మండుతున్న ఇంధన ధరలు
తాజాగా పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంపు
చెన్నైలోనూ రూ. 99కి చేరువైన పెట్రోల్
న్యూఢిల్లీ : పెట్రో మంటలు ఆరడం లేదు. ఆకాశమే హద్దుగా ధరలు దూసుకెళ్తున్నా యి. ఒకవైపు కరోనా భయాందోళనల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ప్రజలు… మరోవైపు ఇంధన ధరల భగభగలతో బెంబేలెత్తిపోతున్నారు. ధరల ప్రభావం అన్నింటిమీదా పడుతుండడంతో బతకడం ఎలా అం టూ వాపోతున్నారు. ఇక అన్నదాత కష్టాలు చెప్పనక్కర్లేదు. కాగా, గురువారం కూడా పెట్రో ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మా ర్కెట్లో ముడి చమురు ధర పెరగడంతో అది జాతీయ మార్కెట్‌పై ప్రభావం చూపింది. దీంతో పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్ లీటర్‌కు 27 పైసలు వరకు పెరిగింది. ధరలు పెంచుతూ దేశీయ ఇంధన రిటైలర్లు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. తాజా పెంచిన ధరలు దేశంలో సరికొత్త గరిష్టాలను చేరాయి. దీంతో పెట్రోల్ ధర చెన్నైలో లీటర్‌కు రూ. 99 మార్కు సమీపానికి చేరింది. ఢిల్లీలో పెట్రోల్ ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకొని రూ. 97.76గా, డీజిల్ ధర రూ. 88.30గా ఉన్నది. వ్యాట్, రవాణా చార్జీలు వంటి స్థానిక పన్నుల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో ఇంధన ధరల్లో తేడాలు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలోనే తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, జమ్మూకశ్మీర్, ఒడిశా, లడఖ్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 100 మార్కును దాటింది. మెట్రో నగరాలైన ముంబయి, హైదరాబాద్, బెంగళూరులో కూడా పెట్రోల్ వంద రూపాయలు దాటింది. ఇప్పుడు చెన్నైలో కూడా ఆ మార్కుకు అతి సమీపంలో ఉంది. గురువారం నాటి పెంపుతో చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.88గా ఉండగా, డీజిల్ ధర రూ. 92.89గా ఉంది. ముంబయిలో పెట్రోల్ ధర రూ. 103.89, డీజిల్ ధర రూ. 95.79కి చేరింది. దేశంలో అత్యధికంగా వినియోగిస్తున్న డీజిల్ ధరలు ఈ నెల ఆరంభంలోనే రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్, హనమాన్గఢ్లో రూ. 100 దాటింది. ఇప్పుడు ఒడిశాలోని రెండు ప్రదేశాల్లో ఆ స్థాయి దాటింది. అయితే దేశంలో ఇంధన ధరలు పెరగడం ఇది 29వ సారి. మొత్తంగా పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 7.36, డీజిల్‌కు రూ. 7.77 భారాన్ని అదనంగా సామాన్యులపై చమురు సంస్థలు మోపాయి. మే 4వ తేదీ నుంచి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సహా ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన సమయంలో దాదాపు 18 రోజుల పాటు విరామాన్నిచ్చిన సంస్థల ఆ తరువాత ధరలను సవరించడం మొదలు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో 15 రోజుల ఇంధన బెంచ్‌మార్క్ ధర సగటు ఆధారంగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి.
వానాకాలంలో భగభగలు
RELATED ARTICLES