ప్రశ్నించే గొంతులపై రాజద్రోహం ముద్ర
కేంద్ర సర్కారు తీరుపై చాడ విమర్శ
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదలకే దక్కాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్
ప్రజాపక్షం/వరంగల్ బ్యూరోకేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తున్నదని, ప్రశ్నించే గొంతులపై రాజద్రోహం ముద్రవేసి, కేసులు పెడుతున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదలకే దక్కాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు తమతమ అనుయాయులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తున్నారని, ఇది సరైన విధా నం కాదని అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాడ మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దరలు ఆకాశాన్నంటుతున్నాయని, ప్రతి రోజు పెట్రోల్, డిజిల్ ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తున్న వారిపై రాజద్రోహం కేసు నమోదు చేస్తున్నారని అన్నారు. మేధావులపై కూడా రాజద్రోహం కేసు పెట్టడం సరికాదని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూకబ్జాదారుల చెరలో ఉన్న ప్రభుత్వ భూములలో ఎర్ర జెండాలు పాతి పేదలకు పంచి పెడతామని అన్నారు. ఎంఎల్ఎలు, ఎంపిలు, రియల్ ఎస్టేట్ దారులు యథేచ్ఛగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని చెప్పారు. వరంగల్ సమీపంలోని బొల్లికుంటలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలో సిపిఐ ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతిన విషయాన్ని చాడ వెంకట్ రెడ్డి గుర్తుచేశారు. ఆ తర్వాతే అది ప్రభుత్వ భూమి అని అధికారులు బోర్డు పెట్టారని అన్నారు. మరోవైపు సిపిఐ నాయకులపై అక్రమంగా బైండోవర్ కేసులు నమోదు చేశారని, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనూ ఇతర ప్రాంతాలలోనూ ఇలాంటి భూములు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఎలాగైతే ‘దున్నేవాడికే భూమి’ అని పోరాటం సాగించామో అదే తరహాలు ఇప్పుడు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సాధించేవరకూ భూపోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగుదారుల సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నదని తెలిపారు. అందుకే, పోడు సాగుదారులకు పట్టాలివ్వాలన్న డిమాండ్‌తో ఆదిలాబాద్ జిల్లా కొమురంభీమ్ జోడేఘాట్ స్థూపం నుంచి ఆగస్టు 4న పోడుయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. ఎనిమిదో తేదీన భద్రాచలంలో ముగుస్తుందని తెలిపారు. పోడు సాగుదారులకు పట్టాలతో పాటు దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సాధించేవరకు పోరాడుతామని చాడ స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ దళితుల ఓట్ల కోసం హుజూరాబాద్‌లో దళితబంధు అమలు చేస్తున్నారని విమర్శించారు. ఈ పథకాన్ని రాష్ట్రమంతటా వర్తింప చేసి, అణగారిన దళిత వర్గాలకు అందరికీ న్యాయం చేయాలని ఆయన కోరారు. దళితులకు ఇవ్వాల్సిన మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీలు అమలు కావాలని డిమాండ్ చేశారు. ఇటీవల వర్షాలకు అతలాకుతలం అయిన జిల్లాలలో నిరాశ్రయులను ఆదుకోవాలని, హైదరాబాద్ లో ఇచ్చిన విధంగా వరదలతో నష్టపోయిన కుటుంబాలకు పదివేల రూపాయల సహాయం అందించాలని సూచించారు.
స్టాఫ్ నర్సులను విధులలోకి తీసుకోవాలి
ప్రజాపక్షం/వరంగల్ టౌన్ : కొవిడ్ క్లిష్టపరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసిన స్టాఫ్ నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. 21 రోజులుగా ఉద్యోగం నుంచి తీసివేసిన వరంగల్ ఎంజిఎం స్టాఫ్ నర్స్‌ల దీక్షా శిబిరాన్ని ఆదివారం సందర్శించిన చాడ, కొద్దిసేపు దీక్షలో కూర్చున్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాలను సైతం దూరం పెట్టి కరోనా బాధితుల కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పని చేసిన స్టాఫ్ నర్స్‌లను ఉద్యోగం నుంచి తీసేయడం సిగ్గుచేటని, తక్షణమే వారిని విధుల్లోకి తీసుకుని పూర్తిస్థాయిలో ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యరంగంలో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా పరోక్షంగా ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం కొమ్ముగాస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, సిపిఐ నగర కార్యదర్శి షేక్ బాష్ మియా, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వలీ ఉల్లా ఖాద్రి, ఎఐటియుసి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు తోట బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య విలువలకు పాతర
RELATED ARTICLES