బాక్సింగ్‌లో కాంస్యం దక్కించుకున్న లవ్లీనా
కనీసం రజతాన్ని ఖాయం చేసుకున్న రవి దహియా
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పోరు
టోక్యో ః టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తుందనుకున్న భారత బాక్సర్ లవ్లీనా మహిళల 69 కిలోల విభాగం సెమీ ఫైనల్లో పరాజయాన్ని ఎదుర్కొని, కాంస్యంతో సంతృప్తి చెందింది. సెమీస్ చేరడం ద్వారా కనీసం కాంస్యాన్ని ఖరారు చేసుకున్నప్పటికీ, ఆమె అద్భుతాలను సృష్టిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ, టర్కీకి చెందిన తన ప్రత్యర్థి, ప్రపంచ చాంపియన్ బుసెనజ్ సుర్మెనెలీ ముందు నిలవలేకపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, సంచలన విజయాలతో సెమీస్ చేరిన లవ్లీనా, ఫైనల్ చేరే క్రమంలో విఫలం కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకటిరెండు పర్యాయాలు తన పంచ్‌లతో ప్రత్యర్థిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. సుర్నెనెలీ చక్కటి హుక్స్, బలమైన పంచ్‌లతో విరుచుకుపడి, లవ్లీనాను చిత్తుచేసింది. సెమీస్‌లో ఓడిన కారణంగా, నిబంధనలను అనుసరించి లవ్లీనా కాంస్య పతకాన్ని గెల్చుకుంది. ఇది భారత్‌కు మూడో పతకం. మీరాబాయ్ చాను వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సాధించగా, మహిళల బాడ్మింటన్‌లో పివి సింధు నిరాశపరచినప్పటికీ, ప్లే ఆఫ్ పోరులో గెలిచి, కాంస్య పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇలావుంటే, పురుషుల రెజ్లింగ్ 57 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో రవికుమార్ దహియా ఫైనల్‌కు దూసుకెళ్లి, కనీసం రజతాన్ని ఖాయం చేసుకున్నాడు. సెమీ ఫైనల్లో అతను తన ప్రత్యర్థి నూరిస్లామ్ సనయెవ్‌పై బైఫాల్ట్ కింద గెలిచి ఫైనల్ చేరాడు. నిజానికి ప్రారంభం నుంచిఆధిపత్యాన్ని కనబరచిన నూరిస్లామ్ ఒకానొక దశలో రవికుమార్‌పై 9 ఆధిక్యాన్ని సంపాదించాడు. దీని తో రవి దహియా పరాజయం తప్పదన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే, అతను నూరిస్లామ్పై పట్టు సంపాదించే క్రమంలో రింగ్ నుంచి బయటకు పడేశాడు. ఆ సమయంలో కాలికి గాయమైనప్పటికీ, నూరిస్లామ్ కట్టుకట్టుకొని మళ్లీ రింగ్‌లోకి వచ్చాడు. కానీ, రవి దహియా ముందు నిలవలేకపోయాడు. ఈ దశలో రిఫరీ పోరును నిలిపి, బైఫాల్ట్ కింద రవి దహియాను విజేతగా ప్రకటించాడు. గతంలో సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించగా, వారి సరసన రవి దహియా చోటు సంపాదించుకోనున్నాడు. కాగా, మహిళల రెజ్లిం గ్ 57 కిలోల విభాగంలో అన్షు మాలిక్ నిరాశపరిచింది. బెనారస్ రెజ్లర్ చేతిలో 8 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని, క్వార్టర్ ఫైనల్స్ కూడా చేరలేకపోయింది.
మహిళల హాకీలో ఓటమి
మహిళల హాకీ సెమీ ఫైనల్లో భారత్ పరాజయాన్ని చవిచూసింది. దీనితో శుక్రవారం కాంస్య పతకం కోసం జరిగే పోరులో గ్రేట్ బ్రిటన్ను ఢీకొనాల్సి ఉంది. అర్జెంటీనాను సెమీస్‌లో ఎదుర్కొన్న భారత్‌కు ఫస్ట్ క్వార్టర్‌లోనే గుర్జీత్ కౌర్ గోల్‌ను అందించింది. పెనాల్టీ కార్నర్‌ను ఆమె గోల్‌గా మలచింది. అయితే, భారత్ గోల్ చేసిన వెంటనే అప్రమత్తమైన అర్జెంటీనా ఎదురుదాడికి దిగింది. ప్రథమార్ధం ముగింపు దశలో ఆ జట్టు కెప్టెన్ నోయల్ బారిన్యువా చక్కటి ఫీల్డ్ గోల్‌తో ఈక్వెలైజర్‌ను అందించింది. ద్వితీయార్ధంలోనూ అర్జెంటీనా దూకుడుగా ఆడింది. కెప్టెన్ బారిన్యువా మరోసారి భారత రక్షణ విభాగాన్ని చెల్లాచెదురు చేసి, గోల్ సాధించి, తన జట్టుకు 2 ఆధిక్యాన్ని సంపాదించిపెట్టింది. ఆతర్వాత వ్యూహాత్మకంగా ఆడుతూ, రక్షణాత్మక విధానాన్ని అనుసరించిన అర్జెంటీనా ఈ అధిక్యాన్ని నిలబెట్టుకొని, విజయభేరి మోగించింది. భారత ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి సెమీస్ చేరుకొని చరిత్ర సృష్టించిన మహిళల హాకీ జట్టు కాంస్య పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యి. లీగ్ దశలో బ్రిటన్ను ఓడించిన అనునవం భారత్‌కు ఉంది. అయితే, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేస్తే మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకొని, రిక్త హస్తాలతో వెనుదిరగక తప్పదు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం
RELATED ARTICLES