HomeNewsBreaking Newsపెగాసస్‌, సాగుచట్టాలపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

పెగాసస్‌, సాగుచట్టాలపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

అత్యవసర రక్షణ సేవలు, ట్రిబ్యునల్స్‌ సంస్కరణల బిల్లులకు లోక్‌సభ ఆమోదం
దివాలా స్మృతి (సవరణ) బిల్లును ఆమోదించిన రాజ్యసభ
న్యూఢిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌, వివాదాస్పద సాగుచట్టాలపై ప్రతిపక్షాలు తమ నిరసనలనూ మంగళవారమూ కొనసాగించడంతో పార్లమెంటు ఉభయసభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. అయితే నినాదాలు, నిరసనల గం దరగోళం మధ్యే లోక్‌సభలో అత్యవసర రక్షణ సేవలు, ట్రిబ్యునల్స్‌ సంస్కరణల బిల్లులకు ఆమోదం లభించింది. కాగా, దివాలా స్మృతి (సవరణ) బిల్లు కు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశమైన వెంటనే పెగాసస్‌ గూఢచర్యంపై, మూడు సాగుచట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయం, రైతుల సంక్షేమం చర్చకు వచ్చాయి. రైతులకు సంబంధించిన అంశాలను లేవనెత్తాల్సిందిగా స్పీకర్‌ ఓం బిర్లా ప్రతిపక్షాలను కోరారు. కానీ ప్రతిపక్షాలు నినాదాలు చేయడం ఆపకపోవడంతో స్పీకర్‌ అసహనం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు రైతుల అంశాలపై చర్చ జరగాలని కోరుకోవడం లేదని మండిపడ్డారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. అలా నిరసనల మధ్యే దాదాపు 40 నిమిషాలపాటు స్పీకర్‌ ప్రశ్నోత్తరాల సమయానికి అనుమతించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు 20 నిమిషాలపాటు సభను వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమయ్యాక కూడా నిరసనలు ఆగలేదు. ఆ సమయంలో స్పీకర్‌ స్థానంలో ఉన్న సీనియర్‌ ఎంపి భర్తృహరి మహ్తాబ్‌ సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు వీలు కల్పించాలని, సభ్యులు ఎవరి స్థానాల్లో వాళ్లు కూర్చోవాలని విజ్ఞప్తిచేశారు. దీనిని ప్రతిపక్షాలు పట్టించుకోకపోవడంతో సభ 2 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాక కూడా ప్రతిపక్షాలు నిరసనలను కొనసాగిస్తూ వచ్చాయి. గందరగోళం మధ్యే లోక్‌సభ అత్యవసర రక్షణ సేవల బిల్లు 2021కి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి 4 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా సభ సజావుగా జరిగే అవకాశం కనిపించకపోవడంతో స్పీకర్‌ సభను బుధవారానికి వాయిదా వేశారు. ఈ మధ్యలో సభ ట్రిబ్యునల్స్‌ సంస్కరణల బిల్లు, 2021ని ఆమోదించడం గమనార్హం. ఇలా ఉంటే ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. సభను అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. అయితే సభలో గందరగోళం నెలకొన్న సమయంలో బిల్లులను ఆమోదించకూడదని లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌధురి, ఆర్‌ఎస్‌పి ఎంపి ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్‌ సూచించారు. ఇక రాజ్యసభలో కూడా పెగాసస్‌ నిఘా, సాగుచట్టాలపై ప్రతిపక్షాల నిరసనలు సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి. భోజన విరామం తర్వాత 2 గంటలకు సభ తిరిగి సమావేశమైంది. ఆ సమయంలో అధ్యక్ష స్థానంలో ఉన్న బిజెపి సభ్యులు భుబనేశ్వర్‌ కాలిత దివాలా స్మృతి (సవరణ) బిల్లు, 2021ని ప్రవేశపెట్టాల్సిందిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అడిగారు. ఆ వెంటనే ప్రతిపక్ష సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభ వెల్‌లోకి దూసుకువచ్చారు. అయితే బిజెడికి చెందిన అమర్‌ పట్నాయక్‌ను బిల్లుపై చర్చను ప్రారంభించాల్సిందిగా అధ్యక్షులు కోరారు. ఆ తర్వాత బండా ప్రకాశ్‌ (టిఆర్‌ఎస్‌), ఎం. తంబిదురై, కె. రవీంద్ర కుమార్‌ (టిడిపి), వి. విజయసాయి రెడ్డి (వైఎస్‌ఆర్‌సిపి) ప్రతిపక్షాల నిరసనల మధ్యే చర్చలో పాల్గొన్నారు. సిపిఐ (ఎం) సభ్యుడు జాన్‌ బ్రిటాస్‌ కూడా చర్చలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఆయన వెంటనే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని పేర్కొంటూ గూఢచర్యం లాంటి అంశాలను లేవనెత్తడం మొదలుపెట్టారు. మొత్తానికి స్వల్ప చర్చ తర్వాత దివాలా స్మృతి (సవరణ) బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అయితే సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై నిర్మలా సీతారామన్‌ అసహనం వ్యక్తంచేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments