వాషింగ్టన్: హరికేర్ ‘ఐదా’ అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్నది. న్యూయార్క్, న్యూజెర్సీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మెట్రో స్టేషన్లలోకి కూడా వరద నీరు చేరింది. పెన్సల్వేనియాను కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భీకరంగా వీస్తున్న గాలలు, మరోవైపు కుండపోత వర్షాలు అమెరికాను అతలాకులం చేస్తున్నాయి. ఇళ్లలోకి, సెల్లార్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో పరిస్థితి దారుణంగా మారింది. కార్లు, ఇతర వాహనా లు నీటిలో తేలియాడుతున్నాయి. ‘ఐదా’ తుపా ను తీవ్రతను, వరద బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకొని న్యూయార్క్, న్యూజెర్సీ గవర్నర్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. న్యూజెర్సీ విమానాశ్రయం వరద నీటిలో మునిగిపోయిందంటే, ‘ఐదా’ తీవ్రతను
న్యూయార్క్, న్యూజెర్సీ జలమయం
చెరువులను తలపిస్తున్న రోడ్లు
మెట్రో స్టేషన్లలోకి వరద నీరు
ఊహించుకోవచ్చు. న్యూజెర్సీతోపాటు న్యూయార్క్‌లోనూ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసేశారు. దక్షిణాదిన ఉండే లూసియానాను సైతం ‘ఐదా’ తుపాను వెంటాడింది. న్యూయార్క్‌లోని లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ సూచించారు. బ్రూక్లిన్, క్వీన్స్ నగరాలు కూడా వరద నీటిలో మునిగిపోవడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ కూడా వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అక్కడ విరుచుకుపడిన టోర్నడో ధాటికి అనేక ఇళ్లు నెలమట్టమయ్యాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెన్సిల్వేనియాలో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భారీ వర్షాల కారణంగా మారిస్ రోడ్డులో వాహనాలు నీట మునిగాయి. రోడ్లపై నిలువెత్తున వరద నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. మాంట్‌గొమెరి కౌంటీలో ‘ఇడా’ కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెస్టర్ కౌంటీ వెస్ట్‌టౌన్ టౌన్‌షిప్, న్యూ ఆర్లీన్స్ తదితర ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తుతున్నది. లాస్‌ఏంజిలిస్, వర్జీనియా ప్రాంతాల్లోనూ ‘ఐదా’ భయానక పరిస్థితులను సృష్టించింది. అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది నుంచి జాతీయ విపత్తుల నిర్వహణ బృందాల వరకూ ప్రతి ఒక్కరూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.