్సల్స్‌ హతం
ముంబయి : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దట్టమైన అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 26 మంది నక్సల్స్‌ హతమయ్యారు. ముగ్గురు పోలీసు సిబ్బందికి తీవ్రగాయాలైనట్లు గడ్చిరోలి ఎస్‌పి ఒక ప్రకటనలో తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం ఉదయం కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిపై ఎదురుకాల్పులు జరిపారని ఓ సీనియర్‌ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఇంత వరకూ 26 మృత దేహాలను స్వాధీనం చేసుకున్నామని, మృతుల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో, అదనపు బలగాలను రప్పిస్తున్నారు. భారీగా మోహరించిన భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. కాగా, కాల్పుల్లో గాయపడిన ముగ్గురు పోలీసు సిబ్బందిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌ ద్వారా నాగ్‌పూర్‌కు తరలించారు. ఛత్తీసగఢ్‌ అడవుల నుంచి గడ్చిరోలికి మావోయిస్టులు వెళ్తున్నారంటూ నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం ఓ కమాండో బృందానికి అందగా కూంబింగ్‌ ఆరంభమైంది. బృందానికి తారస పడిన నక్సల్స్‌ కాల్పులకు పాల్పడ్డారు. దీంతో కమాండో బృందం ఎదురు కాల్పులు జరిపారు. మావోలు ఉన్నట్టు అనుమానిస్తున్న ఈ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన భద్రతా దళాలు కాల్పులకు దిగడంతో, భారీగానే మరణాలు ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో ఇంత భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి.
ఇన్‌ఫార్మర్‌ నెపంతో గ్రామస్తుల కాల్చివేత
మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌ జిల్లాలో పోలీసు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్నారని అనుమానిస్తూ ఇద్దరు గామస్తులను నక్సల్స్‌ పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత మలిఖేడి గ్రామంలో చోటు చేసుకున్నట్లు ఓ అధికారి చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం… సంతోష్‌, జగదీశ్‌ అనే ఇద్దరు గ్రామస్తులను నక్సల్స్‌ కాల్చివేసినట్లు బైహర్‌ సబ్‌డివిజన్‌ అధికారి చెప్పారు. అయితే ఈ హత్యల్లో ఎంత మంది మావోయిస్టులు పాల్గొన్నారనేది తెలియాల్సి ఉందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments