ఉభయసభలు నేటికి వాయిదా
న్యూఢిల్లీ : పెగాసస్ నిఘా అంశంపై విపక్షాల ఆందోళనలు, నిరసనల నడుమ గురువారం పార్లమెంటు అట్టుడికిపోయింది. అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు అత్యంత కీలకమైన పెగాసస్ నిఘా ఆరోపణలపై చర్చకు అనుమతించాలని కోరారు. వ్యక్తి స్వేచ్ఛకు, దేశ భద్రతకు ముప్పువాటిల్లే రీతిలో పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురికావడంపై వామపక్షాలతోపాటు కాంగ్రెస్ తదితరవిపక్షాలన్నీ ఆందోళన వ్యక్తం చేశాయి. వాయిదా తీర్మానాలను కూడా ప్రవేశపెట్టాయి. అదే విధంగా రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా రూపొందించిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని కూడా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. గురువారం ఉదయం ఉభయ సభల్లోనూ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే, ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను మరోసారి ప్రస్తావించారు. కానీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పెగాసస్ అంశాన్ని మినహాయించి మిగతా ఏ అంశాన్నయినా చర్చించేందుకు సిద్ధమని రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. అయితే, సాగు చట్టాల రద్దు డిమాండ్‌పై చర్చకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. విపక్ష సభ్యులు ఆదోళన కొనసాగిస్తున్న సమయంలోనే ‘ది ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్ 2021’ను రాజ్యసభ ఆమోదించింది. అనంతరం చైర్మన్ స్థానంలో సభను నడిపిస్తున్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. లోక్‌సభలోనూ ఇదే రీతిలో విపక్ష సభ్యులు పెగాసస్ స్పైవేర్, సాగు చట్టాలు, ధరల పెరుగుదల తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ అందుకు అనుమతించకపోవడంతో నిరసనలు చేపట్టారు. పలుమార్లు వాయిదా పడిన తర్వాత, సాయంత్రం 5 గంటల సమయంలో ‘ట్యాక్సేషన లా (సవరణ) బిల్లు 2021ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయత్నించారు. ఆమె దీనిపై వివరణ ఇస్తున్న సమయంలోనే విపక్ష సభ్యులు పెగాసస్‌పై తొలుత చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస సభాపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ బిల్లులను ప్రవేశపెట్టి, వాటిని హడావుడిగా ఆమోదింప చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బిల్లులపై చర్చ జరగడం లేదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సభలో కార్యకలాపాల చివరి క్షణాల్లో బిల్లులను ప్రవేశపెట్టడం సరైన విధానం కాదని అన్నారు. ఒక్కో బిల్లుపై చర్చకు సగటున ఏడు నిమిషాలు కూడా లభించడం లేదని అన్నారు. బిల్లులను ఈ విధంగా ప్రవేశపెట్టి, ఆమోద ముద్ర వేయించుకునే పద్ధతి ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. ఆయనకు ఆర్‌ఎస్‌పి సభ్యుడు ఎన్‌కె ప్రేమచంద్రన్ మద్దతు తెలిపారు. కాగా, విపక్షాలు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే మూజువాణి విదానంలో బిల్లును ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవి సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.