ప్రతిపక్షాల సమావేశంలో రాహుల్ గాంధీ పిలుపు
కాన్స్టిట్యూషన్ క్లబ్లో అల్పాహార విందు
పెట్రో ధరల పెంపునకు నిరసనగా పార్లమెంట్‌కు ప్రతిపక్షాల సైకిల్ ర్యాలీ
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో మంగళవారం ప్రతిపక్ష నాయకులను అల్పాహార విందుకు ఆహ్వానించారు. దీనికి వివిధ ప్రతిపక్షాల నాయకులు హాజరయ్యారు. ఇందులో ప్రతిపక్షాల ఐక్యత గురించి ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి దాదాపు 100 మంది ఎంపిలు సహా కాం గ్రెస్, సిపిఐ, సిపిఐ ఎం, తృణమూల్ కాంగ్రెస్, ఎన్‌సిపి, శివసేన, డిఎంకె, ఆర్జెడి, సమాజ్‌వాదీ పార్టీ తదితర పార్టీల కు చెందిన నాయకులు హాజరయ్యారు. సమావేశానికి 17 ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించగా బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పి), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు మాత్రం దూరంగా ఉండిపోయారు. ఇక సమావేశం ప్రధాన ఉద్దేశం మాత్రం ప్రతిపక్షాలను ఐక్యం చేయడమే అని తెలుస్తోంది. ‘మిమ్మల్ని ఆహ్వానించిన ఏకైక ఉద్దేశం మనం ఐక్యం కావడమే. ఎన్ని గొంతులు ఒక్కటైతే, అంత బలంగా రూపొందుతాం. అప్పుడు ఈ గొంతులను అణచివేయడానికి బిజెపి, ఆర్ఎస్ఎస్కు అంత కష్టంగా మారుతుంది’ అని రాహుల్ సమావేశంలో పేర్కొన్నారు. సమావేశం అనంతరం పెట్రో ధరల పెంపు తీవ్రతను తెలియజేయడానికి రాహుల్ నాయకత్వంలో కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటుకు సైకిళ్లపై ర్యాలీగా వెళ్లారు. సైకిల్‌పై వెళ్లలేని ఎంపిలు నడుచుకుంటూ వెళ్లడం విశేషం. కాగా, ప్రభుత్వంపై పోరాటానికి ప్రతిపక్షాలు ఒక్కటిగా నిలబడాలని నిశ్చయించుకున్నాయని కాంగ్రెస్ స్పష్టంచేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు మంగళవారం రాహుల్ గాంధీ ఇచ్చిన అల్పాహార విందును ‘నాంది’లా భావించాలని ఆ పార్టీ పేర్కొంది.
గొంతులు కలుపుదాం
RELATED ARTICLES