న్యూఢిల్లీ: పెగాసస్ గూఢచర్యానికి సంబంధించి వచ్చిన ఆరోపణలు ఒకవేళ నిజమే అయితే ఇది “తీవ్రమైన విషయమే” అని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై క్రిమినల్ కేసు వేయడానికి ప్రయత్నాలు ఏవైనా చేశారా అని స్పైవేర్‌పై దర్యాప్తు కోరిన పిటిషనర్లను న్యాయస్థానం ప్రశ్నించింది. కాగా, పెగాసస్ గూఢచర్యం ఆరోపణలపై దాఖలైన వివిధ వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ, న్యాయమూర్తి సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే వ్యాజ్యాలపై కేంద్రానికి నోటీసులు జారీచేయలేదు. ఇక ఒక వ్యాజ్యంలో వ్యక్తులను కక్షిదారులుగా చేర్చడం పట్ల ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యాజ్యాల ప్రతులను కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్లకు సూచించింది. ఇలాచేస్తే ఈ నెల 10వ తేదీన జరిగే విచారణకు ప్రభుత్వం తరఫున ప్రతినిధులు న్యాయస్థానంలో హాజరవుతారని పేర్కొంది. అయితే 2019లోనే వెలుగులోకి వచ్చిన పెగాసస్ వ్యవహారాన్ని ఇప్పుడే అకస్మాత్తుగా ఎందుకు తెరపైకి తెచ్చారని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్లు సీనియర్ పాత్రికేయులు ఎన్. రామ్, శశికుమార్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. కాగా, పిటిషనర్లు బాగా చదువుకున్నవాళ్లు, విజ్ఞానులు కాబట్టి మరిన్ని వివరాలు సమర్పించే ప్రయత్నం చేస్తే బాగుండేది అని ధర్మాసనం కపిల్ సిబల్‌తో పేర్కొంది. ఏదేమైప్పటికీ ‘ఈ వ్యవహారంలోకి వెళ్లడానికి ముందు, మేం కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. ఒకవేళ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలు నిజమే అయితే ఈ ఆరోపణలు తీవ్రమైన అంశమే అనడంలో సందేహం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా ఈ కేసు విచారణను ధర్మాసనం ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఇలా ఉంటే ప్రముఖ పౌరులు, రాజకీయ నాయకులు, రచయితలపై ఇజ్రాయెల్‌కు కంపెనీ ఎన్ఎస్ఒ సరఫరా చేసిన పెగాసస్ స్పైవేర్ సాయంతో ప్రభుత్వ సంస్థలు నిఘా ఉంచినట్లు ఆరోపణలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ స్పైవేర్ సాయంతో 300కు పైగా నిర్ధారించిన భారతీయ మొబైల్ ఫోన్ నంబర్లను నిఘాకు లక్ష్యంగా చేసుకున్నారని ఒక అంతర్జాతీయ వార్తా సంస్త కథనం వెలువరించింది. దీంతో పాత్రికేయులు, ఇతరులపై నిఘా ఉంచారన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కూడా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలుచేసిన విషయం తెలిసిందే.
పెగాసస్ గూఢచర్యంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
RELATED ARTICLES