ప్రజాపక్షం / మహబూబాబాద్ బ్యూరో రెక్కా డితే గానీ డొక్కాడని కూలీలు రోజు వారీ ‘ఉపాధి హామీ పనులకు వెళ్లి నెలల తరబడి పనిచేసినా కూలీడబ్బులు చెల్లించడం లేదు. మహబూబాబాద్ జిల్లాలో కరోనా కష్ట కాలంలో పను లు లేక చదువుకున్న నిరుద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లు, ఇతర ఉపాధి కూలీలు సుమారుగా 13 వేల మంది ఉపాధి పనులు చేస్తున్నప్పటికీ కూలీ డబ్బులు వారి బ్యాంకు ఖాతాలలో జమ కాకపోవడంతో పడక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఫలితంగా తమ జీవనం దిన దిన గండంగా తయారైందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు కొవిడ్‌తో మూత పడటంతో గత రెండు సంవత్సరాలుగా కూలీనాలీ చేసి పొట్ట పోసుకుందామనుకుంటే అక్కడా తమకు డబ్బు కష్టాలు తప్పడం లేదంటున్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఉపాధి హమీ కూలీల డబ్బులు వారం వారం మస్టర్లు తయారుచేసి డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఎక్కడా అమ లు కావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఉపాధి హామీ పథకంలో కేంద్రం నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందా, లేక రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించి నిధుల మంజూరులో జాప్యం చేస్తున్నదా అనే సందేహాలను కూలీలు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పనుల కోసం వెళ్లే కూలీలకు కులాల వారిగా వర్గీకరణ చేపట్టి వేతనాలు ఇవ్వడం ఏమిటని పలువురు ఉపాధి కూలీలు ప్రశ్నిస్తున్నారు. కొవిడ్‌తో క్షేత్ర స్థాయిలో ప్రజల జీవనం విధానంలో మునుపెన్నడూ చోటు చేసుకోని పరిణామాలు 2020 21 సంవత్సరంలో చోటు చేసుకున్నాయని పలువురు అంటున్నారు. జిల్లాలో ఉపాధి హామీ కింద గుంతలు తీసి మొక్కలు నాటడం , అడవులలో ఇంకుడు గుంతలు ఇతర పనులకు వెళ్లే కూలీలు దూరప్రాంతాలకు ఆటోలలో చార్జీలు చెల్లిస్తూ పనులకు వెళ్లి పనులు చేసినా కూలీ డబ్బుల కోసం ఉపాధి హామీ (ఎన్ఆర్ఇజిఎస్ ) ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని, రేపు మాపు చెల్లిస్తామని ఫీల్డు అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్లు సమాధానం చెబుతున్నారని కూలీలు చెబుతున్నారు. నెలల తరబడి కూలీ డబ్బులు చెల్లించకపోవడంతో చాలా మంది కూలీలు పనులకు రావడం లేదని తొటి కూలీలు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఉపాధిహామీ కూలీలకు నిర్ణీత కాలంలో కూలీ డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
ఉపాధి పనులు చేసినా.. ఖాతాల్లో పడని రొక్కం
RELATED ARTICLES