బంజారాహిల్స్: ఇంటిని అద్దెకు తీసుకుంటానని నమ్మించి బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు కాజేసిన వ్యక్తి పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. రోడ్ నం.13లో నివాసముంటున్న అనిల్ డిచ్‌పల్లి అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు. తమ ఫ్లాట్‌ను అద్దెకు ఇస్తామని హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌లో ఇటీవల అనిల్ తండ్రి వెంకటేశ్వరరావు ప్రకటన ఇచ్చాడు.
శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఇంటిని అద్దెకు తీసుకుంటానని చెప్పాడు. అడ్వాన్స్‌గా రూ.25వేలు చెల్లిస్తానని, బ్యాంకు వివరాలు ఇస్తే గూగుల్‌పే అకౌంట్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తానని నమ్మబలికాడు.
అతడు సూచించిన వివరాలు అప్‌లోడ్ చేయగానే బ్యాంక్ ఖాతా నుంచి రూ.25వేలు డ్రా అయ్యాయి. బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.