19,602 ఓట్ల మెజార్టీతో గెలిచిన భగత్
సీనియర్ నేత జానారెడ్డి ఓటమి
డిపాజిట్ కోల్పోయిన బిజెపి
ప్రజాపక్షం / నల్లగొండ ప్రతినిధి
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో దివంగత శాసన సభ్యులు నోముల నర్సింహ్మాయ్య తనయుడు టిఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిపపై భగత్ 19,602 ఆధిక్యంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలిచారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం సిట్టింగ్ ఎంఎల్‌ఎ నోముల నర్సింహ్మాయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో గత నెల 17వ తేదీన ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద గల తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో జరిగింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే టిఆర్‌ఎస్ అభ్యర్ధి భగత్ మొదటి రౌండులోనే 2,753 ఓట్ల ఆధిక్యంతో ప్రారంభమై చివరి వరకు స్పష్టమైన ఆధిక్యం కనపరుస్తూ వచ్చారు. కేవలం పదో రౌండులో మాత్రమే జానారెడ్డి 175 ఓట్ల మెజార్టీ కనబర్చారు. ప్రతి రౌండులో మెజార్టీతో దూసుకెళ్లిన భగత్ చివరి 26వ రౌండు వరకు 18,780 ఓట్ల మెజార్టీతో పాటు పోస్టల్ బ్యాలెట్‌లో వచ్చిన 822 ఓట్లను కలుపుకుని 19,602 ఓట్ల మెజార్టీతో భగత్ గెలిచారు. ఇదిలా ఉండగా గత ఎన్నికలో నోముల నర్సింహ్మాయ్య చేతిలో ఓటమి పాలైన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డికి సానుభూతి వర్కట్ అవుతుందని అందరూ ఊహించినా అందుకు విరుద్దంగా ప్రజలు తీర్పునిచ్చారు. గతంలో జరిగిన దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నిక, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కొంత ఆశాజనకంగా ఉన్నా బిజెపి సాగర్ నియోజకవర్గంలో అదే తీరును ప్రదర్శించి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ నియోజకవర్గంలో ప్రజల విశ్వాసం పొందలేక, కనీస డిపాజిట్ కూడా దక్కించుకోని పరిస్థితి నెలకొన్నది. కుల సమీకరణ నేపథ్యంలో జరిగిన సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం, సీనియర్ నేత జానారెడ్డిని బరిలో నిలిపారు. టిఆర్‌ఎస్ బిసి సామాజిక వర్గంతో పాటు నర్సింహ్మాయ్య సానుభూతితో విజయం సాధిస్తామని ఆశించి ఆయన తనయుడు భగత్‌ను బరిలో నిలిపారు. అయితే సాగర్ నియోజకవర్గంలో గిరిజన తెగకు చెందిన ఓటు బ్యాంకును తమవైపుకు మలుపుకోవాలని ఆశించి బిజెపి యువ నాయకులు డాక్టర్ రవి నాయక్ అనూహ్యాంగా బిజెపి కేంద్ర కమిటీ టికెట్ ఇచ్చి బరిలో నిలిపి కేంద్ర మంత్రులు, కేంద్ర, రాష్ట్ర నాయకత్వం సాగర్‌లో తిష్ఠవేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించినా బిజెపి కనీసం పట్టు సాధించలేకపోయింది. ఇక నియోజకవర్గంలో బిసి సామాజిక వర్గానికి చెందిన నోముల భగత్ తండ్రి నర్సింహ్మాయ్య ఆశయాలు సాధిస్తానంటూ బరిలో నిలిచి రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు , ఎంపి, ఎంఎల్‌ఎ నియోజకవర్గంలో ఇంచార్జీలుగా నియమించి నియోజకవర్గ క్యాడర్‌తో కలిసి తనదైన శైలీలో ప్రచారం నిర్వహించారు. మరో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గంలో రెండు సార్లు పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, నర్సింహ్మాయ్య పేద ప్రజల పక్షాన పని చేసిన తీరు ఆయన పోరాటాలను ప్రజలకు వివరించడం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, గిరిజన, బిసి కుటుంబాలను ఆకర్షించారు.
నాగార్జునసాగర్‌లో.. టిఎర్‌ఎస్ విజయం
RELATED ARTICLES