అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్
చెన్నై: కెరీర్లో తన 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ డబుల్ సెం చరీతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే రూట్ అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక్కడి చిదంబరం స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన రూట్, తన జట్టు భారీ స్కోరుకు సహకరించాడు. అంతేగాక, కెరీర్లో వందో టెస్టు ఆడుతూ డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అశ్విన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న రూట్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఎవరూ అందుకోలేకపోయిన అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. సిక్సర్‌తో డబుల్ సెంచరీ చేసిన తొలి ఇంగ్ల్ండ క్రికెటర్‌గా కూడా అతను రికార్డుల్లోకి ఎక్కాడు. అంతేగాక, వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీలు సాధించిన ఇంగ్లిష్ కెప్టెన్.. వరుసగా మూడు మ్యాచుల్లో 150కిపైగా పరుగులు చేసిన ఆటగాడిగా మరో ఘనత సాధించాడు. దీనితో ఎలైట్ క్లబ్లో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మన్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ సరసన అతనికి స్థానం దక్కింది. 1937లో ఇంగ్లండ్‌పై బ్రాడ్‌మన్ ఈ అరుదైన మైలురాయిని చేరాడు. కాగా, రూట్‌కు ముందు ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే ఈ రికార్డును అందుకున్నారు. వారిలో టామ్ లాథమ్ (న్యూజిలాండ్), ముదస్సర్ నజర్ (పాకిస్తాన్), జహీర్ అబ్బాస్ (పాకిస్తాన్), వాలీ హమ్ండ్ (ఇంగ్లాండ్), కుమార్ సంగక్కర (శ్రీలంక) ఉన్నారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించి, ఓ డబుల్ సెంచరీ, 150కి పైగా స్కోర్లు సాధించిన రూట్ భారత పర్యటనలోనూ అదే స్థాయిలో రాణిస్తున్నాడు. మొత్తం మీద 377 బంతులు ఎదుర్కొని, 19 ఫోర్లు, రెండు సిక్సర్లతో 218 పరుగులు చేసిన అతను నదీమ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. మ్యాచ్ రెండో రోజు, శనివారం ఉదయం మూడు వికెట్లకు 263 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇంగ్లాండ్ ఆటను కొనసాగించింది. అప్పటికి 128 పగులతో క్రీజ్‌లో ఉన్న రూట్ ఆతరావత కూడా అదే స్థాయిలో భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అతనికి చక్కటి సహకారాన్ని అందించిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ 82 పరుగులు సాధించి, షాబాజ్ నదీమ్ బౌలింగ్‌లో చటేశ్వర్ పుజారాకు చిక్కాడు. ఒలీ పోప్ 34 పరుగులు చేసి ఔట్కాగా, 477 పరుగుల స్కోరువద్ద రూట్ వికెట్ కూలింది. జొస్ బట్లర్ (30), జొఫ్రా ఆర్చర్ (౦) కూడా పెవిలియన్ చేరగా, ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 555 పరుగులు సాధించింది. అప్పటికి డామినిక్ బెస్ (28), జాక్ లీచ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో ఇశాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, షాబాజ్ నదీమ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
రూట్ రికార్డు ‘డబుల్’
RELATED ARTICLES