HomeNewsBreaking Newsపంట రుణాలు మాఫీ

పంట రుణాలు మాఫీ

15వ తేదీ నుంచి చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం
6 లక్షల మంది రైతులకు లబ్ధి
ఇడబ్ల్యుస్‌ రిజర్వేషన్‌ అమలుకు కేబినెట్‌ తీర్మానం
ప్రజాపక్షం/హైదరాబాద్‌  ఈ ఏడాది నుంచి రూ.50 వేలలోపు పంట రుణా లు మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించిం ది. ఆగస్టు 15 నుంచి రుణమాఫీ చేపట్టాలని, ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించింది. దీని వల్ల 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఇడబ్ల్యుఎస్‌ (ఆర్థికంగా వెనుకబడిన తరగతులు) రిజర్వేషన్‌ను అమలు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. విద్య, ఉద్యోగ అవకాశాలలో రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న అభ్యర్థులు అర్హులుగా నిర్ణయించింది. ఇడబ్ల్యుఎస్‌ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాలను సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం ఆదివారం జరిగింది. ‘దళిత బంధు’ విధి విధానాలు, అమలు తీరుపైన సుదీర్ఘంగా చర్చించింది. అలాగే కరో నా, వ్యవసాయం, ప్రభుత్వ ఆస్పత్రులు, వానాకాలం పంటల సాగు తదితర అంశాలపై చర్చ జరిగింది. వర్షాలు, పంటలు, సాగునీరు, ఎరువుల లభ్యతపై సమీక్షించారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు పంట రుణమాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ మంత్రివర్గం సమావేశంలో పొందుపర్చింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా రూ.25 వేలలోపు రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయని తెలపింది. తెలంగాణ రాష్ట్రం లో పత్తికి ఉన్న డిమాండ్‌ దృష్ట్యా పత్తి సాగు పెం చాలని మంత్రివర్గం నిర్ణయించింది. పత్తిసాగు పెంపునకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ ఆదేశించింది. వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతాలను రాష్ట్ర వ్యాప్తం గా గుర్తించి, లాభసాటి పంటల సాగును మరింతగా ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని,అందుకు రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపర్చాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను కేబినెట్‌ ఆదేశించింది.
అనాథ పిల్లలకు ప్రభుత్వమే ఆశ్రయం
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైన పిల్లల పూర్తి వివరాలను తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని మంత్రివర్గం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని సూచించింది. ఖాళీగా వున్న అనువైన ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి అందులో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలని మంత్రివర్గం ఆదేశించింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు వంటరిగా మారి మానసిక వేదనతో పాటు సామాజిక వివక్షను ఎదుర్కొంటూ సమాజ కృరత్వానికి బలయ్యే ప్రమాదమున్నదని ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలిపారు. వారి కాళ్ల మీద వారు నిలబడి, ప్రయోజకులయ్యేంతవరకు వారిని ప్రభుత్వమే ఆశ్రయం కల్పించి అండగా నిలువాలని తెలిపారు. అనాథ పిల్లల కోసం సమగ్ర విధానాన్ని రూపొందించాలని, మానవీయ కోణంలో ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలని, అనాధ పిల్లల అంశానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అనాథ పిల్లల సమగ్ర విధాన కార్యాచరణ కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సబ్‌ కమిటీలో మంత్రులు,టి.హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఇంద్ర కరణ్‌ రెడ్డి, జి.జగదీశ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కెటి.రామారావు సభ్యులుగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ ఆహ్వానితులుగా ఉన్నారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అనాథల పరిస్థితులపైన సమగ్ర నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలె
అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, అన్ని రకాల మందులు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులకు మంత్రివర్గం ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితిపై చర్చించిన మంత్రివర్గం పలు రాష్ట్రాల పరిస్థితి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితి, వాక్సినేషన్‌, దవాఖానాల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతులను కూడా సమీక్షించింది. ఆయా జిల్లాల ప్రాథమిక వైద్య కేంద్రాల స్థాయి నుంచి సవివరంగా కేబినెట్‌కు వైద్యాధికారులు సమాచారాన్ని అందించారు. దీంతో ఆ జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆక్సిజన్‌, మందులు, బెడ్స్‌, తదితర ఔషదాల లభ్యతపై విస్తృంగా మంత్రివర్గం చర్చించింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవున్న సమస్యాత్మక ప్రాంతాల్లో మరోసారి వైద్య బృందాలను పర్యటించి తగు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించింది. కరోనాను కట్టడి చేయడంలో ప్రజలు స్వీయ నియంత్రణను పాటించాలని, అందులో భాగంగా మాస్కులను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రివర్గం ప్రజలకు విజ్జప్తి చేసింది. వాక్సిన్‌ తీసుకున్నవారు కూడా నిర్లక్ష్యం చేయకుండా స్వీయ నియంత్రణను పాటించాలని కోరింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఏడు మెడికల్‌ కాలేజీలు
రాష్ట్రంలో మంజూరైన ఏడు మెడికల్‌ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు సమకూర్చుకోవాల్సిన మౌలిక వసతులు, కాలేజీలు, హాస్టల్స్‌ నిర్మాణానికి తగిన చర్యలపై మంత్రివర్గం చర్చించింది. భవిష్యత్తులో అనుమతించబోయే మెడికల్‌ కాలేజీలకు స్థల అన్వేషణ, తదితర సౌకర్యాల రూపకల్పనకు సంబంధించి ముందస్తు చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభించాలని వైద్యాధికారులను ఆదేశించింది. అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాదికి మెడికల్‌ కాలేజీల ఏర్పాట్ల కోసం చర్యలు ప్రారంభించాలని అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది.
అన్ని సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాలన్నీ ఇక ‘టిమ్స్‌’
అన్ని సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలకు ఇక నుంచి ‘తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) గా నామకరణం చేసి, అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలను ఒకే చోట అందించే సమీకృత వైద్య కళాశాలలుగా తీర్చిదిద్ది సత్వరమే వైద్యసేవలను ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐదు సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించారు. త్వరలోనే వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని కేబినెట్‌ ఆదేశించింది. వరంగల్‌, చెస్ట్‌ ఆస్పత్రి ప్రాంగణం, టిమ్స్‌, ఎల్‌.బినగర్‌ గడ్డి అన్నారం, ఆల్వాల్‌లోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. పటాన్‌చెరులో కార్మికులు, ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేశారు. కాగా హైదరాబాద్‌ నిమ్స్‌ను మరింతగా అభివృద్ధి పరచి వైద్య సేవలను విసృత పర్చేందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసి, వచ్చే కేబినెట్‌ సమావేశానికి తీసుకురావాలని వైద్యాధికారులను కేబినెట్‌ ఆదేశించింది.

57 ఏళ్లకే పెన్షన్‌ అమలు
వృద్ధాప్య ఫెన్షన్ల అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్త పింఛన్లు పెరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం పింఛన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకోనుంది. కుటుంబంలో ఒక్కరికే పింఛను పద్ధతిని కొనసాగిస్తూ భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్‌ బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సిఎం కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు. కాగా దోభీఘాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత కరెంట్‌ను ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments