HomeNewsBreaking Newsఅడవి బిడ్డలకు, పోడు రైతులకు భూ హక్కులు

అడవి బిడ్డలకు, పోడు రైతులకు భూ హక్కులు

రైతుబంధు, రైతు బీమా వర్తింప చేయాలని సిపిఐ డిమాండ్‌
గిరిజన, ఆదివాసీలపై పోలీస్‌,అటవీ అధికారులు దాడులు ఆపాలి
రాష్ట్రంలో అడవిబిడ్డల బతుకులు దీనంగా మారాయి
పోడుయాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

ప్రజాపక్షం/ ఆసిఫాబాద్‌/ మంచిర్యాల బ్యూరో
అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవి బిడ్డలకు, పోడు రైతులకు భూహక్కులు కల్పించి వారికి రైతుబంధు, రైతు బీమా వర్తింప చేయాలని సిపిఐ డిమాండ్‌ చేసింది. పోడు రైతులపై జరుగుతున్న దాడులు దారుణమని, అమాయక అడవి బిడ్డలను వేధింపులకు గురిచేస్తున్న ప్రభుత్వ విధానం సరైంది కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులపై అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు చేస్తున్న దాడులను ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతు కుటుంబాలకు సిపిఐ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. పోడు భూముల పరిరక్షణ, పోడు సాగుదారుల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ చేపట్టిన ‘పోడుయాత్ర’ చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా జోడేఘాట్‌లో బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌.బాలమల్లేష్‌, కలవేణ శంకర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్‌ అంజయ్య నాయక్‌ పాల్గొన్నారు. ఈ యాత్ర జోడేఘాట్‌ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్మగూడెం వరకు జరగనుంది. యాత్ర ప్రారంభం సందర్భంగా జోడేఘాట్‌ వద్ద పోడు రైతులను ఉద్దేశించి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల, గిరిజనులపై నిత్యం రాష్ట్రంలోని ఏదో ఒక చోట లాఠీలు ఝళిపిస్తూనే ఉందని, అడవిని నమ్ముకుని పోడు వ్యవసాయంపై ఆధారపడిన ఆదివాసీ, గిరిజన రైతుల బతుకులు ఇంకా ఆటవిక సమాజంలోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు రైతుల పచ్చని పంటలను దున్నిస్తూ తీరని నష్టం కలిగిస్తుందని, ప్రభుత్వానికి ఎదురు నిలిచిన వారిపై కేసులు పెట్టి పిడి యాక్ట్‌ అమలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నదని విమర్శించారు. పోడు రైతులపై పోలీసులు, అటవి, రెవెన్యూ అధికారులు హద్దుల పేరుతో లోతైన కందకాలు తవ్వించి సాగుకు నిరుపయోగంగా మార్చి చేతికి వచ్చిన పంటలను ధ్వంసం చేస్తున్నారని, ప్రభుత్వ ఆగడాలకు వ్యతిరేకంగా పోడు సాగు రైతు ఆదివాసీ గిరిజన బిడ్డలకు సిపిఐ అండగా నిలబడి పోరాడుతుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలలో ఆదివాసి గిరిజనుల తరుపున పోరాటం చెసిన సిపిఐ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిన ఘనత తెలంగాణ నిరంకుశ ప్రభుత్వానిదే అని విమర్శించారు. పోడుయాత్ర పోడు వ్యవసాయం అధికంగా ఉన్న ఆదిలాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగుడెంతో పాటు 24 జిల్లాల్లో నెలకొన్న పోడు రైతుల సమస్యలకు పరిష్కారం కోసం జరుగుతుందని ఆయన వివరించారు. పోడు రైతులకు హక్కు పత్రాలు అందించి, వారిపై పోలీసులు, అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. నీరు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం చేసి ఏంతో మంది ప్రాణ త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కన్నీళ్లు పెడుతూ కాలం వెళ్ళదీస్తున్నారని వేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు గడిచినా టిఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిరవేర్చలేదని విమర్శించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు పల్లె నరింహ, కె.శ్రీనివాస్‌, కె.ఉప్పలయ్య, కన్నం లక్ష్మీనారాయణలతో కూడిన కళాబృందం పోడు రైతుల కష్టాలను పాటల రూపంలో మలిచి ప్రజలను చైతన్యం చేస్తూ ప్రదర్శనలిచ్చింది. ఉదయం జోడేఘాట్‌ వద్ద ప్రారంభమైన యాత్ర ఆసిఫాబాద్‌, రెబ్బన, తాండూరు, మందమర్రి ప్రాంతాలలో కొనసాగి సాయంత్రం మంచిర్యాలకు చేరుకుంది. గురువారం ఉదయం మంథని నుంచి యాత్ర ప్రారంభం కానుంది. సిపిఐ మంచిర్యాల జిల్లా నాయకులు మేకల దాసు, రామడుగు లక్ష్మణ్‌, రేగుంట చంద్రశేఖర్‌, దేవి పోశయ్య, మిట్టపల్లి పౌలు, మిట్టపల్లి శ్రీనివాస్‌, కలీందంర్‌ ఆలీ ఖాన్‌,బానేష్‌, జోగుల మల్లయ్య, వనం సత్యనారాయణ, నక్క వేంకటస్వామి, కొట్టె కిషన్‌ రావు తదితరులు పాల్గోన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments