కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సమాధానం
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిం ది. 2026 తరువాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచుతామని తెలిపింది. జమ్మూకశ్మీర్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పునర్విభజనను చేపట్టబోమని తేల్చి చెప్పింది. మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో కాంగ్రెస్ సభ్యుడు ఎ. రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ పైవిధంగా బదులిచ్చారు. 2026 తరువాత మొదటి మొదటి జనాభా గణనను చేసిన ప్రచురించిన తరువాతే రెండు రాష్ట్రా ల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపడుతామని మంత్రి వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌తో పాటు తెలంగాణలో కూడా నియోజకవర్గాల పునర్విభజన చేసే ప్రతిపాదన కేంద్రం చేస్తుందా, లేదా చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి నిత్యానంద్‌రాయ్ సమాధానమిస్తూ… ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014, సెక్షన్ 26(1)లో పేర్కొనబడిన విధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లోని నిబంధనల మేరకు తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 175 కు, ఆంధ్రప్రదేశ్‌లోని153 స్థానాలకు 225కు పెరగాల్సి ఉంది. అయితే ఆర్టికల్ 170(3) ప్రకారం… 2026 జనాభా లెక్కల ఆధారంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వభజన చేపడుతామన్నారు.
కొత్త రాష్ట్రాల ప్రతిపాదనల్లేవ్..
కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలేవీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేవని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. కొందరు వ్యక్తులు, సంస్థల నుంచి అలాంటి డిమాండ్లును ఎప్పటికప్పుడు స్వీకరించినప్పటికీ రాష్ట్రాలను విభజించే ప్రతిపాదనలేవీ కేంద్రం వద్ద లేవని కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో వెల్లడించారు. కొద్ది కాలంగా తమిళనాడును విభజిస్తారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. దేశంలో తమిళనాడు సహా ఏ రాష్ట్రాన్నైనా విభజించే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉందా అని ఎంపిలు టిఆర్ పరివేందర్, ఎస్. రామలింగం సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి డిమాండ్లు, అభ్యర్థనలూ ఎప్పటికప్పుడు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు మన దేశ సమాఖ్య రాజకీయాలపై విస్తృతమైన ప్రభావం చూపుతుందన్నారు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రాల ఏర్పాటు అంశంలో ముందుకు వెళ్తుందన్నారు. ఇప్పటికైతే అలాంటి ప్రతిపాదనలేవీ కేంద్రం వద్ద లేవని మంత్రి స్పష్టంచేశారు.
మూడేళ్లలో 348 కస్టడీ మరణాలు
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గత మూడేళ్లలో 348 మంది పోలీస్ కస్టడీలో మృతి చెందినట్టు కేంద్రం వెల్లడించింది. అలాగే, పలు కేసుల్లో నిర్బంధించడం ద్వారా 1189 మంది హింసకు గురైనట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభకు వెల్లడించారు. జాతీయ మానవహక్కుల కమిషన్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2018లో 136మంది పోలీస్ కస్టడీలో మృతిచెందగా.. 2019లో 112 మంది, 2020లో 100 మంది ప్రాణాలు విడిచినట్టు పేర్కొన్నారు. అలాగే, పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురైన వారిలో 2018లో 542మంది ఉండగా.. 2019లో 411మంది, 2020లో 236మంది ఉన్నట్టు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
మూడేళ్లలో రాజకీయ కారణాలతో 230 మంది మృతి
దేశంలోని వివిధ ప్రాంతాల్లో 2017 మధ్య రాజకీయ కారణాలతో దాదాపు 230 మది మృత్యువాతపడినట్లు మంత్రి నిత్యానంద్‌రాయ్ సభకు వెల్లడించారు. జార్ఖండ్‌లో 49 మంది, పశ్చిమ బెంగాల్‌లో 27, బీహార్‌లో 26 మంది చనిపోయారన్నారు. అదే విధంగా 2017లో రాజకీయ కారణాలతో 99 మంది, 2018లో 59, 2019లో 72 మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2017 మధ్య జరిగిన రాజకీయ హత్యల్లో కర్నాటకలో 24, కేరళ, మహారాష్ట్రలో 15 చోప్పున జరిగాయన్నారు.
నియోజకవర్గాల పెంపు 2026 తరువాతే…
RELATED ARTICLES