హెరాత్‌లో కో ఎడ్యుకేషన్‌పై నిషేధం
100మంది పాక్ ఉగ్రవాదుల విడుదల
కొనసాగుతున్న అయోమయం
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఉంటున్న అమెరికన్లు, యుద్ధంలో సహకరించిన ఆఫ్ఘన్లను ఖాళీచేయిస్తామన్న అధ్యక్షుడు జో బైడెన్ మాటను అమెరికా నిలబెట్టుకుంటుందా అన్న విషయంలో వేలాదిమంది ప్రజలు కాబూల్‌లో శనివారం అయోమయంతో వేచిచూశారు. ఇలా ఉంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు గురించి తమ బృంద నాయకులతో చర్చించడానికి తాలిబన్ అగ్రనేత ముల్లా అబ్దుల్ ఘనీ బారాదర్ కాబూల్ చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆఫ్ఘనిస్థాన్‌లో మిగిలి ఉన్న అమెరికా సైన్యాలను పూర్తిగా విరమించుకోవడానికి చివరితేదీ అయిన ఆగస్టు 31 దగ్గరపడుతోంది. అయితే సైన్యాలను పొడగించే విషయమై బైడెన్ శుక్రవారం ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. ఆఫ్ఘనిస్థాన్‌లో తా జా పరిస్థితులపై బైడెన్‌కు తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి. ఇక అమెరికా ప్రభుత్వ ప్రతినిధి నుంచి సూచనలు లేకుండా ఎవ్వరూ కాబూల్ విమానాశ్రయానికి వెళ్లకూడదని అమెరికా రాయబార కార్యాలయం తన పౌరులకు హెచ్చరిక జారీచేసింది. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో వేలాదిమంది ఆఫ్ఘన్ అనువాదకులు, ఇతరులు, వారి సన్నిహిత కుటుంబసభ్యులు దేశం విడిచి వెళ్లిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా 2001 సెప్టెంబర్ 11 నాటి ఉగ్రదాడుల అనంతరం అమెరికా మొదలుపెట్టిన సుదీర్ఘమైన ఆఫ్ఘన్ యుద్ధం తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకోవడంతో ముగిసినట్లయింది. ఇలా ఉంటే అమెరికాతో 2020లో శాంతి ఒప్పందానికి చర్చలు జరిపిన తాలిబన్ నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బారాదర్ తన సహచరులతో చర్చలు జరపడానికి కాబూల్ చేరుకున్నారని సమాచారం. తాలిబన్లు ఇప్పటికే మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ లాంటి ఆఫ్ఘన్ నాయకులతో చర్చలు జరిపిన కారణంగా బారాదర్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అమెరికా సైన్యం పూర్తిగా విరమించుకునే ఆగస్ట్ 31 వరకు తమ ప్రభుత్వం గురించి తాలిబన్లు ఎలాంటి ప్రకటనలూ చేయబోరని తెలుస్తోంది. కాగా కాబూల్ ప్రజల భద్రతకు సంబంధించి అన్ని రకాలుగా హామీ ఇస్తామని తాలిబన్లు తమతో చెప్పారని వారితో చర్చలు జరిపిన కూలిపోయిన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అబ్దుల్లా అబ్దుల్లా ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఇలా ఉంటే ఆఫ్ఘనిస్థాన్‌ను విడిచి వెళ్లేందుకు ప్రజలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని విమానాలైతే సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లాల్సి వస్తోంది. శుక్రవారం నాడు 250 మంది అమెరికన్లు సహా 5,700 మంది కాబూల్‌ను విడిచి వెళ్లారని రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న అమెరికన్ల సంఖ్య ఎంత అన్నది పూర్తిగా తెలియనప్పటికి, దాదాపు 15,000 మంది ఉన్నారని అంచనా. ఇక ఆఫ్ఘనిస్థాన్ నుంచి వస్తున్న వారికి తాత్కాలికంగా ఆశ్రయం ఇవ్వడానికి ఇప్పటివరకు 13 దేశాలు అంగీకరించాయి. అయితే ఆఫ్ఘన్లు మళ్లీ తమ దేశానికి ఎప్పుడు వస్తారన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతుండటం గమనార్హం.
హెరాత్‌లో కో ఎడ్యుకేషన్‌పై నిషేధం
ఇస్లామిక్ చట్టాల పరిధిలో మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించిన తాలిబన్లు మాటతప్పారు. ‘సమాజంలో చెడు అంతటికీ మూలం’గా పేర్కొంటూ హెరాత్ ప్రావిన్సులో ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కో ఎడ్యుకేషన్‌పై తాలిబన్లు నిషేధం విధించారు. విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు, తాలిబన్ల మధ్య జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనంలోకి తెచ్చుకున్నాక తాలిబన్లు జారీచేసిన మొదటి ఫత్వా ఇదే. అయితే గత ఇరవై ఏళ్లుగా ఆఫ్ఘనిస్థాన్‌లో అన్ని విద్యాసంస్థల్లో కో ఎడ్యుకేషన్‌తోపాటు, మహిళలకు వేరుగా తరగతులు నిర్వహించే మిశ్రమ వ్యవస్థను అమలుచేశారు.
100మంది పాక్ ఉగ్రవాదుల విడుదల
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల స్వాధీనం అనంతరం ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. జైష్ ఎ -మహమ్మద్, ఐసిస్ తదితర ఉగ్రమూకలు ఇప్పటికే ఆఫ్ఘన్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. కాగా, పాకిస్తాన్, చైనా తాలిబన్లకు మద్దతు పలుకుతుండడంతో భారత్ పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్నట్లుగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో తాలిబన్లు ఆఫ్ఘన్ జైళ్లలో మగ్గుతున్న 100 మంది పాకిస్తాన్ తీవ్రవాదులను విడిచిపెట్టినట్లు ఉగ్రవాదులను విడిచిపెట్టినట్లు తెలుస్తుండటం మరిన్ని భయాలకు తావిస్తోంది. వీరిలో సాధారణ ఉగ్రవాదులతో పాటు తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ డిప్యూటీ చీఫ్ మహమ్మద్ ఫకీర్ మౌల్వి వంటివారు కూడా ఉన్నారని తెలుస్తోంది.
తాలిబన్ నేత… కాబూల్ చేరిక
RELATED ARTICLES