ప్రజాపక్షం / నాగార్జున సాగర్/ హాలియా సొంతూరిపై ఉన్న మమకారంతో ఓ పోలీసు అధికారి ఆ ఊరి ప్రజలకు తన వంతు సేవలందించేందుకు శ్రీకారం చుట్టారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల మండలం పంగవానికుంట తండా గ్రామానికి చెందిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మాదాపూర్ డిప్యూటీ కమీషనర్ (డిసిపి)గా విధు లు నిర్వహిస్తున్న మెగావత్ వెంకటేశ్వర్లు తన ఊరికి తన చేతనైనంత సహాయం చేస్తూ ముందుకు సాగుతన్నారు. తాజాగా తను, తన కుటుంబంతో పాటు తన ఊరంతా క్షేమంగా ఉండాలని కోరుకున్న పోలీసు అధికారి ఆ గ్రామంలో ఉన్న వారందరికీ సోమవారం కరోనా పరీక్షలు చేయించి సొంతూరిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల విద్యార్ధులకు నోటుబుక్స్‌ను ఆయన కూతురు తేజస్విని, ఆయన సతీమణి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పంగవానికుంట తండా గ్రామంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామ వాసులు కరోనా బారినపడవద్దని ప్రతి ఒకరికీ ఉచితంగా కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ క్యాంపు, గుండె పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దశరథ, అనుముల మండలం ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు ఉర్లుగొండ వెంకటయ్య, హెచ్‌ఎం వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, తేరా బిక్షంరెడ్డి, గ్రామ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డిసిపి మెగావత్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనాకు ఎవరు అధైర్య పడవద్దని తగు జాగ్రత్తలు పాటిస్తే నివారించవచ్చన్నారు. గ్రామ ప్రజలకు ఉచిత పరీక్షలు అందించాలనే ఉద్దేశ్యంతో భార్య, పిల్లలతో కలిసి సొంత గ్రామానికి రావడం జరిగిందన్నారు. ప్రజలకు ఉచిత కరోనా వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులంటే కర్కశంగా ఉంటారనేది సమాజంలో సహజంగా ఉండే భావన. పోలీసు ఠానాకు వెళ్ళాలంటేనే ప్రజలు భయపడుతుంటారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది, అధికారులు ఆపదలో ఉన్న అనేక మందికి సహాయపడి తమ కేవలం కేసులను చేధించడమే కాదు సహాయం చేయడమూ తెలుసునని తమ మానవతను చాటిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కరోనా మమమ్మారిని ఎదుర్కొవడంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా పోలీసులు అందించిన సేవలు సర్వత్రా ప్రశంసలు అందుకున్నాయి. అయితే విధి నిర్వహణలో కఠినంగా ఉంటేనే నిందితుల నుంచి వాస్తవాలను రాబట్టడం సాధ్యమౌతుందనేది తమ ఉద్దేశ్యమని, ప్రజలకు సేవలందించడమే తమ విధి అనిసైబరాబాద్ మాదాపూర్ పోలీస్ డిప్యూటీ కమీషనర్ విధులు నిర్వహిస్తున్న మెగావత్ వెంకటేశ్వర్లు మరోసారి రుజువు చేశారని పంగవానికుంట తండా గ్రామ ప్రజలు ప్రశంసలు కురిపించారు.
సొంతూరిపై మమకారం… చేయూతకు శ్రీకారం
RELATED ARTICLES