HomeNewsBreaking Newsజమ్మూకశ్మీర్‌లో... వలస కూలీల వెతలు

జమ్మూకశ్మీర్‌లో… వలస కూలీల వెతలు

ఇద్దరిని కాల్చిచంపిన ఉగ్రవాదులు

శ్రీనగర్‌ : ఉన్న ఊర్లో ఉపాధి కరవై, పొట్టచేతపట్టుకొని సుదూర ప్రాంతాలకు వెళుతున్న వలస కూలీ ల బతుకుల్లో చిమ్మచీకట్లు తప్ప వెలుగులు కనిపించడం లేదు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వలస కూలీలు కనిపిస్తారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి మరింత సమస్యాత్మకంగా కనిపిస్తున్నది. కుల్గాం జిల్లాలోని వాన్‌పో ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిని కాల్పుల్లో ఇద్దరు వలస కూలీలు మృతి చెంద డం అక్కడ నెలకొన్న భయానక వాతావరణ ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తున్నది. కర్మాగారాల్లోనేకాదు.. రోడ్డు ప్రమాదాలు జరిగినా ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నది వలస కూలీలే. ఏ సమస్య వచ్చినా ముందుగా బాధితుల జాబితాలో చేరేదీ వారే. ఇప్పుడు ఉగ్రవాదులు కూడా వలస కూలీలనే లక్ష్యం చేసుకొని దాడులు చేయడం, కాల్పులు జరపడం చూస్తుంటే, వారి బతుకులు మరింత ప్రమాదంలో పడుతున్నట్టు స్పష్టమవుతున్నది. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ రద్దు తర్వాత అక్కడ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది. కరోనా మహమ్మారి పంజా విసిరిన తర్వాత నెలకొన్న దుర్భర పరిస్థితుల నేపథ్యంలో, బతుకుతెరువు కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఎంతో మంది కూలీలకు జమ్మూకశ్మీర్‌ స్వర్గధామంలా కనిపించింది. అక్కడికి వెళితే ఆర్థిక సమస్యలు తీరిపోతాయని, సమస్యల సుడిగుండం నుంచి బయటపడవచ్చన్న ఆశతో ఎంతో మంది అక్కడికి క్యూ కట్టారు. కానీ, మాటలకు చేతలకు చాలా తేడా ఉందనే విషయం వారికి ప్రత్యక్ష అనుభవంతో బోధపడింది. బిహార్‌ నుంచి వలస వచ్చిన ఇద్దరు కూలీలు వీరేంద్ర పాశ్వాన్‌, అరబిద్‌ కుమార్‌ సా ఇటీవల ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు బలికావడంతో జమ్మూకశ్మీర్‌లో ఉండడం ఎంత ప్రమాదకరమో అందరికీ స్పష్టమైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాగిర్‌ అహ్మద్‌ హత్యకు గురైన ఘటనను మరువక ముందే, ఈనెల 5వ తేదీన శ్రీనగర్‌లో వీరేంద్ర పాశ్వాన్‌ను ఉగ్రవాదులు హత్య చేశారు. అతను రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌కు వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నాడు. మరో వలస కూలీ అరబిద్‌ కుమార్‌ సా ఈనెల 16వ తేదీన పుల్వామాలో ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు. అం తకు ముందు ముందే, అదే పుల్వామా జిల్లాలో సాగిర్‌ అహ్మద్‌ను ముష్కరులు కాల్చి చంపారు. కాగా, ఆదివారం వాన్‌ పోలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. వలస కూలీలు ఉంటున్న ప్రాంతంలో వారు కాల్పులు జరపడంతో, ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నిజానికి వీరికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. మత వాదం అసలే తెలియదు. కూలీలుగా జీవితాన్ని సాగించడం
తప్ప వారు హత్యకు గురికావాల్సిన స్థాయి నేరాలు ఏవీ చేయలేదు. కానీ, ఉగ్రవాదులు ఇప్పుడు వసల కూలీలను లక్ష్యం చేసుకోవడం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనే వాస్తవాన్ని చెప్పకనే చెప్పింది. ఇప్పటి వరకూ ఎక్కడా లేని కొత్త దుర్మార్గానికి జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు తెరలేపారు. వలస కూలీలపై తుపాకులు ఎక్కుపెడుతున్నారు. వలస కూలీలవి అసలే చాలీచాలని జీవితాలు. రోజూ కూలీ దొరుకుతుందన్న నమ్మకం లేదు. చేసిన పనికి తగినంత ప్రతిఫలం దక్కడం కూడా కష్టమే. వందల వేల మైళ్లు వెళ్లినా వీరి బతుకు చిత్రాలు ఎప్పటి మాదిరిగానే జమ్మూకశ్మీర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా తదితర రాష్ట్రాల నుంచి వేలాదిగా వలస కూలీలు పనులు చేస్తున్నారు. మురికివాడల్లో, పూరి పాకల్లోనే వీరి నివాసం. అర్ధాకలితో జీవితాలు సాగిస్తున్న వీరిపై ఉగ్రవాదులు రెచ్చిపోవడం దుర్మార్గం. ఇక్కడి వలస కూలీల వెతలు అన్నీఇన్నీ అని చెప్పడానికి వీల్లేదు. కొత్తగా ఉగ్రవాదుల బెడద కూడా మొదలుకావడంతో, వీరి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వాలు స్పందిస్తే తప్ప వీరిపై దాడులు ఆగవు. బతకులు చక్కబడవు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments