బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: పెగాసస్ గూఢచర్యంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు కార్యకలాపాలు స్తంభించిపోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అసహనం వ్యక్తంచేశారు. సభలో పత్రాలను చింపివేయడం, బిల్లుల ఆమోదంపై అమర్యాదపూర్వకంగా మాట్లాడటం సహా ప్రతిపక్షాల ప్రవర్తనపై ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలు పార్లమెంటును, రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నాయని ధ్వజమెత్తారు. బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ చేసిన ప్రసంగాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ విలేకర్లకు వెల్లడించారు. జోషీ ప్రకారం సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన వారి దురుసుతనాన్ని తెలియజేస్తుందని, అయినప్పటికీ బిజెపి సభ్యులు సహనంతో ఉండాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఓ సభ్యుడు పెగాసస్ అంశంపై ఐటి శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరణ ఉన్న పత్రాలను చింపివేసిన విషయం తెలిసిందే. వివిధ ప్రతిపక్ష సభ్యులు కూడా లోక్‌సభలో పత్రాలను చించి గాలిలోకి, స్పీకర్ కుర్చీవైపు విసిరారు. ఇక పార్లమెంటులో బిల్లులు ఆమోదం పొందే క్రమంపై తృణమూల్ సభ్యుడు డెరెక్ ఓబ్రియన్ చేసిన విమర్శలు మోడీకి ఆగ్రహం తెప్పించాయని కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, వి. మురళీధరన్ విలేకర్లతో పేర్కొన్నారు. అయితే వారు ఓబ్రియన్ పేరు నేరుగా వెల్లడించకపోవడం గమనార్హం. అంతేకాకుండా సభ్యుల ప్రవర్తన ‘అప్రజాస్వామికం’గా ఉందని, అర్థవంతమైన చర్చలపై ఆసక్తి లేదని మోడీ ఆరోపించినట్లు తెలుస్తోంది. అయితే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోమని మోడీ స్పష్టంచేశారని జోషీ తెలిపారు. బిల్లులు ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించినవని, నిర్మాణాత్మకమైన, సుసంపన్నమైన చర్చలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారని జోషీ వెల్లడించారు.
పార్లమెంటుకు అవమానం
RELATED ARTICLES