HomeNewsBreaking Newsటి20 ప్రపంచ కప్‌ చాంపియన్‌షిప్‌ అఫ్గాన్‌పై కివీస్‌ విజయం

టి20 ప్రపంచ కప్‌ చాంపియన్‌షిప్‌ అఫ్గాన్‌పై కివీస్‌ విజయం

భారత్‌ సెమీస్‌ ఆశలకు తెర
అబూదబీ : టి20 ప్రపంచ కప్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో మాజీ చాంపియన్‌ టీమిండియా ఇంటిదారి పట్టనుంది. సోమవారం నమీబియాతో చివరి గ్రూప్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉన్నప్పటికీ, తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలను ఎదుర్కొన్న కారణంగా సెమీస్‌ అవకాశాలను ప్రమాదంలోకి నెట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆదివారం కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై న్యూజిలాండ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించడంతో, భారత్‌కు చివరి మ్యాచ్‌ లాంఛనప్రాయమే కానుంది. గ్రూప్‌ ‘ఎ’ నుంచి ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, గ్రూప్‌ ‘బి’ నుంచి న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ జట్లు సెమీస్‌కు అర్హత సంపాదించాయి. ఆదివారం నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌ నిర్ణత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. నజీబుల్ల 73 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారు అదే స్థాయిలో రాణించలేకపోయారు. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. టిమ్‌ సౌథీ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 18.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి, లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు మార్టిన్‌ గుప్టిల్‌ (28), డెరిల్‌ మిచెల్‌ (17) చక్కటి ఆరంభాన్నివ్వగా, కెప్టెన్‌ కేన్‌ విలియమ్‌సన్‌ (40 నాటౌట్‌), వికెట్‌కీపర్‌ డెవాన్‌ కాన్వే (36) మరో వికెట్‌ కూలకుండా కివీస్‌ను విజయపథంలో నడిపారు. ఈ విజయంతో, ఎనిమిది పాయింట్లతో కివీస్‌ సెమీస్‌కు దూసుకెళ్లగా, కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్న కోహ్లీ సేన సెమీస్‌ ఆశలకు తెరపడింది. నమీబియాతో జరిగే మ్యాచ్‌లో భారత్‌ గెలిచినా, మొత్తం ఆరు పాయింట్లతో గ్రూప్‌ ‘బి’లో మూడో స్థానంలో నిలుస్తుందే తప్ప మరే అద్భుతం జరగదు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments