రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కోరిన కేంద్రం
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) ప్లస్ టూ పరీక్షల నిర్వహణ పై నెలకొన్న సస్పెన్స్ కొనసాగుతునే ఉంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం దృశ్య మాధ్యమ రూపంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన ఉన్నత స్థాయి సమావేశం చివరికి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. అయితే, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను సేకరిస్తామని ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఈనెల 25వ తేదీ, మంగళవారంలోగా అభిప్రాయాలను తెలియచేయాల్సిందిగా రాష్ట్రాలను కోరినట్టు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత, ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ప్లస్ టూ పరీక్షలపై సందిగ్ధత నెలకొందని, కాబట్టి సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావడేకర్, సంజయ్ ధోత్రేతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ మంత్రులు, సిఎస్‌లు, అధికారులు పాల్గొన్నారు.
జూలైలో పరీక్షలు : ఇంటి వద్ద నుంచే రాసే విధానంలో సిబిఎస్ఇ ప్లస్ టూ పరీక్షలు జూలైలో జరిగే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కొవిడ్ ప్రోటోకాల్‌ల మధ్య గత సంవత్సరం మాదిరిగానే జూలైలో పరీక్షలు జరుగుతాయని ఈ వర్గాలు అంటున్నాయి. పరీక్షలను నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై జరిగిన సమావేశంలో పాల్గొన్న పలువురు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణపై 19 ప్రధాన అంశాలపై చర్చించారని, వీటికి చాలా రాష్ట్రాల నుంచి సానుకూల మద్దతు వచ్చిందనీ సమాచారం.
సిబిఎస్ఇ ప్లస్ టూ పరీక్షలపై వీడని సస్పెన్స్
RELATED ARTICLES