HomeNewsBreaking Newsఅక్రమ రవాణా

అక్రమ రవాణా

పేరు ప్రభుత్వ పథకాలది
మామూళ్ల మత్తులో రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు
ప్రజాపక్షం/ ఖమ్మం ఇసుక మాఫియా నిత్యం రెచ్చిపోతున్నది. ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలు గా వర్థిల్లుతున్నది. ఖమ్మం జిల్లాలోని మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌, ఇతర రాజకీయ పెద్దల అండదండలతో ఇసుక మాఫియా మిలాఖత్‌ అయి ఇసుక దందాకు పాల్పడుతున్నారు. తెల్లవారిందే మొదలు రాత్రి పొద్దుపోయే వరకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అడ్డుఅదుపు లేకుండా కొనసాగిస్తున్నారు. ఇసుక దందాను నియంత్రించాల్సిన కొందరు అధికారులు కళ్లు మూసుకోవడంతో వేల టన్నుల ఇసుక పక్కదారి పడుతున్న ది. ఈ ఇసుక అక్రమ రవాణా వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు అధికారుల ప్రమేయం కూడాఉందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇంకేముంది ‘దోచుకునే వారికి దోచుకున్నంత’ అనే చందంగా కళ్ల ముందే ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా సాగుతున్నది. తమ లక్ష్యాల కోసం మొక్కుబడిగా అధికార యంత్రాంగం కేసులు నమోదు చేసి ‘మమ’ అనిపిస్తున్నారు. ఫలితంగా అక్రమార్కులకు ఇసుక కాసులు కురిపిస్తున్నది.
ఎక్కడ నుంచి ఎలా
ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి, పైనంపల్లి ప్రాంతాల్లో పాలేరు వాగు, పైనంపల్లి ర్యాంపు, రామచంద్రాపురం, సుర్దేపల్లి, ముదిగొండ మండలం గంధసిరి, పెద్దమండవ, ఖమ్మం నగర పరిధిలోని రామన్నపేట సమీపంలో గల మున్నేరు ప్రాంతం నుంచి యధేచ్చగా తవ్వకాలు చేస్తూ ఇసుకను తరలిస్తున్నారు. ఖమ్మం నగరంతో పాటు ముదిగొండ, నేలకొండపల్లి ప్రాంతాల్లో గల పరిసర ప్రాంతాలకు అవసరం ఉన్న వారికి నేరుగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. గతంలో వాహన యజమానులు ఇసుకను భయం భయంగా తరలించగా ఇప్పుడు స్థానికంగా ఉండే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలే వాహనదారులకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నట్లు వినికిడి. అధికారుల పేరుతో సదరు నేతలు ట్రాక్టర్‌ యజమానుల నుంచి నెలవారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణ సర్వత్రా వినిపిస్తున్నది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించినా ఇసుక తరలింపు మాత్రం ఆగడం లేదు.
పేరు ప్రభుత్వ పథకాలది
ఇండ్ల నిర్మాణాలకు ఇసుక తరలించే అనుమతులు లేవు కానీ ప్రభుత్వ పరంగా నిర్వహించే అభివృద్ధి పథకాలకు మాత్రం ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతులు ఉన్నాయి. ఫలితంగా ప్రభుత్వ పథకాల పేరుతో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా సాగుతున్నది. పలు చోట్ల ప్రభుత్వ పథకాలైన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల కోసం అనుమతులు ఉండేది పది ట్రక్కుల ఇసుక అయితే కాంట్రాక్టర్లు 100 ట్రక్కుల ఇసుక తరలిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అధికారులు పట్టించుకోవడం లేదని, వారి కనుసన్నల్లోనే ఇసుక తరలింపు యధేచ్చగా సాగుతున్నదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఇసుక దందాపై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటే తప్ప ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేమనేది స్పష్టమవుతున్నది.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments