న్యాయసేవల యాప్ ప్రారంభోత్సవంలో ప్రధాన న్యాయమూర్తి ఆందోళన
పోలీస్‌లలో చైతన్యం తేవడానికి కృషిచేయాలని నల్సాకు ఆదేశం
న్యూఢిల్లీ : భారత్‌లో కస్టోడియల్ హింస, పోలీస్‌ల వేధింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, రక్షణ ఉన్నవారికి కూడా థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ తప్పడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులను చైతన్యవంతం చేయడానికి కృషిచేయాలని జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) ను కోరారు. న్యాయం అందుబాటును ఆయన నిరంతర కర్తవ్యంగా పేర్కొన్నారు. అత్యంత రక్షణ ఉన్నవారికి, అత్యంత పీడితుల మధ్య న్యాయం అందుబాటుకు సంబంధించిన అంతరం తగ్గిపోతేనే సమాజం చట్టబద్ధమైన పా లన కలిగిందిగా మారుతుందని ఆయన అన్నా రు. ‘ఒక వ్యవస్థగా న్యాయవ్యవస్థ ప్రజల విశ్వా సం పొందాలని అనుకుంటోంది. మనం వారికోసమే ఉన్నామని ప్రతి ఒక్కరూ భావించేలా చేయా లి. చాలాకాలం పాటు పీడిత ప్రజానీకం న్యాయవ్యవస్థకు ఆవల ఉండిపోయారు’ అని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. గతం భవిష్యత్తును నిర్ణయించకూడదని, సమానత్వం సాధిం చే దిశగా అందరమూ కలిసి పనిచేయాలని ఆ యన అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో న్యా య సేవల మొబైల్ యాప్, ఇంకా నల్సా దార్శనికత, కర్తవ్య ప్రకటన ప్రారంభోత్సవంలో భాగం గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా న్యాయ సేవల మొబైల్ యాప్ పేదలు, అవసరంలో ఉన్నవారికి న్యాయ సహాయం, పరిహారం పొందడానికి దరఖాస్తు చేయడానికి ఉపయోగపడుతుంది. సమాజంలోని బలహీన వర్గాలకు ఉచి త న్యాయ సేవల కోసం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్‌ల ఏర్పాటు కోసం న్యాయ సేవల అధికారాల చట్టం, 1987 ప్రకారం నల్సాను ఏర్పాటుచేశారు. దేశంలో ఇప్పటికీ కస్టోడియల్ హింస, పోలీస్ వేధింపులు, ఇతర సమస్యలు కొనసాగుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగపరమైన హామీలు, రక్షణలు ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్ల దగ్గర సమర్థమైన న్యాయపరమైన ప్రాతినిధ్యం లేకపోవడం నిర్బంధంలో ఉన్నవారికి భారీ నష్టాన్ని కలగజేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీస్ అధికారులను చైతన్యవంతం చేయడానికి నల్సా దేశవ్యాప్తంగా చొరవ చూపాలని సూచించారు. మనదేశంలో ఉన్న ఆర్థిక సామాజిక వైవిధ్యం హక్కుల నిరాకరణకు ఒక సాకుగా మారకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ‘మన గతం భవిష్యత్తును నిర్ణయించకుండా చూసుకుందాం. చలనశీలమైన న్యాయవ్యవస్థ, సమానత్వం కలిగిన భవిష్యత్తు కోసం మనం కలలు కందాం. అందుకే ‘అందుబాటులో న్యాయం’ అనే కర్తవ్యం నిరంతర ప్రక్రియ’ అని ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ వ్యాఖ్యానించారు. కాగా పోలీస్‌ల మితిమీరిన చర్యలను అడ్డుకోవడానికి న్యాయ సహాయం రాజ్యాంగపరమైన హక్కు అన్న విషయం గురించి, ఉచిత న్యాయ సహాయ సేవల అందుబాటు గురించి తెలియజేయడం అత్యవసరం అని ఆయన స్పష్టంచేశారు. ఇంటర్నెట్ అనుసంధానత, సుదీర్ఘమైన, బాధాకరమైన, ఖర్చుతోకూడిన న్యాయ ప్రక్రియ వల్ల భారత్‌లో అందరికీ అందుబాటులో న్యాయం లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని పూడ్చివేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశానని ఆయన తెలిపారు. ఉచిత న్యాయసేవల కోసం తపాలా నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటే మంచిదని ఆయన సూచించారు.
ఇప్పటికీ కస్టోడియల్ హింసనా?
RELATED ARTICLES