ఆర్టిఒ ఆఫీసులో బ్రోకర్లదే రాజ్యం?
ఆన్లైన్ చేసినా ఆగని దందా
ఏడాదికి రూ.5 కోట్ల అక్రమార్జన
ప్రజాపక్షం/మహబూబ్నగర్ బ్యూరో
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అంతం చే యాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి ఆ లక్ష్యం నెరవేరడం లేదని విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు తమంత తాము గా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకునే పరిస్థితులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రవాణా శాఖ కార్యాలయాల్లో అవినీతికి అంతం లేకుండా పోతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి బ్రోకర్లతో పనులు చేయిస్తూ లక్షలాది రూపాయలు అధికారులు వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీ రోజు వందలాది మంది వివిధ గ్రామాల నుంచి వచ్చి బ్రోకర్లనే ఆశ్రయించేలా వ్యవస్థీకృతం చేశారని వాపోతున్నారు. నేరుగా అధికారులను కలిసినా బ్రోకర్లనే సంప్రదించాలి అంటూ తిప్పి పంపిస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టిఓ కార్యాలయంలో సుమారు ఐదు నుంచి ఆరు వందల మంది బ్రోకర్లు ఉన్నారంటే పరిస్థితి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చని తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు.
మహబూబ్నగర్ ఆర్టిఒ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం రోజూ 300 నుంచి 500 దరఖాస్తుదారులు వస్తుంటారు. ఈ దరఖాస్తులకు ఆమోదం తెలపడానికి ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లెర్నింగ్ కావాలంటే ప్రభుత్వ ఫీజు రూ.450, కార్డు జారీ చేయడానికి నెలరోజుల లెర్నింగ్ తర్వాత రూ.1250 ఉంటుంది. అయితే దీనికోసం బ్రోకర్లు 4 వేల నుంచి 5 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని సమాచారం. టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్, కొత్త రిజిస్ట్రేషన్ ఇలా వివిధ పనుల కోసం ప్రతిరోజు వందలాది మంది ఆర్టిఓ కార్యాలయానికి వస్తారు. ఈ క్రమంలో ఒక్కో దరఖాస్తుకు ఒక్కో ధర నిర్ణయించిన వైనం విడ్డూరం కలిగిస్తుంది. ఎక్కువ చెల్లించిన వారికి అదే రోజు ఒరిజినల్ పత్రాలు ఇవ్వడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా కార్యాలయానికి వెళ్లినా నెల నుంచి మూడు నెలల కాలం అయినా తమ ఒరిజినల్ పత్రాలు రావడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కార్యాలయంలో ఆన్లైన్ ద్వారానే లావాదేవీలు జరుగుతాయని, అంతా పారదర్శకంగా ఉంటుందని అధికారులు ఓ వైపు చెప్తూనే, మరో వైపు బ్రోకర్లను నియమించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆర్టిఏ అధికారులు బ్రోకర్ల ద్వారా రోజుకు లక్ష నుంచి రెండు లక్షల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రకంగా ఏడాదికి సుమారు 5 కోట్ల రూపాయల వరకు అక్రమంగా వెనకేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతగా డిమాండ్ ఉన్న ఆర్టిఒ ఉద్యోగానికి రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో ఎవ్వరూ ఏమీ అనలేకపోతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఇటీవల అభివృద్ధి పనులు ముమ్మరమైన నేపథ్యంలో ఇసుక అక్రమంగా తరలించడం ఒక ఎత్తయితే, కెపాసిటీకి మించి లోడుతో వస్తున్న లారీల యజమానుల దగ్గర నుంచి కూడా ఆర్టిఒ అధికారులు భారీగానే వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతలా సంపాదిస్తున్న ఆర్టిఏ అధికారులు ఏదైనా రాజకీయ కార్యక్రమం జరిగినప్పుడు ఆ దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి సైతం ముందు ఉంటున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి.
పనికో రేటు… వారి రూటే సపరేటు
RELATED ARTICLES