పదును తగ్గని మేరీ కోమ్ పంచ్
షూటింగ్లో తప్పని నిరాశ
టోక్యో ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు
టోక్యో : టోక్యో ఒలింపిక్స్ మూడో రోజున భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల బాడ్మిం టన్, బాక్సింగ్‌లో విజయాలు లభించగా, షూటింగ్, జిమ్నాస్టిక్స్ తదితర విభాగాల్లో దారుణ ఫలితాలను ఎదుర్కొంది. ఐదేళ్ల క్రితం ఒలింపిక్స్ స్వర్ణ పతకాన్ని తృటిలో చేజార్చుకొని, రజతంతో సంతృప్తి చెందిన తెలుగు తేజం, బాడ్మింటన్ స్టార్ పివి సింధు తనకు ఎదురులేదని నిరూపిస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌లో ఆమె 21 21 తేడాతో ఇజ్రాయెల్‌కు చెందిన పోలికర్పోవాను వరుస సెట్లలో ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచే బలమైన స్మాష్‌లు, అద్భుతమైన ప్లేసింగ్స్‌తో అదరగొట్టిన సింధు తన ప్రత్యర్థిని ఏ దశలోనూ కోలుకోనియ్యకుండా దూకుడును కొనసాగిం చింది. ఫలితంగా తొలి రౌండ్ దాదాపు ఏకపక్షంగా కొనసాగింది. రెండో సెట్లో పోలికర్పోవా సర్వశక్తులు కేంద్రీకరించి, కొంత సేపు పోరాడింది. కానీ, సింధు ముందు నిలవలేక చేతులెత్తేసింది.మహిళల బాక్సింగ్‌లో వెటరన్ మేరీ కోమ్ తన పంచ్ పదును తగ్గలేని రుజువు చేసుకుంది. ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన 38 ఏళ్ల మేరీ కోమ్ టోక్యో ఒలింపిక్స్ మహిళల 51 కిలోల ఫ్లువ్రైయిట్ విభాగం తొలి రౌండ్లో రిపబ్లిక్ ఆఫ్ డొమినిక్ క్రీడాకారిణి మిగ్యులినా హెర్నాండెజ్ గార్సియాపై 4- తేడాతో గెలిచింది. మేరీ పంచ్‌లు, హుక్‌లకు హెర్నాండెజ్ తగిన సమాధానం ఇవ్వలేకపోయింది. సునాయాస విజయాన్ని నమోదు చేసిన మేరీ ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో కొలంబియాకు చెందిన వాలన్సియా విక్టోరియాతో గురువారం తలపడు తుంది. పురుషుల బాక్సింగ్ 63 కిలోల విభాగంలో మనీష్ కౌశిక్ నిరాశపరిచాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకా లను సాధించిన అతనిపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, తొలి రౌండ్లో బ్రిటన్‌కు బాక్సర్ ల్యూక్ మెక్కర్మాక్తో తలపడిన అతను 1 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు.
భారత షూటర్ల గురి తప్పింది. పతకం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్న మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 19 ఏళ్ల మను బాకర్, యశశ్విని సింగ్ దేస్వాల్ విఫలమయ్యారు. తొలి ప్రయత్నంలో 98 పాయింట్లు సంపాదించిన మను ఆతర్వాతి ప్రయత్నాల్లో వరుసగా 95, 94, 95, 94 పాయింట్లకు పరిమితమై టాప్ 8లో చోటు సంపాదించ లేకపోయింది. యశశ్విని వరుసగా 94, 98, 94, 97, 96 చొప్పున పాయింట్లు నమోదు చేసి, 13వ స్థానంతో సంతృప్తి చెందింది. పాట్ ఎయిట్‌లో స్థానాన్ని పొందడంలో విఫలం కావడంతో వీరు ఫైనల్ రౌండ్‌కు క్వాలిఫై కాలేదు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ రౌండ్లో దీపక్ కుమార్ (624.7), పన్వర్ దివ్యాంశ్ సింగ్ (622.8) వరుసగా 26,32 స్థానాల్లో నిలిచి, నిరాశపరిచారు. మెన్స్ స్కీట్ క్వాలిఫికేషన్ తొలిరోజు మూడురౌండ్లు పూర్తికాగా, భారత షూటర్లు అంగద్ వీర్ సింగ్ బజ్వా 11వ, మిరాజ్ అహ్మద్ ఖాన్ 25వ స్థానాలకు పరిమితమై, పోటీ నుంచి నిష్క్రమిం చారు. ఈ విభాగంలో మిగతా రౌండ్లు సోమవారం జరుగుతాయి.
జిమ్నాస్టిక్స్‌లో ముగిసిన పోరాటం
టోక్యో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో భారత్ పోరాటానికి తెరపడింది. ఈ విభాగంలో భారత్ తరఫున పోటీపడిన ఏకైక క్రీడాకారిణి ప్రణతి నాయక్ దారుణంగా విఫలమైంది. బెంగాల్‌కు చెందిన 26 ఏళ్ల ప్రణతి ఫ్లోర్ ఎక్సర్సైజ్, వాల్ట్, అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్‌లో కలిపి మొత్తం 42.565 పాయింట్లు సంపాదించ గలిగింది. అయితే, ఈ స్కోరు తదుపరి రౌండ్ చేరుకోవ డానికి ఉపయోగపడలేదు. ఫలితంగా ప్రణతితోపాటు భారత్ పోరుకు కూడా జిమ్నాస్టిక్స్ విభాగంలో తెరపడింది.
నిరాశపరచిన సానియా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభిమానులను నిరాశ పరచింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాన్ని గెల్చుకోవడమే తన లక్ష్యమంటూ పలుమార్లు ప్రకట నలు గుప్పించిన ఆమె మహిళల డబుల్స్ విభాగంలో అంకిత రైనాతో కలిసి బరిలోకి దిగి, మొదటి రౌండ్లోనే ఓటమిపాలైంది. ఉక్రెయిన్‌కు చెందిన కిచునాక్ లియుద్ మ్యాలా, కిచునాక్ నదియా జోడీ 6 7 తేడాతో సానియా, అంకిత జోడీపై నెగ్గి, రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.
టేబుల్ టెన్నిస్ పురుషుల రెండో రౌండ్లో భారత ఆటగాడు జ్ఞానశేఖరన్ సత్యన్ 3 సెట్ల తేడాతో హాంకాంగ్ ఆటగాడు లామ్సియూ చేతిలో పరాజ యాన్ని చవిచూశాడు. అయితే, మహిళల విభాగంలో మనికా బత్రా ప్రిక్వార్టర్స్ చేరింది. వరల్డ్ 32వ ర్యాంక్ క్రీడాకారిణి మార్గరిటా పెసోట్సాక్ను ఆమె రెండో రౌండ్లో 4- సెట్ల ఆధిక్యంతో ఓడించింది.
రోయింగ్‌లో ముందంజ
రోయింగ్‌లో భారత రోయర్లు అరుణ్ లాల్, అర్వింద్ సింగ్ జంట రాణించింది. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్లో టాప్-3లో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 27న జరిగే రౌండ్లోనూ గెలిస్తే పతక అవకాశాలు మెరుగుపడతాయి.
ఎదురులేని సింధు
RELATED ARTICLES