కెసిఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే : బండి
ప్రజాపక్షం/హైదరాబాద్ ముఖ్యమంత్రి కెసిఆర్ గంటకో మాట మాట్లాడి రైతులను ఆగం చేస్తున్నారని, నోరు తెరి స్తే అన్ని అబద్ధాలే అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సిఎం చైనాను సమర్థిస్తూ దేశద్రోహి మాదిరి గా మాట్లాడారని ఆయన ఆరోపించారు. దేశ సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీనేలా మాట్లాడారన్నారు. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ దేశ సార్వభౌమత్వాన్ని అవమానించారని, దేశం పట్ల గౌరవం లేని కెసిఆర్ ప్రధాని కావాలని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. వరి కొంటామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిందని, రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం లేఖ ఇచ్చిందని తెలిపారు. మార్కెట్ కమిటీలు, కొనుగోలు కేంద్రాల రద్దు అంశం వ్యవసాయ చట్టంలో ఉన్నట్టు చూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. వ్యవసాయ చట్టం అన్యాయమని భావిస్తే అప్పుడే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి ఎక్కడ సాగవుతుందో సమాధానం చెప్పాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తగ్గించరో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచిందని ఆరోపించారు. వ్యవసాయ చట్టం విషయంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, ఢిల్లీలో ధర్నాలు ఎక్కడున్నాయని, రైతులు ఆందోళన చేస్తున్నారా అని ప్రశ్నించారు. రేషన్ బియ్యం రీసైకిల్ చేసి కొందరు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కెసిఆర్‌ను ఎప్పుడు టచ్ చేయాలో తమకు తెలుసని, మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను టచ్ చేశామని, మాజీ కేంద్రమంత్రి చిందంబరాన్ని కూడా అలాగే చేశామని, దేనికైనా సమయం రావాలని, సమయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. కెసిఆర్ డిప్రెషన్‌లో ఉండి మాట్లాడుతున్నారన్నారు. పెట్రోల్, డీజిల్‌పై రాజస్థాన్ తర్వాత తెలంగాణ రాష్ట్రమే అత్యధిక వ్యాట్ వసూలు చేస్తుందని ఆరోపించారు. తాము 80 శాతం ఉన్న హిందూ ధర్మం కోసమే పని చేస్తామని, సెక్యూలర్ పార్టీల నుంచి హిందువులను కాపాడుకుంటామని పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రజలను, రాష్ట్రాన్ని మోసం చేసిన వ్యక్తి కెసిఆర్ అని ఆరోపించారు. పక్క రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లను ఆపలేని వ్యక్తి.. దేశంలో అగ్గి పుట్టిస్తాడా అని ఎద్దేవా చేశారు.
రైతులను సిఎం… ఆగం చేస్తుండు!
RELATED ARTICLES