దేశ రాజధానిలో తెలంగాణ భవన్‌కు సిఎం కెసిఆర్ శంకుస్థాపన
ప్రజాపక్షం / హైదరాబాద్ దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ కార్యక్రమానికి టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతం లో సుమారు 1100 చదరపు మీటర్ల ప్రాంగణం లో తెలంగాణ భవన్‌ను నిర్మించనున్నారు. త్రీ ప్లస్ త్రీ పద్ధతిలో భవనాన్ని కట్టనున్నారు. భూమి పూజకి ముందుగా సిఎం కెసిఆర్ ప్రత్యేక హో మంలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 1:48 గంటలకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్‌తోపాటు, టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్, పలువురు మంత్రులు, టిఆర్‌ఎస్ ఎంపిలు, ఎంఎల్‌ఎ లు, ఎంఎల్‌సిలు, టిఆర్‌ఎస్ రాష్ర్ట కమిటీ సభ్యు లు, ఇతర నేతలు పాల్గొన్నారు. గతేడాది అక్టోబరు 9న ఢిల్లీ వసంత విహార్ వద్ద టిఆర్‌ఎస్‌కు కేంద్ర ప్రభుత్వం 1,100 చదరపు మీటర్ల భూమిని కేటాయించి, నవంబరు 4న భూమిని అప్పగించింది. కొవిడ్ పరిస్థితుల కారణంగా దాదాపు ఏడాది తరువాత భవన నిర్మాణానికి టిఆర్‌ఎస్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీలో టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన ద్వారా దేశ రాజధానిలో దక్షిణ భారత దేశం నుండి కార్యాలయం ఏర్పాటు చేసుకున్న రెండవ ప్రాంతీయ పార్టీగా నిలవడం టిఆర్‌ఎస్ శ్రేణులకు గర్వకారణమని టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కోసం అనునిత్యం పాటుపడుతున్న పార్టీ ప్రజాప్రతినిధులకూ, నాయకులకూ, కార్యకర్తలకూ ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దశాబ్దాల క్రితం జలదశ్యం వద్ద ఉద్యమ నాయకుడు కెసిఆర్ చేతుల మీదుగా ఊపిరి పోసుకున్న టిఆర్‌ఎస్ నేడు అదే నాయకుడి చేతుల మీదుగా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరగడం ఒక చారిత్రక సన్నివేశమని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రతోపాటు టిఆర్‌ఎస్ పార్టీ చరిత్రలోనూ శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు రాష్ర్ట పునర్నిర్మాణ ప్రయాణాన్ని మంత్రి కెటిఆర్ ప్రస్తావించారు. ఉద్యమానికి ముందు ప్రత్యేక రాష్ట్రం తర్వాత సైతం రెండు దశాబ్దాలుగా తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పర్యాయపదంగా తెలంగాణ రాష్ర్ట సమితి నిలిచిందంటే అతిశయోక్తి కానే కాదన్నారు. కాగా, ఢిల్లీలో టిఆర్‌ఎస్ కార్యాలయం నిర్మాణం రోజే తెలంగాణ వ్యాప్తంగా టిఆర్‌ఎస్ జెండా పండుగకు పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల వారీగా టిఆర్‌ఎస్ శ్రేణులు జెండా ఎగరు వేశారు.జెండా పండగ పూర్తి కాగానే గ్రామ, వార్డు కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు.
ఢిల్లీలో రెండవ… దక్షిణాది పార్టీ ఆఫీస్
RELATED ARTICLES