చిన్న సైకిల్‌పై డబ్బా కట్టి… నీటిని తెచ్చి మొక్క మొక్కనూ తడిపిన పిల్లలు
చిన్నారులకు ప్రముఖుల అభినందనలు
ప్రజాపక్షం/వెల్దుర్తి : మొక్కలను బతికించుకోవాలని తాపత్రయపడిన చిన్నారులు ఒక గొప్ప ఆలోచన చేశారు. పిల్లలు తాము రోజూ తొక్కే సైకిల్‌కు ఒక డబ్బా కట్టి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న కాలువ నుండి నీటిని నింపి డబ్బాకు పైపును బిగించి పైపు ద్వారా తమ వీధిలో నాటిన మొక్కలకు నీరు పోశారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని ‘కోట కింద వీధి’ (ఎస్‌సి కాలనీ) లో గురువారం ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల నిర్వహించిన హరితహారంలో భాగంగా వెల్దుర్తి పట్టణంలోని ‘కోట కింద వీధి’ వరకు ఉన్న సిసి రోడ్డు పొడవునా మొక్కలు నాటారు. ఆ మొక్కలు పెరిగే విధంగా తగిన నీళ్లు అందించాలని, వాటిని బతికించుకోవాలని అదే కాలనీకి చెందిన చిన్నారులు తాటి సాత్విక్, సుశాంత్, శ్రీకాంత్ వాటికి తమకు తోచిన విధంగా నీరు పోశారు. ఈ దృశ్యం గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలరామ్‌రెడ్డికి కనిపించగా వాటిని తన మోబైల్ ఫోన్‌లో చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై జిల్లా పంచాయతీ అధికారి స్పందించి చిన్నారులకు అభినంధనలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఆవరణలో చిన్నారులు తాటి సాత్విక్, సుశాంత్, శ్రీకాంత్‌తో పాటు వారి స్నేహితులను పంచాయతీ కార్యదర్శి శాలువాతో ఘనంగా సన్మానించారు. అలాగే వెల్దుర్తికి చెందిన టిఆర్‌ఎస్ నాయకులు వెన్నవరం శ్రీనివాస్‌రెడ్డి ట్విట్టర్‌లో చిన్నారులు మొక్కలకు నీరు పోస్తున్న ఫోటోలను షేర్ చేయాగా వెంటనే ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ అభినందనలు తెలిపారు. మొక్కలను కాపాడేందుకు పిల్లలు తీసుకున్న చొరవ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. మొక్కల పట్ల నీరు పోస్తున్న చిన్నరుల ఉత్సహం చూస్తుంటే ముచ్చటేస్తోందని, నేటి తరం వారికి భవిష్యత్‌లో మంచి పర్యావరణం కోసం ఇలాంటి చర్యలు అవసరమని ఎంపి పేర్కొన్నారు.
మొక్కలను బతికించుకోవాలని చిన్నారుల తాపత్రయం
RELATED ARTICLES