అడ్డగించిన పోలీసులు
రైతులపై వాటర్ కెనాన్లు ప్రయోగం
చర్చలు విఫలం, ఉద్రిక్తత
కర్నాల్ : హర్యానాలో మంగళవారంనాడు వేలాదిమంది రైతులు భారీ నిరసన ప్రదర్శన చేశారు. కర్నాల్‌లోని జిల్లా సెక్రటేరియట్ సమీపంలో ప్రదర్శనగా వచ్చిన వేలాదిమంది రైతులను పోలీసులు అడ్డుకుని వారిపై వాటర్ కెనాన్లను ప్రయోగించారు. ఆగస్టు 28వ తేదీన లాఠీచార్జి జరిపిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. క్రూరమైన పోలీసు లాఠీచార్జీలో ఒక రైతు మరణించగా, అనేకమంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. కారకులైన పోలీస్ అధికారులపై చర్యలు చేపట్టకపోతే మినీ సెక్రటేరియట్‌ను ప్రదర్శనగా వచ్చి ముట్టడిస్తామని రైతు సంఘాల నాయకులు ముందుగానే హెచ్చరిక చేశారు. ఈ సెక్రటేరియట్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూ అనజ్ మండిలో మహాపంచాయత్ వద్దనే వేలాదిమంది రైతులు ఘెరావ్ జరిపారు. అక్కడి నుండి ప్రదర్శనగా వచ్చి సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. దగ్గరకు వచ్చేలోపే పోలీసులు వాటర్ కెనాన్లతో రైతులను చెల్లాచెదురు చేసేందుకు యత్నించారు. రైతులు మంగళవారం ఉదయమే న్యూ అనజ్ మండి ప్రాంతానికి మోటారు సైకిళ్ళపై ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడే గుమిగూడి ఉన్న రైతుల నుండి 11 మంది సభ్యుల ప్రతినిధి బృందాన్ని స్థానిక పాలనాధికారులు చర్చలకు పిలిచారు. వారికి తమ డిమాండ్‌లను రైతులు తెలియజేశారు. నిరసన ప్రదర్శన మానుకోవాలని అధికారులు చెప్పడంతో, రైతులు మళ్ళీ ప్రదర్శనగా ఐదు కిలోమీటర్లు నినాదాలు చేస్తూ, సెక్రటేరియట్‌కు వెళ్ళారు. అధికారులతో తమ చర్చలు విఫలమయ్యాయని, తమ డిమాండ్ల పరిష్కారానికి అధికారులు అంగీకరించలేదని రైతు నాయకుడు జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ చెప్పారు. అధికారులు తమ డిమాండ్ల పరిష్కారానికి ఒప్పుకోనందువల్లనే తాము ఐదు కిలోమీటర్లు శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్ళామని, కానీ అక్కడ పోలీసులు తమపై నీటి తుపాకులు ప్రయోగించారని రైతు నాయకులు విమర్శించారు. తాము ఎంతో శాంతియుతంగా ప్రదర్శన జరిపామని, కానీ పోలీసులే ఘర్షణ వాతావరణం సృష్టించారని రైతు నాయకులు విమర్శించారు. పోలీసులు మాత్రం తమను అడ్డుకున్నారన్నారు. రైతులు తమ సంఘాల జెండాలను భుజాన వేసుకుని భారీ ప్రదర్శన చేశారు. అయితే వారి మార్గంలో పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. బ్యారికేడ్లు అనేకచోట్ల ఏర్పాట్లు చేసి వారిని వెనక్కు మళ్ళించేందుకు యత్నించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నాయకులు రాకేశ్ తికాయత్, బల్బీర్ సింగ్ రాజేవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహాన్, దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్‌లు తొలుత కర్నాల్‌కు చేరుకున్నారు. వారు కొద్ది రోజుల క్రితం ముజఫర్ నగర్‌లో భారీ రైతు ప్రదర్శనలో పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు 27న బంద్ పిలుపు ఇచ్చారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అనేక నెలలుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. తొలుత అనజ్ మండి వద్ద జరిగిన మహాపంచాయత్‌లో యోగేంద్ర యాదవ్ ప్రసంగించారు. ఆగస్టు 28న లాఠీచార్జిలో రైతు మరణించినా గానీ పోలీసులు పట్టించుకోలేదని, అసలు రైతు మరణించలేదని బుకాయించాని ఆయన విమర్శించారు. ఏ అధికారి ఇంత క్రూరంగా రైతులపై లాఠీఛార్జీ చేయమని ఆదేశాలు జారీ చేశారు? ఎందుకు చేశారు? వారిపై చర్యలు తీసుకోవాల్సిందే…అని ఆయన డిమాండ్ చేశారు. ఇంత క్రూరంగా లాఠీఛార్జీ చేయమని ఏ ఐఎఎస్ అధికారి అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.