వరంగల్‌లో రైతుల మహా ధర్నా
ల్యాండ్ బ్యాంక్ పేరుతో ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టే యత్నం
సాగు భూములు ఇవ్వమంటూ 500 మంది రోడ్డుపైకొచ్చి రాస్తారోకో
ప్రజాపక్షం / వరంగల్ బ్యూరో వరంగల్ జిల్లాలోని జాతీయ రహదారి 163పై ఆరెపల్లి వద్ద శనివారం రైతులు భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రైవేటు ఏజెన్సీ ఏర్పాటు చేసి రెండు పంటలు పండే వ్యవసాయ భూములను అడ్డదారిలో మోసపూరితంగా లాక్కోవాలని చూస్తున్నాని ఆరోపిస్తూ 500 మందికిపైగా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి బైఠాయించి ధర్నా జరిపా రు. “మా భూములు ఎవరికి ఇవ్వం. కుడా పేరు తో చేస్తున్న మోసం వెంటనే ఆపాలి. వ్యవసాయ భూములను ల్యాండ్ బ్యాంకు పేరుతో బ్లాక్ చేసి గుంజుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వం ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి” అని మహిళలు, రైతులు, కూలీలు పెద్దఎత్తున నినదించారు. వరంగల్ నగరం సమీపంలో ఆరెపల్లి, పైడిపల్లి రైతు ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో 3వ డివిజన్ విలీన గ్రామాలైన ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట, ఎనుమాముల రైతుల భూములను ప్రైవేటు ఏజెన్సీ పేరుతో లాక్కొని రైతులను రోడ్డుపాలు చేయాలని చూస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ ఆందోళన చేస్తున్నామని, అధికారులు స్పందించి భూములను లాక్కునే సర్వేలు ఆపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. రైతుల భారీ రాస్తారోకో, ధర్నాల తో వరంగల్ -ములుగు ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వారించినా వినకుండా రైతులు మూడుగంటలకుపైగా ఈ ఆందోళన కొనసాగించారు. గత వారం రోజులుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ విలీన గ్రామాల్లో ప్రైవేటు ఏజెన్సీ పేరుతో ల్యాండ్ బ్యాంకు కోసం సర్వే చేపట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, గ్రామ సభలు పెట్టకుండా, సమీప గ్రామాల రైతులకు అబద్ధాలు చెపుతూ రోడ్డు వస్తుందని, డిజిటల్ సర్వే అని రైతుల భద్రతకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు సేకరించడాన్ని అడ్డుకుని, అడిగిన ఆరెపల్లి రైతులను పోలీసులు కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేయడంతో రైతులు ఈ ఆందోళనకు దిగారు. రైతులను రోడ్డుపైకి నెట్టే ల్యాండ్ బ్యాంక్‌ను వెంటనే ఆపాలని, రెండు పంటలు పండే వ్యవసాయ భూములను అడ్డదారిలో లాక్కునే ప్రయత్నాన్ని నిలిపివేయాలని, ప్రైవేటు కంపెనీ పేరుతో చేస్తున్న సర్వే వెంటనే ఆపాలని, మధ్యప్రదేశ్, గుజరాత్‌లకు చెందిన యువకులు చేసిన దొంగ సర్వే రిపోర్టును రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల భద్రత కోసం ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ల ఖాతా నెంబర్లు సేకరించిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరెపల్లి, పైడిపల్లి రైతు ఐక్యకార్యచరణ సమితి సభ్యులు బుద్దె పెద్దన్న, కాంటివాడ బాపురావు, బుద్దె శ్రీనివాస్, మంగ నర్సయ్య, కమలాపురం రాజేశ్వర్‌రావు, శిర్ల రవీందర్, బుద్దె వెంకన్నతో పాటు 300 మంది మహిళా రైతులు సహా 500 మందికిపైగా రైతులు పాల్గొన్నారు.
భూములు లాక్కోవద్దు
RELATED ARTICLES